Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 116


    15. కూర్చొనుచున్నప్పుడు పాప విషము, కూర్చున్నంత మృత్యుముఖ అగుచున్నది.

    16. బ్రాహ్మణునకు హాని కలిగించువాని వెంటపడి వాని ప్రాణము తీయుచున్నది.


                                   నాలుగవ పర్యాయ సూక్తము - 8

    1. వైరులను వికృతులను చేయుచు, పౌత్రాదులను విడగొట్టుచున్నది.

    2. హరించునపుడు దేవతల చేతి ఆయుధమై, హరించినంత క్షయంకరి యగుచున్నది.

    3. అధిధీయమాన పాపమయి కాఠిన్య రూప అగుచున్నది.

    4. ప్రయస్యంతి యైనపుడు విషరూపము, పయస్తయైనపుడు రోగరూపయగుచున్నది.

    5. పక్వమగునపుడు వ్యసనకారి, పక్వమైనంత దుస్వప్నకారి యగుచున్నది.

    6. పర్యాక్రయమాణ కాగా మూలచ్చేదియై పర్యాకృతగా క్షయము కలిగించుచున్నది.

    7. గంధముచే జ్ఞాన శూన్యుని చేయుచు, ఉద్ఘ్రియమాణగా శోకప్రదయగుచు, ఉద్ఘృతగా సర్ప విషము అగుచున్నది.

    8. ఉపహ్వియమాణగా అభూతి, ఉపహృతగా పరాభూతి యగుచున్నది.

    9. పిశ్యమాన క్రోధరుద్రుడు - పిశిత శిమిద యగుచున్నది.

    10. తినుచున్నప్పుడు దారిద్ర్యము, తినబడినదై నిరృతి యగుచున్నది.

    11. బ్రాహ్మణునకు హాని కలిగించువానిని ఇహ, పరలోకముల నుండి ఉన్మీలించుచున్నది.


                                     అయిదవ పర్యాయ సూక్తము - 9

    1. దీనిని పట్టుట కృత్య, ఆశసము సంహారక ఆయుధము, పేడ కలిసిన మేత శాపము అగుచున్నది.

    2. అపహృతయైనను అధీనమున ఉండదు.

    3. బ్రహ్మ గవి క్రవ్యాదాగ్నియై బ్రహ్మజ్యుని యందు ప్రవేశించి వానిని భక్షించుచున్నది.

    4. వాని సకల అవయవములను కీళ్లను నరికివేయుచున్నది.

    5. వాని తండ్రి పక్షపు బంధువులను ఛేదించి తల్లి పక్షము వారిని తిరస్కరించుచున్నది.

    6. క్షత్రియుడు తిరిగి ఇవ్వని బ్రహ్మగవి బ్రహ్మజ్యుని వివాహపు సకల బంధువులను క్షయ పరచుచున్నది.

    7. వానిని గృహరహితుని, పరతంత్రుని, సంతాన హీనుని, 'అపరాపరణుని' చేసి క్షీణింపచేయుచున్నది.

    8. విద్వాంసుడగు బ్రాహ్మణుని గోవును అపహరించిన క్షత్రియుని గతి కూడ అదే అగును.


                                         ఆరవ పర్యాయ సూక్తము - 10

    1. దానిని హరించిన క్షత్రియుని కళ్లను గ్రద్ద పొడుచుచున్నది.

    2. తలలు విరయబోసుకున్న స్త్రీలు వాని శ్మశానపు బూడిద చుట్టు తిరుగుదురు. రొమ్ములు బాదుకొందురు. కన్నీరు కార్చుచుందురు.

    3. వారి ఇళ్లలోనికి తోడేళ్లు దూరి కళ్లు పొడుచుచుండును.

    4. వాని ఇంటిని చూచి జనులు ఆ ఇల్లు ఇట్లైనదా? అనుకొందురు.

    5. బ్రహ్మగవీ! వీనిని ఛేదించుము - ఛేదించుము. భంగపరచుము - భంగపరచుము.

    6. అంగిరసా! ఈ లాగుకొను బ్రహ్మజ్యుని నీవు క్షీణింపచేయుము.

    7. కూల్బజమావృతా వైశ్వదేవి కృత్య అనబడును.

    8. ఇది మంత్రరూప వజ్రమున భస్మము చేయునది. భస్మము చేయునది అగుచున్నది.

    9. నీవు క్షుర పవిమృత్యువవై ఆక్రమణ చేయుము.

    10. నిన్ను గుంజుకొనిపోవు వారి ఇష్టాపూర్తిని, ఆశీర్వాదములను లేకుండ చేయుచున్నావు.

    11. హాని కలిగించు వారిని అల్పాయుష్కులను చేసి పరలోకమునకు పంపుచున్నావు.

    12. అఘ్న్యే! నీవు బ్రాహ్మణ శాపవశమున తగులు పాద శృంఖలవగుము.

    13. నీవు ఆయుధరూపమవు శరవ్యవు అఘ విషమవగుము.

    14. అఘ్న్యే! అపరాధి, దేవహింసకుడు, కార్యసిద్ధి కలుగనీయని వాని తల నరకుము.

    15. నీ ద్వారా ప్రమూర్ణుడు, మృదితుడు, దుశ్చరితుడు అగు వానిని అగ్ని దహించి భస్మము చేయునుగాక.


                                            ఆరవ సూక్తము - 11

    1,2. అఘ్న్యేదేవీ! బ్రహ్మజ్యుని నరకుము - నరకుము. దహించుము. దహించుము. ఆ మూలము భస్మము చేయుము.

    3-6. దేవ్యఘ్న్యే! యమ సదనము నుంచి దూరపు పాపలోకమున పడినట్లు అపరాధి, దేవహింసక, కార్యసిద్ధికి అవరోధము కలిగించు బ్రహ్మజ్యుని భుజములను, శిరమును వజ్రేణ శపర్వణా తీక్ష్నేణ క్షురముష్ఠిచే తెంపి పడవేయుము.

    7. వాని లోమములను రాల్చుము. తోలు వలచుము.

    8. వీని మాంసము కోయుము. స్నాహువులను ఉబ్బించుము.

    9. వీని ఎముకలలో నొప్పి పుట్టించుము. వీని మజ్జను క్షీణింపచేయుము.

    10. వీని సకల అవయవములను, కీళ్లను విరుచుము.

    11. క్రవ్యాదాగ్ని వీనిని భస్మము చేయునుగాక. వాయువు భూమి నుండియు, అంతరిక్షము నుండియు గెంటివేయునుగాక.

    12. సూర్యుడు ఇతనిని స్వర్గము నుంచి గుంజి భస్మము చేయునుగాక.

    వ్యాఖ్య :

    1. బ్రాహ్మణుని గోవును క్షత్రియుని నుండి రక్షించుటకు ఎక్కున తిట్లు తిట్టుట జరిగిన మాటవాస్తవము.

    క్షత్రియులు, పాలకులు, నేటికిని అంతటి దురత్ములై ఉన్నారు. తమ సర్వాధిపత్యమునకు ఏ శాసనమును లెక్కచేయకున్నారు. ఒక అగ్రరాజ్యము తన పెత్తనము నిలుపుకొనుటకు చిన్న రాజ్యముల మీద నీతినియమములను ఉల్లంఘించి అణచివేయుచున్నది. ఈ అధికారమే ఇట్టిది. అది బధిరాంధకము.

    "రాజానుమతోధర్మం" అన్న ఆనాడు పాలకులనుండి మేధావుల జీవికను రక్షించుటకు లేదా మేధావులే తమను రక్షించుకొనుటకు ఇన్ని తిట్లు తిట్టి యుండవచ్చును.

    ఎంతో ముందడుగు వేసినామనుకొనుచున్న ప్రజాస్వామ్య ప్రభుతలున్న ఈనాడు పాత్రికేయులకు పాలకుల నుండి రక్షణలేకున్నది! వారు సంఘశక్తితో తమను తమ హక్కులను రక్షించుకొనుచున్నారు!! ఇదియు అటు వంటిదే.

    అధికారమదాంధులకు శాస్త్రములు శాసనములు ఏవియు అడ్డు రావను విషయము రామాయణముగ వసిష్ఠుని గోవును అపహరించుటకు విశ్వామిత్రుడు చేసిన బలప్రయోగము నిదర్శనము.

    వసిష్ఠుడు దుర్బలుడనుకున్నాడు రాజగు విశ్వామిత్రుడు. దుర్బలుని వద్ద 'మంచిది' ఏదియు ఉండరాదను అధికార దుర్మదము. వసిష్ఠుడు, విశ్వామిత్రుడు సంకేతములు మాత్రమే. అధికార దుర్మదాంధుల నుండి రక్షించుకొనుటకు మేధావులు వసిష్ఠునంతటి బలసంపన్నులు కావలయునను సందేశము నిత్య నూతనము. సర్వకాలీనము. సార్వజనీనము.


                       దాశరథి రంగాచార్య రచించిన శ్రీమదాంధ్ర వచన
                     అథర్వవేద సంహిత యందలి పన్నెండవ కాండము
                                                 సమాప్తము.

 Previous Page Next Page