Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 93

                                 


    "ఆఁ, తక్షకుడా! వాడి ముఖం! వాడి ఆటలు నా ముందు సాగుతాయా!" అనుకున్నాడు ఉదంకుడు. గురుపత్ని కోరిన కుండలాలు సంపాదించినందుకు అతనికి సంపూర్ణమైన సంతుష్టి కలిగింది. అయినా తాను అనుకున్న వేళకు ఆశ్రమం చేరాలంటే చాలా వేగంగా వెళ్లాలి. అందుకోసం వెంటనే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పైలమహర్షి ఆశ్రమం వైపుకు బయలుదేరాడు ఉదంకుడు.
    సాయంకాలం అయింది. ఉదంకుడు నడుస్తూనే ఉన్నాడు. అంతలోనే అతనికి సమీపంలో ఒక పెద్ద సరోవరం కన్పించింది.
    ఆ సరస్సులో దిగి శుభ్రంగా స్నానం చేసి సంధ్యమార్చుకోవాలని అనుకున్నాడు ఉదంకుడు. తన దగ్గర ఉన్న మణికుండలాలు ఒడ్డున ఉంచి సరస్సులో స్నానానికి దిగాడు. వెంటనే అతనికి కనపడకుండా వెనుకనే వస్తున్న తక్షకుడు తటాలున గట్టుమీద పెట్టిన కుండలాలు పట్టుకొని పాతాళలోకంలోకి పారిపోయాడు.
    అదిచూచి ఉదంకుడు పరుగుపరుగున తక్షకుని వెంటబడ్డాడు. కాని తను పాతాళలోకంలో ప్రవేశించటం ఎలాగా? అప్పుడు ఉదంకుడు నాగలోకానికి దారి చూపమని దేవేంద్రుణ్ణి ప్రార్థించాడు. దేవేంద్రుడు ఉదంకుడి మీద జాలిపడి తన వజ్రాయుధంతో పాతాళలోకానికి మార్గం కల్పించాడు. ఆ త్రోవ వెంట వెళ్ళి ఉదంకుడు సత్వరంగా నాగలోకం చేరుకున్నాడు. కాని అక్కడ తక్షకుడు కనిపించలేదు. ఎవరిని అడిగినా తక్షకుని జాడ తెలియలేదు.
    అంతలోనే అతనికి ఒక పెద్ద అశ్వరాజం మీద ఆసీనుడై ఉన్న ఒక దివ్య పురుషుడు గోచరించాడు. ఉదంకుడు ఆ దివ్యమూర్తితో తన పరిస్థితి అంతా మనవి చేసుకున్నాడు. మంచి మంచి మంత్రాలతో ఆయనను బాగా స్తుతించాడు. అతని సంస్తుతికి ఆనందించి ఆ దివ్యమూర్తి ఇలా అన్నాడు. "చింతపడకు ఉదంకా! ఇలారా! ఈ గుర్రం చెవిలో బాగా ఊదు. తరవాత జరిగే చిత్రం చూద్దువుగాని".
    వెంటనే ఉదంకుడు గుర్రం చెవిలో బాగా ఊదటం మొదలుపెట్టాడు. తక్షణమే ఆ గుర్రం చెవుల నుంచీ, నోటినుంచీ, శరీరం అంతటి నుంచీ భయంకరమైన అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఉదంకుడు ఊదుతూనే ఉన్నాడు. మంటలు మరింతగా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి.
    కొద్ది కాలంలోనే బ్రహ్మాండమైన అగ్నిజ్వాలలు పాతాళలోకం అంతటా వ్యాపించాయి. పాములన్నీ నిప్పులలోబడి మలమల మాడి పోతున్నాయి. మంటలు తక్షకుణ్ణి కూడా చుట్టుముట్టాయి. తక్షకుడు హాహాకారం చేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి కుండలాలు ఇచ్చి ఉదంకుడి పాదాలమీద పడి రక్షించమని ప్రార్థించాడు. దయామయుడైన ఉదంకుడు కుండలాలు స్వీకరించి తక్షకుణ్ణి క్షమించాడు. దివ్య పురుషుడి దయవల్ల అగ్నిజ్వాలలు చల్లారిపోయాయి.

            

    ఉదంకుడు ఎలాగో కుండలాలు సంపాదించాడు. కాని పాపం! అతనికి మరొక కష్టం వచ్చిపడింది. పాతాళలోకం నుంచి పైలమహర్షి ఆశ్రమానికి వెళ్లాలంటే చాలాకాలం పడుతుంది. గురుపత్ని వ్రతం చేసుకుంటానన్నది సరిగా ఆరోజే! మరి సమయానికి వెళ్ళి ఆమెకు కుండలాలు అందించటం ఎలాగా? ఆమె చెప్పిన వేళకు వెళ్ళకపోతే మరి తాను పడిన శ్రమ అంతా వ్యర్థమైనట్లే గదా! ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా వెళ్ళాలి?
    ఈ విధంగా ఆలోచిస్తున్న ఉదంకుణ్ణి చూచి దగ్గర ఉన్న దివ్యపురుషుడు ఎంతో జాలిపడ్డాడు. "ఉదంకా! నీవేమీ విచారపడకు. ఇదుగో! నా గుర్రాన్ని నీకు అప్పగిస్తాను. దీనిమీద వాయువేగంతో వెళ్ళి, సకాలంలో మీ గురుపత్నికి రత్నకుండలాలు సమర్పించుకో" అన్నాడు దివ్యపురుషుడు. ఉదంకుడు దివ్యమూర్తికి నమస్కరించి అశ్వం అధిరోహించాడు.
    కొద్దిసేపటికే ఉదంకుడు గురువుగారి గృహం చేరుకున్నాడు. తన రాకకోసం ఎదురుచూస్తున్న గురుపత్నికి రత్నకుండలాలు సమర్పించాడు. అసాధ్యమైన తన అభీష్టాన్ని అంత దీక్షతో నెరవేర్చినందుకు గురుపత్ని పరమానందం పొందింది. పైలమహర్షి ప్రియశిష్యుణ్ణి చేరదీసి "కుమారా! పౌష్యపట్టణానికి వెళ్ళిరావటానికి ఇన్నాళ్లు ఎందుకు పట్టింది? ఇంత ఆలస్యం ఎలా జరిగింది?" అని ప్రశ్నించాడు. ఉదంకుడు గురుదేవునికి తన ప్రయాణ విశేషాలు వివరించాడు. తాను చూచిన వింతలన్నీ విశదం చేశాడు.
    "గురుదేవా! మార్గమధ్యంలో ఒక మహాపురుషుడు కనిపించి నన్ను గోమయం భక్షించమని కోరాడు. 'మీ గురుదేవుడు కూడా ఒక మాటు దీన్ని భక్షించాడు' అని చెప్పాడు. అదేమిటి? మరి పాతాళలోకంలో ఉన్నతాశ్వం అధిష్ఠించి ఉన్న ఒక దివ్యపురుషుణ్ణి చూశాను. ఆయన దయవల్లనే ఈ కుండలాలు తీసుకురాగలిగాను. ఆ దివ్యపురుషుడెవరు?" అని అడిగాడు ఉదంకుడు.
    పైలమహర్షి మందహాసం చేస్తూ "కుమారా! నీవు చాలా అదృష్టవంతుడివి! అందువల్లనే పరమపవిత్రులైన దివ్యమూర్తులను దర్శించగలిగావు. నీకు మొట్టమొదట ఎదురైన మహానుభావుడు దేవేంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు ఐరావతం. నీవు భక్షించిన గోమయం అమృతం. నీకు పాతాళలోకంలో అంత సహాయం చేసిన ఆ దివ్యపురుషుడు వాయుదేవుడు. అతడు అధిష్ఠించిన గుర్రం అగ్నిదేవుడు. నీవు మొట్టమొదట అమరేశ్వరుని దర్శించి అమృతం ఆరగించినందువల్ల నీ ప్రయత్నం ఫలించింది. నీవు సురక్షితంగా తిరిగి వచ్చావు. ఈ విధంగా నీవు కుండలాలు తేవటానికి దేవతలంతా సహాయం చేశారు. నీ శ్రమ సార్థక మయింది. చాలా సంతోషం" అన్నాడు. ఆయన కన్నులలో వాత్సల్యం పొంగి పొరలింది.
    గురుపత్ని ఉదంకుణ్ణి మెచ్చుకుంటూ, "కుమారా! ఉదంకా! గురుదక్షిణ సాధించటానికి ఎంత శ్రమ పడ్డావు నాయనా! గోమయం భక్షించావు! పాతాళం బ్రద్దలు కొట్టావు! సర్పజాతిని లోబరుచుకున్నావు! సకాలానికి మా సన్నిధికి వచ్చావు! నీ గురుభక్తి నిరుపమానమైనది. నీ కార్యదీక్ష నిస్తులమైనది. నీకు శుభం కలుగుగాక!" అని వాత్సల్య పూర్వకంగా దీవించింది.
    పైలమహర్షి అనురాగంతో "ఉదంకా! ఇక నీవు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించు. తల్లిదండ్రులను సేవించు. నీ జీవితం సుఖమయం అవుతుంది. నీకు ఆయురారోగ్యాలు కలుగుతాయి" అని అనుగుశిష్యుని శిరస్సు మూర్కొని ఆశీర్వదించాడు.
    ఉదంకుడు గురుచరణాలమీద శిరస్సు వ్రాల్చాడు. గురుదేవుడు ప్రియశిష్యుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఉదంకుడు పొంగి పొంగి పులకరించాడు.


                                           * * * *

 Previous Page Next Page