24. నారదా! వశ ఎవరి ముందు వ్యక్తమగుచున్నదో, దేవతలు దానిని యాచించుచున్నారు. అది తెలిసిన నీవు దేవతల సహితుడవై అచటికి చేరుచున్నావు.
25. బ్రాహ్మణులు యాచించినను వశను పరమ ప్రియముగా భావించి ఇవ్వనివానిని వశ అల్పపశువంతుని సంతాన రహితుని చేయుచున్నది.
26. బ్రాహ్మణుడు అగ్ని, సోమ, కామ, మిత్ర వరుణుల పక్షమున యాచించుచున్నాడు. అతనికి లేదన్నవాడు ఆ దేవతలను అవమానించినవాడు అగుచున్నాడు.
27. గోపతి వశ విషయమున స్వయముగ నిర్ధారించుకొనునంతదాక వశ గోవులతోనే ఉండును. నిర్ధారణ జరిగిన పిదప ఇంట ఉండరాదు.
28. నిర్థారణ జరిగిన పిదప సహితము గోవులందు ఉంచుకున్న వానిని దేవతలు అవమానించి అతని ఆయువును సంపదను నష్టపరచుచున్నారు.
29. వశ దేవతల నిధి రూపము. అది అనేక రీతుల సంచరించును. స్థాన నాశము చేయదలచినపుడు అనేక రూపములచే వ్యక్తమగుచున్నది.
30. వశ తన స్థానమును నాశనము చేయదలచినపుడు తనను వ్యక్త పరచును, బ్రాహ్మణుడు యాచించవలెననుకొనును.
31. వశ సంకల్పించును. దాని సంకల్పము దేవతలను చేరుచున్నది. అప్పుడు బ్రాహ్మణుడు వశను యాచించ వచ్చుచున్నాడు.
32. పితరులకు పిండము పెట్టుట దేవతలకు యజ్ఞము చేసినట్లగుచున్నది. రాజులు వశను దానము చేసి మాతృ క్రోధమునకు పాత్రులు కాకున్నారు.
33. రాజులకు వశ మాతృమూర్తి యని మొదటనే ప్రకటించబడినది. వశను బ్రాహ్మణులకు దానము చేయుటను 'అనర్పణము' అనుచున్నారు.
34. స్రుచలో తీసికొన్న ఘృతము అగ్నికి అర్పితము అయినట్లు వశను బ్రాహ్మణులకు ఇవ్వనివాడు అగ్నికి ఆహుతి యగుచున్నాడు.
35. దాతకు పురోడాశ రూప వత్స గల చక్కని పాలిచ్చుగోవు లభించుచున్నది. అట్టి వాని సమస్త కోరికలను వశ తీర్చుచున్నది.
36. దాతకు వశ యమ రాజ్యమున సకల కోరికను తీర్చుచున్నది. దానమును అడ్డగించువాడు నరకమునకు పోవుచున్నాడని పెద్దలు చెప్పుచున్నారు.
37. వశను విడువని వానిపై కోపించి వశ ఇట్లను చున్నది. గొడ్రాలినగు నన్ను ఉంచుకున్నవాడు మృత్యువాత పడునుగాక.
38. వశ గొడ్రాలని తెలిసి దానిని పచనము చేయువాని పుత్ర, పౌత్రులను బృహస్పతి యాచకులను చేయుచున్నాడు.
39. వశాగోవు ఇతర గోవులకు వ్యధలు కలిగించుచున్నది. గోపతి దానిని దానము చేయకున్న అది అతనికి విషప్రాయము అగుచున్నది.
40. బ్రాహ్మణులకు దానము చేసిన వశ పశువులకు మేలు చేయుచున్నది. దేవతలకు హవి రూపమున ఇవ్వబడి అది వశకు ప్రియమగుచున్నది.
41. దేవతలు యజ్ఞము నుంచి వచ్చి వశను కల్పించినారు. అప్పుడు నారదుడు 'విలప్తీ భీమ'ను స్వీకరించినాడు.
42. అప్పుడు దేవతలు మీమాంస చేసి 'ఈ వశ అవశయమగుచున్నది' అన్నారు. అప్పుడు నారదుడు ఇది 'వశానాం వశతమా' అన్నాడు.
43. నారదా! నీవు విద్వాంసుడవు. అందువలన అడుగుచున్నాను. మానవ లోకమున ఎన్ని విధముల 'వశలు' ఉన్నవి? అబ్రాహ్మణుడు దేనిని భుజించరాదు?
44. బృహస్పతీ! సంపదను కోరు అబ్రాహ్మణుడు 'విలప్తి' 'సూతవశ' 'వశ' వీనిని భక్షించరాదు?
45. 'నారదా! నమస్కారము. వశ విద్వాంసుల స్తుతియోగ్య. వీనిలో అతి భయంకరమగునది ఏది? దేనిని దనము చేయకున్న పరాభవము కలుగును?'
46. బృహస్పతీ! సంపదను కోరునట్టి అబ్రాహ్మణుడు 'విలప్తి' సూతవశ' 'వశ' వీనిని భక్షించరాదు.
47. 'విలప్తి' 'సూతవశ' 'వశ' ఇవి వశాభేదములు. వీనిని బ్రాహ్మణులకు అర్పించినచో ప్రజాపతికి క్షోభ కలిగించువారు కాకున్నారు.
48. ఇంటిలో భీమ వశ ఉండి దానిని యాచించుటకు వచ్చినవానితో 'బ్రాహ్మణా! ఇది మీ కొరకే హవి రూపమై ఉన్నది' అనవలెను.
49. దేవతలు వశతో ఇట్లన్నారు. ఋగ్భేదము వలన వీరలు మాకు నిన్ను ఇవ్వలేదు. అందువలన వారు పరాజితులు అగుచున్నారు.
50. భేద మూలమున ఇంద్రుడు యాచించినపుడు వశను దానము చేయని వానిని దేవతలు అహంకార చక్రమున పడవేసి నష్ట పరచుచున్నారు.
51. వదరు బోతులు వశను దానము చేయరాదు అన్నంత అతని మూర్ఖత్వమున ఇంద్రుని క్రోధమున పడి విరుగుచున్నాడు.
52. గోపతి వద్దకు వెళ్లి మూర్ఖుముగా దానము చేయరాదు అన్నవాడు రుద్రుని అస్త్రములకు గురియగుచున్నాడు.
53. హుత లేక ఆహుత వశను వండినవాడు జిమ్హ దేవతలను, బ్రాహ్మణులను అణచిన వాడగుచు లోకమున దుర్గతి పాలగుచున్నాడు.
వ్యాఖ్య :
వేదములందు కులముల ప్రాధాన్యత కనిపించదు. కులముల పేర్లు ఒక కులపు ప్రాముఖ్యత - ఆధిక్యత కనిపించకున్నవి. కాని ఈ సూక్తమున బ్రాహ్మణులు, అనుపదము విరివిగా వాడబడినది. వశాదానము విషయమున వారికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడినది.
వేదమున కన్న ముందు నేను రచించిన వచన శ్రీమహాభారతమున బ్రాహ్మణుని మేధావి అని వ్యాఖ్యానించినాను. వేదమునకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు సహితము బ్రాహ్మణుని మేధావిగనే వ్యాఖ్యానించుట విశేషము.
ఈ సూక్తమున మేధావి కాని వానిని కూడ బ్రాహ్మణుడుగా చెప్పుట కనిపించుచున్నది.
యదన్యే శతం యాచేయుర్బ్రాహ్మణా గోపతిం వశమ్
అథేనం దేవా అబ్రూవన్నేవం హ విదుషో వశా || 22
వందమంది బ్రాహ్మణులు వశను యాచించినను వశ విద్వాంసునిదే అగుచున్నదని దేవతలు వచించుచున్నారు.
ఇది కాలమున వచ్చిన మార్పు వలె కనిపించుచున్నది. వేదములను కూర్చినది ఒకే కాలమున కాని రచన జరిగినది మాత్రము ఒకే కాలము కాదు. కాల వ్యత్యాసము వేదమునకు ఎంతో చెప్పుట జరగలేదు. అంతేకాదు ఒక సూక్తమునకు ఎంత కాల వ్యత్యాసమున్నదో చెప్పుట జరుగలేదు.
ఇది ప్రాచ్య దృష్టికి లోపము కాదు. ఏలనన ప్రాచ్యులకు కాలము అనంతము. చరిత్ర అనంతరము. మనము నేడు అలవరించుకున్న చారిత్రిక దృష్టి పాశ్చాత్యులది. వారికి కాలము కొంచెము. వారి చరిత్ర కొంచెపుది.
భారతీయ తాత్త్వికత "సర్వం ఖల్విదం బ్రహ్మ" ఇది సర్వము బ్రహ్మయే అను సిద్ధాంతము మీద ఆధారపడి ఉన్నది. జరిగినది, జరుగుచున్నది, జరుగనున్నది కేవలము భగవదాజ్ఞ వలననే జరుగుచున్నదని మన విశ్వాసము. అందువలన మనము కాలమునకు కాని, వ్యక్తులకు గాని అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించదు.
కాలక్రమమున ఒక వృత్తికో, ఒక వర్గమునకో, లోపము కలిగినపుడు దానిని నిలుపుటకు లేక ఉద్ధరించుటకు కొన్ని సౌకర్యములు కలిగించుట జరుగుచున్నది. నేడు మనసు కొన్ని వర్గములకు ప్రత్యేక 'రిజర్వేషన్లు' కల్పించుచున్నాము. బ్రాహ్మణుల విషయమున కూడ ఇటువంటిది జరిగి యుండవచ్చునని నా అభిప్రాయము.
వశ గొడ్డుబోతు ఆవు. దీని వలన ప్రయోజనము లేదు. ఇది యజమానికి భారమగుచున్నది. దీనివలన ఇతర గోవులకు హాని కలుగుచున్నదనియు చెప్పినాడు. అట్టి దానిని గోపతి వద్ద ఉంచుట ఇతర పశువులకు హాని కలిగించుట యగుచున్నది. కావున దానిని వదిలించుకొనవలసి ఉన్నది. కావున వశను బ్రాహ్మణునకు దానముచేయమనుట గోపతి శ్రేయస్సునకే అగుచున్నది.
బ్రాహ్మణునకు గోవులు ఉండవు. కావున అతడు వశను ఉంచుకొనవచ్చును. కాని అందువలన అతనికి కలుగు ప్రయోజనమేమి? వశ అతనికి భారము మాత్రము అగుచున్నది.
ఇచట కులములు, లేక సమాజ విభజన రెండుగా జరిగినట్లున్నది. 1. బ్రాహ్మణులు. 2. అబ్రాహ్మణులు. అబ్రాహ్మణులు వశను వండరాదు అను నిషేధము విధించినాడు. బ్రాహ్మణుడు సహితము ఇంట వండరాదు. వశ పురోడాశముగ వినియోగమగునని చెప్పినాడు.
వశను వదిలించుకొనుట ఏ ఒక్కని ప్రయోజనము కొరకు గాక సమాజ ప్రయోజనమునకని అర్థమగుచున్నది.
అయిదవ అనువాకము
మొదటి పర్యాయ సూక్తము - 5
బ్రహ్మగవీషయమేతత్ సూక్తమ్ 1. బ్రాహ్మణస్య గౌర్భ్రహ్మగవీ. బ్రాహ్మణుని గోవు బ్రహ్మగవి - ఇది బ్రాహ్మగవీ విషయక సూక్తము.
1. ఇది శ్రమచేతను, తపస్సు చేతను సృష్టించబడినది. మంత్రము, విత్తము, ఋతమును ఆశ్రయించి ఉన్నది.
2. సత్యముచే ఆవృతమై, విత్తముచే ప్రావృతమై, యశస్సుచే పరీవృతమై ఉన్నది.
3. లోకములకు ధనమగునది స్వధచే పరిహితమై, శ్రద్ధచే పర్యూఢమై, దీక్షచే రక్షితమై, యజ్ఞమున ప్రతిష్ఠితమై ఉన్నది.
4. ఇది బ్రహ్మ పదము. దీనికి బ్రాహ్మణుడు అధిపతి యగుచున్నాడు.
5.6. అట్టి బ్రహ్మగవిని అపహరించునట్టియు, బ్రాహ్మణుని ధిక్కరించునట్టియు క్షత్రియుని సత్యబలము, పుణ్య లక్ష్మి అతనిని విడిచి పోవుచున్నది.
రెండవ పర్యాయ సూక్తము - 6
1-5. బ్రహ్మగవిని అపహరించునట్టియు, బ్రాహ్మణుని ధిక్కరించునట్టియు క్షత్రియుని 'ఓజశ్చ తేజశ్చ సహశ్చ బలంచ వాక్ చేన్ద్రి యంచ శ్రీశ్చ ధర్మశ్చ - బ్రహ్మచ క్షత్రంచ రాష్ట్రంచ విశశ్చ త్విషశ్చ యశశ్చ వర్చశ్చ ద్రవిణంచ - ఆయుశ్చ రూపంచ నామచ కీర్తిశ్చ ప్రాణశ్చా పానశ్చ చక్షుశ్చ శ్రోత్రంచ - పయశ్చ రసశ్చాన్నం చాన్నాద్యం చత్రంచ సత్యం చేష్టంచ పూర్తంచ ప్రజాచ పశవశ్చ అవన్నియు అతనిని విడిచిపోవుచున్నవి.
మూడవ పర్యాయ సూక్తము - 7
1. బ్రాహ్మణగవి భయంకరము, కూల్బజావృతము, పాప విషము, సాక్షాత్తు కృత్య యగుచున్నది.
2. దీనియందు సర్వ ఘోరములు, సర్వ మృత్యువులు ఉన్నవి.
3. దీనియందు సర్వ క్రౌర్యములు, సర్వ పురుష వధలు ఉన్నవి.
4. బ్రహ్మగవిని గుంజుకొనుట బ్రహ్మత్వమునకు హాని, దేవతా సంహారము అగుచున్నది. అట్టి వానిని మృత్యువు చెక్క పాద బంధములలో ఇరికించుచున్నది.
5. బ్రాహ్మణుని ఆయువునకు నష్టము కలిగించు వానికి బ్రహ్మ గవ్య క్షయంకరి, శతవధ అగుచున్నది.
6. కావున బ్రాహ్మణుని గోవు దుర్ధర్షయని ఎరుంగునది.
7. అది వజ్రాయుధము వలె పరుగులిడునది. అగ్ని వలె పైకి ఎగురునది అగుచున్నది.
8. అది సంహారక రుద్రుని వంటిదై, గిట్టలచే నేలను మోదుచు ఆయుధ రూపము దాల్చుచున్నది.
9. అది పదను పెట్టిన కరవాలము వంటిదై, వజ్రమై, అంబారావములు చేయుచు తళుక్కుమనుచున్నది.
10. హుంకరించుచు మృత్యురూపయై తోక త్రిప్పుచు ఉగ్రదేవతా రూపయగుచున్నది.
11. చెవులు కదలించుచు, ఆయువును క్షీణింపచేయుచు, మూత్రము వదలుచు, రాజ్యలక్ష్మి కారకము అగుచున్నది.
12. పాలు పితుకునపుడు ఆయుధ రూపయై, పితికిన పిదప శీర్షక్తి రోగ రూపయగుచున్నది.
13. దగ్గర నిలిచిన చెల్లాచెదరు చేయును. దూరమున ఉన్నంత పరస్పర యుద్ధము కలిగించును.
14. ముఖమును ముట్టిన వానిని గురిచేయును. బాదినవానికి దుర్గతి కలిగించును.