నేడు సుదినం నేడు కోనేటిరావు జన్మదినం.
మహారాజ రాజశ్రీ హెడ్డు గుమస్తా జటావల్లభుల కోనేటిరావు
పంతులుగారి నలభై అయిదో జన్మదినం ఈరోజన్న
సమాచారం మరారాశ్రీకే తెలియదు. కోనేటి జన్మదినం
జాతీయ పర్వదినం కాదు. దీనికొక ప్రత్యేకత నాపాదించి
పండుగ చేసుకోవలసిన అవసరం కోనేటిరావుకే లేక
పోయింది. తూర్పు ఆసియా దేశాలలో ప్రళయం, పశ్చిమ
యూరప్ దేశాల ప్రణయం. మధ్య ప్రాచ్యంలో మంత్రసాని
గండం మొదలైన ప్రపంచప్రచండవార్తల మధ్య ఇందివర
కెప్పుడో నలభైనాలుగేళ్ళ కిందట కోనేటి రావనే అసామీ
ఒకానొక పల్లెటూర్లో జన్మించాడన్న కబురు, ఈ రచయతని
తప్ప యింకెవ్వరినీ ఉత్సాహపరచ లేకపోయింది.
అయినా ఈ దినం కోనేటిరావు పుట్టిన రోజని తెలిసినప్పటికీ ఈ రచయిత "డాండ డడాంగ డాండ నినదంబులజాండమునిండ మత్తవేదండము నెక్కి "ఈ సంతోష వార్తని చాటలేకపోతున్నాడు. దీన్ని ఎలా వర్ణించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. "నేడు సుదినం" అని మాత్రం అని ఊరుకున్నాడు. ఇది ఎంచేత సుదినమో ఈ రచయితకి కూడా తెలియదు.
కిందటేడు కూడా ఇలాగే నలభై నాలుగో కోనేటి మైలురాయి నామామాత్రావశిష్టమై పోయింది. మీదటికైనా ఇంతకన్న ఉత్తమ పరిస్థితులలో కోనేటిరావు పుట్టినరోజు పండుగ చేసుకోగల సూచనలు సుతరామూ కనిపించవు. ఈ లోపున అమెరికాలో కొందరి పెద్దల ఆశీర్వాదమువల్ల యుద్దమే వచ్చేస్తే సరి, మరి కోనేటిరావే కనిపించడు.
కోనేటిరావుగారి నలభై అయిదో జన్మదినంనాడు వాళ్ళ ఆఫీసుకి సెలవు లేదన్న విషాద విషయం ఒక్కటి మినహాయిస్తే తతిమ్మా లాంఛనాలన్నీ - కోనేటిరావుకి తెలియకుండా సక్రమంగానే జరిగినట్లు చెప్పవచ్చును. తెల్లవారుజామున మలయానిలం మందమందంగా ప్రసరించింది. అదృష్టవశాత్తూ ఇది వసంతకాలం కావడంవల్ల మామిడిచెట్లు చిగిర్చడం, ఆ చిగుళ్ళు మెసవి కొన్నికోకిలలు పంచమశ్రావ్యంగా వగర్చడం జరిగింది. తిరుచినాపల్లి రేడియోలో యెవరో సుప్రసిద్ధ సోదరులు మంగళవాయిద్యాలు మోగించారు. చాలా రోజులనించీ సాక్షాత్కరించని చాకలివాడు (చిరిగిపోయినవైతేనేం) బట్టలనన్నింటినీ బాకీ పెట్టకుండా తీసుకొచ్చాడు. భార్య బహురుచ్యమైన పిండివంటలు చేసి ఆఫీసు వేళకి ముందుగా వడ్డించింది. మస్తుగా భోజనం చేసి అవిఘ్నమస్తుగా కోనేటిరావు ఆఫీసుకి చేరుకున్నాడు.
కోనేటిరావు ఆఫీసు యాత్రని కొండొకచోట ఈ రచయిత ఇదివరకు వర్ణించాడుగాని పునరుక్తి అవుతుందని కూడా వెనుదీయకుండా ఆ ప్రయాణాన్ని మళ్ళీ వర్ణించడానికితడు ఉవ్విళ్ళూరుతున్నాడు. అసలే కుర్మావతారం అరమైలు ఆఫీసు దూరం రొప్పుతూ రోజుతూ కోనేటిరావు ఇంటినుండి ఆఫీసుకి బయలు వెడలెను. "వెడలెను కోదండపాణి" అని గాని, "రాజు వెడలె రవితేజముతోడ" అని గాని ఈ వెళ్ళడాన్ని ఎవ్వరూ పాడడానికి సాహసించరు. ఒక గుమాస్తా తన పుట్టిన రోజున ఆఫీసుకి వెళ్ళాడన్న విషయంలో సంగీతాన్ని కవిత్వాన్నీ ప్రోత్సహించే పరిద్రవం యత్కించిత్తూ ఉండనేరదు. ఆపసోపాలు పడుతూ ఆఫీసుకి పోతున్న ఒక మానవుడి మహాప్రస్థానం సౌందర్యవంతమైన సంఘటన కాదు. ఇదేమీ హైదరాబాదు ప్రతినిధుల ఫారిస్ ప్రయాణం కాదు. ప్రధానమంత్రిగారి సరిహద్దు పర్యటన కాదు. కోనేటిరావు అరమైలు దూరాన్ని అవలీలగా లంఘించి శాశ్వతంగా ఒక కొత్త రికార్డు స్థాపించాడనడం సత్యానికి అనేక లక్షల మైళ్ళదూరం. కోనేటిరావు రోజులాగే ఈ రోజు కూడా ఈసురోమంటూ జీవిత సముద్రంలో ఈదుతున్నాడు. ఇదేమీ రసవంతమైన సన్నివేశం కాదని ఈ రచయిత ఇంకోసారి మనవి చేసుకుంటున్నాడు.
కోనేటిరావు జీవితరంగంలో ఏమూలనుంచి కూడా ఏ మాత్రమూ కవిత్వమనేది ప్రసరించకుండా కట్టుదిట్టాలు జరిగిపోయాయి. ఎందుచేత అని ప్రశ్నిస్తే ఏ జవాబు రాదు సరికదా ఎన్నో ప్రశ్నలు బయలు దేరుతాయి.
ఏ శాపంవల్ల కోనేటిరావు తన నలభై అయిదో పుట్టినరోజు హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎండలో ఈదవలసి వచ్చింది. అతని పిల్లల చొక్కాలూ లాగులూ అతుకుల బొంతలు కావడానికి కారణమేమిటి? దాక్షిణ్యంలేని ఏ డుర్విధిశాసనం వల్ల కోనేటిరావు తలమీద చాలామట్టుకు జుట్టు ఊడిపోయి బట్టతల ప్రాప్తించడమే కాక ఉన్నజుత్తూ తెల్లబడిపోయింది? అతని చెమటతో తడిసిన రూపాయలకి అర్ధం లేకపోవడం ఎంచేత?
ఏం ప్రయోజనంలే ఇలాంటి ప్రశ్నలువేస్తే?
కోనేటిరావు తన నలభై అయిదో పుట్టినరోజున ఆఫీసులో కుర్చీలో
కూర్చుని పనిచేసుకుంటున్నాడు. ఇదివరకు అతన్ని కనబడకుండా
బంధించిన సంకెళ్ళు ఇంగ్లాండులో తయారైనవి ఇప్పటి సంకెళ్ళను
ఇండియా తయారు చేస్తోంది. ఇవి స్వదేశీ సంకెళ్ళు.
ఏమైనా ఇది సుదినం ఇది కోనేటిరావు జన్మదినం.