Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 11


    "భర్తకీ విషయం తెలుసా?"
    "పెళ్ళికిముందు వేరే ఒకతన్నీమె ప్రేమించిందని భర్తకు తెలుసు అయితే అతడామె పవిత్రతను నమ్మాడు. పాత కథనొక పీడకలగా మరిచిపొమ్మనీ, గతం గుర్తుచేసి ఆమెను బాధించననీ భర్త ఆమెకు దైర్యం చెప్పాడు.."
    "ఆ ఉత్తముడి పేరు నేను తెలుసుకోవచ్చా?"
    "అతడి పేరు మోహనరావు. భార్య పాతప్రియుడి ఉత్తరాన్ని తనవద్ద భద్రంగా దాచుకున్నదనీ, అతడినే ఇంకా మనసులో ఆరాధిస్తున్నదనీ అతడికి తెలియదు. ఆ ఉత్తరాన్ని శవం వంట్లోంచి తీశాక చదివి అతడు షాక్ తిన్నాడు...."
    "షాక్ తిని ఏమన్నాడు?"
    "షాక్ తిన్నాడు గదా-ఏమీ అనలేకపోయాడు" అని నవ్వి-"మనకు నవ్వులాటగా వుంటుంది కానీ అందమైన భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోతే - ఆ బాధ అనుభవించే వాడికే తెలియాలి..." అన్నాడు గోవర్ధన్.
    "ఇందులో మగాడి బాధేముంది? భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య ఏడవాలి కానీ భర్త దేముంది? మళ్ళీ కట్నం తీసుకొని కొత్త పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు...." అన్నాడు కిల్లర్.
    "ఇతడలాంటివాడు కాదు. ఆదర్శవాది, కట్నం లేకుండా పెళ్ళిచేసుకున్నాడు."
    "కట్నం లేకుండా ఏరి కోరి పెళ్ళిచేసుకున్నాడు.." అని రాత్రి ఆ యువతి తనతో చెప్పడం కిల్లర్ కు గుర్తొచ్చింది.
    "ఒకసారి నేను సీమ శవాన్ని చూడాలి...." అన్నాడు కిల్లర్.
    "అడ్రసు చెబుతాను. కావాలంటే వెళ్ళి చూడండి."
    కిల్లర్ గోవర్ధన్ వద్ద అడ్రసు తీసుకున్నాడు.

                                       4

    శవాన్ని చూసి కిల్లర్ తిన్న షాకు-ఇంతా అంతా కాదు.
    రాత్రి తన్ను కలుసుకున్న యువతి సీమ! అప్పుడామె భర్త తనను చంపుతాడని భయపడింది. ఆ తర్వాత కొద్ది గంటలకే యింటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది.
    ఎందుకు?
    తన్ను చంపే అవకాశం భర్తకివ్వకూడదనుకుందా?
    లేక తనకీ ప్రపంచంలో రక్షణ లభించిందని అధైర్య పడిందా?
    రెండింట్లో ఏది నిజమైనా తప్పు తనదీ వుంది. ఆపదలో వున్న యువతిని ఆదుకోడానికి బదులు అవమానించి పంపినందుకు కిల్లర్ గిల్టీగాఫీలయ్యాడు.
    కిల్లర్ చుట్టూ చూశాడు.
    ఒకపక్క సీమ శవం.....
    వేరొకపక్క కళ్ళనీళ్ళతో మోహనరావు.....
    మోహనరావు కన్నీళ్ళు కిల్లర్ లో ఆవేశాన్ని కలిగించాయి. అతడు నెమ్మదిగా మోహనరావుని సమీపించి "డియర్ మోహనరావ్! నువ్వు చాలా దుఃఖంలో వున్నావని నాకు తెలుసు. కానీ అర్జంటుగా నీతో మాట్లాడాలి. ప్రయివేటుగా...." అన్నాడు.
    "ఎవరు మీరు?" అన్నాడు మోహనరావు.
    "నా పేరు కిల్లర్. ఆయామే డిటెక్టివ్!"
    "మీకు నాతో ఏం పని?"
    "నిన్న రాత్రి పదకొండు గంటలవరకూ నీ భార్య నా దగ్గరుంది....."
    మోహనరావు వెంటనే-"పక్క గదిలోకి రండి.."అన్నాడు.
    ఇద్దరూ పక్క గదిలోకి వెళ్ళారు.
    "చెప్పండి!" అన్నాడు మోహనరావు.
    కిల్లర్ అతడికి అంతకుముందు రాత్రి జరిగినదంతా చెప్పాడు.
    మోహనరావు నిట్టూర్చి-"నిస్సందేహంగా సీమకు మతి చెదిరింది...." అన్నాడు.
    "అంటే?"
    "మీకు నా సంగతి తెలుసో తెలియదో.....మూడు లక్షలు విలువచేసే షేర్లున్నాయి. ఆరు లక్షలు విలువచేసే బ్యాంకు డిపాజిట్లున్నాయి. ఊళ్ళో ఓ హార్డువేరుషాపుంది..."
    "అయితే?"
    "డబ్బు సంపాదించడానికి నాకు భార్య కావాలా?"
    అతడి సూటి ప్రశ్నకు కిల్లర్ తెల్లబోయాడు నిజమే! మోహనరావులాంటివాడు భార్య ద్వారా డబ్బు సంపాదించాలనుకోడు. అతడి సంపాదన అనుభవించడానికే భార్య!
    "మరి ఆమె అలా ఎందుకు చెప్పింది?"
    "ఆమెను వివాహం చేసుకొని నేను చాలా పెద్ద పొరపాటు చేశాను..."
    "ఏ విధంగా?"
    "ఆమెనొకసారి సినిమా హాలువద్ధ చూశాను. నాకు చాలా నచ్చింది. పలకరించి మాట్లాడాను. పరిచయం పెంచుకున్నాను. ఆమె నన్ను ప్రోత్సహించనూలేదు, నిరుత్సాహ పరచనూలేదు. ఆమె పెద్డ్లలతో మాట్లాడాను. వారామె ఎవరినో ప్రేమించిందన్నారు. ఆమె గతంతో నాకు నిమిత్తం లేదన్నాను. ఈ పెళ్ళి జరిగితే ఆమె కుటుంబానికి ఉన్న కొన్ని ఆర్ధిక సమస్యలకు నేనే పరిష్కరిస్తానన్నాను ఆమె అన్నకు ఉద్యోగం.....చెల్లి పెళ్ళికి కట్నం.....నేనే ఏర్పాటు చేశాను. మా పెళ్ళి జరిగింది.....ఆడది మనిషినికాక డబ్బును ప్రేమిస్తుందని భావించాను. అదే నేను చేసిన పొరపాటు..." అన్నాడు మోహనరావు నిట్టూర్చి.
    "నీవామెను ప్రేమతో ఆకట్టుకోలేక పోయావా?"
    "అన్ని ప్రయత్నాలూ చేశాను..లాభంలేక పోయింది. ఆమె చాలా లోతైన మనిషి తన భావాలు తనలోనే దాచుకునేది. తన బాధలు తనే దిగమింగేది. అదే కొంప ముంచింది. నేనామెలో మార్పు వచ్చిందనీ, గతాన్ని మరిచిపోయిందనీ భ్రమపడేవాణ్ణి. ఆమె నన్ను కాదనలేక, పాత ప్రియుణ్ణి మరువలేక ఒకటే మధనపడేది. ఆ విధంగా మధనపడుతూ బుర్ర పాడుచేసుకుంది...."
    "తను బుర్ర పాడుచేసుకుందని మీకెలా తెలుసు?"
    "మీకు చెప్పిన విషయాలే - సీమ నా స్నేహితుడి భార్యకుకూడా చెప్పింది. ఆమె ఆశ్చర్యపడి నా స్నేహితున్ని నాగురించి నిలదీసి అడిగింది. నా స్నేహితుడు నాకు చెప్పాడు. అప్పుడు నేను షాక్ తిన్నాను...."
    "ఏం చేశారు?"
    "సైకాలజిస్టును సంప్రదించాను. ఆయన సీమను పారీక్షించి ఆమెలో ఏ లోపమూ లేదన్నాడు. అయితే నా కథంతా విన్నాక ఆమెలో అంతర్మధనముంటే మతి చెదరవచ్చునని అన్నాడాయన. ఆయన సీమ కేసును సీరియస్ గా తీసుకుంటానన్నాడు. సీమ అప్పుడు పేద రగడచేసింది. తన్ను పిచ్చిదానిగా నిరూపించడానికి నేను ప్రయత్నిస్తున్నానంది. అందువల్ల నాకేమి ప్రయోజనమో మీరే చెప్పండి!" అన్నాడు మోహనరావు దీనంగా.
    "ఆ తర్వాత ఏమి జరిగింది?"
    "ఏమీలేదు సైకాలజిస్టు విషయం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాను. సీమ మాత్రం మరి కొంధరివద్ధ నా గురించి దుష్ప్రచారం చేసింది."
    "చాలా చిత్రమైన కేసు. నమ్మశక్యం కాకుండా వుంది-" అన్నాడు కిల్లర్.
    "సీను నా గురించి అలా చెబుతోందంటే నేనే నమ్మలేకపోయాను. నా దగ్గరెంతో బాగా ప్రవర్తించేది. అందుకే ఆమెనే వేడుకున్నాను. ఎందుకిలా దుష్ప్రచారం చేస్తున్నావనీ, నావల్ల జరిగిన తప్పేమిటనీ అడిగాను. అన్నింటికీ మౌనంగా ఊరుకునేది. నేను మరీ నొక్కిస్తే తనూ యేడ్చేది. చివరకు నేను తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం ప్రారంభించింది...."
    "అలాంటప్పుడామెపై నీకు ద్వేషం కలగడం సహజం...."
    "అదే ఆశ్చర్యం! ఆమె గతంలో వేరే వ్యక్తిని ప్రేమించిందని తెలిసినా నాకామెపై ద్వేషం కలగలేదు సరిగదా ఎలాగో అలా పెళ్ళి చేసుకోవాలనిపించింది. ఆమె నా గురించి దుష్ప్రచారం ప్ర్రారంభిస్తేకూడా బాధ కలిగింది తప్పితే ద్వేషం పుట్టలేదు. ఇప్పుడామె శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయింది...." అంటూ మోహనరావు యేడ్చాడు.

 Previous Page Next Page