భారతి మొహాన్ని చేతుల్లో కప్పేసుకుని బావురుమన్నది.
కానీ ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరక్కడ! ఆమె రైలుపట్టాల మీద అడ్డంగా బోర్లాపడుకొంది. రైలు పట్టాలమీద రైలు హెడ్ లైట్ కాంతి పడుతోంది. రైలు వస్తున్న దిక్కుకేసి కన్నీళ్లతో చూస్తున్నది భారతి.
ఆమె మెడ ఒక పట్టామీద, మోకాళ్లు రెండూ మరో పట్టామీద వున్నాయి.
కొన్ని క్షణాల్లో అస్తమించబోతున్న జీవితాన్ని తలచుకొని కుళ్లీపోతూనే మరోవేపు ఆమె ప్రశాంత్ పైన పగ దీర్చుకోవాలని ఆలోచిస్తుంది.
అవును ఎందుకు చావాలి?
తను చావాలనుకున్నా తన కడుపులో పెరిగే బిడ్డని చంపడానికి తనకి అధికారం లేదు. ఆ బిడ్డని తన కడుపులో నవమాసాలు మోసి ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. ఆ బిడ్డని ఓ అస్త్రంగా తయారుచేసి ఆ ప్రశాంత్ పైన ప్రతీకారాన్ని తీర్చుకోవాలి.
అంతవరకూ తను రంగారావుని ఆశ్రయించాలి. అతని మాటలని బట్టి తన గురించి అతనికి పూర్తిగా తెలుసు.
అతను తనని ఆదరిస్తాడు.
గోదావరి ఎక్స్ ప్రెస్ చాలా దగ్గరకొచ్చేసింది. తెగిపోయేలా వేసిన హారన్ వినబడింది.
ధన్ ధన్ ధన్ మని చప్పుడు చేస్తూ ఏదో బ్రిడ్జిని దాటుతూ వచ్చేస్తోంది. డీసిల్ ఇంజన్ హెడ్ లైటు కాంతి ఆమె మీద పూర్తిగా పడుతోంది. రైలుపట్టాలు అదురుతున్నాయి. ఆ అదురుకు ఆమె శరీరం కంపించసాగింది.
అలాంటి సమయంలో బతుకుమీద ఓ తియ్యని కోరిక ఆమెకి కలిగింది.
ఆమె మెడ పైకెత్తి చూసింది.
రైలు కొన్ని అడుగుల దూరంలో వుంది.
అంతే!
ఆమెలోని దైర్యం పూర్తిగా అడుగంటిపోయింది. పట్టాలమీంచి లేచే వ్యవధి లేదామెకి.
"ఇట్స్ టూ లేట్"
అయిపోయింది. తను చనిపోతోంది. తల, కాళ్లు చేతులు తెగి ఎగిరి అవతల పడటానికి క్షణంలో వెయ్యోవంతు కాలం మాత్రమే మిగిలివుంది.
ఆమె భయంతో కెవ్వుమని అరిచింది.
4
నేషనల్ హైవేలో ఓ అడ్డదారికి కిలోమీటరు దూరంలో వున్నదా గెస్ట్ హౌస్.
చుట్టూ ద్రాక్షతోటలు.
ప్రశాంతమైన ప్రదేశం.
రాత్రి పది కావస్తున్నది.
చిక్కని చల్లని వెన్నెల ఆ ప్రాంతాన్ని మనోహరంగా పరుచుకొని మనసుని రాగరంజితం చేస్తోంది.
చల్లని పిల్లగాలి తెమ్మరలు ఒకదాని వెంట ఒకటి పోటీపడి గెస్ట్ హౌస్ గది కిటికీలోని లోపలికి దూసుకెళ్లి మంచం మీద పడుకుని వున్న బ్యూటీక్వీన్ సల్మా అర్ద నగ్న శరీరాన్ని తాకుతున్నాయి.
గదిలో టీపాయ్ మీదున్న యాష్ ట్రే మీద సిగరెట్ పొగలు కమ్ముతోంది. ....
టీపాయట్ మీద నింపివున్న విస్కీగ్లాసుని చేతిలోకి తీసుకొని పెదవులతో సిప్ చేస్తూ సల్మా కేసి చూశాడు ప్రశాంత్.
సల్మా అతని కేసి చిలిపిగా, కవ్వింపుగా చూస్తోంది.
పైపెక్కిన కళ్లతో , నిగనిగ లాడుతున్న నిగారింపు చెంపలతో ఖర్జూరప్పళ్లలాంటి మనోహరమైన పెదవులతో... నవమోహినిలా మెరిసి పోతోంది సల్మా!
అదేమీ పట్టనట్టు... యాష్ ట్రే మీద సిగరెట్ ని చేతిలోకి తీసుకొని వరండాలోకి నడిచాడు ప్రశాంత్.
చుట్టూ పరిసరాలని పరికిస్తూ కొంచెం సేపు అలాగే నిలబడ్డాడు ప్రశాంత్.
రెండు దమ్ములు లాగి సిగరెట్ ని దూరంగా విసిరేశాడతను.
అతనికి ఆ గెస్ట్ హౌస్ కొత్తదేమీ కాదు.
అందాన్ని అనుభవించాలన్నా, ఆనందాన్ని పొందాలన్నా అతను అక్కడికి వస్తుంటాడు.
ద్రాక్షతోటల మీద నించి, ఆ చుట్టూ వున్న చెట్ల నుంచి గాలి తెమ్మరలు మెల్ల మెల్లగా కదలివచ్చి అతన్ని తాకుతున్నాయి.
మరో సిగరెట్ వెలిగించాడతను. దూరంగావున్న చెరువు వెన్నెల్లో మెరుస్తూ కానవస్తూంది.
వాచ్ మాన్ బయటికి వెళ్లాడు. అతనప్పుడే రాడు. కావాలనే అతన్ని బయటికి పంపించేశాడతను.
బయట గేటుకి తాళం వేసి వెళ్లి పోయాడు వాచ్ మాన్ మల్లప్ప.
గది గుమ్మంలోకి వచ్చి నించున్నాడు ప్రశాంత్.
సల్మా అద్దం ముందు నించుని చేతులు వెనక్కి పోనిచ్చి బ్రా హుక్ పెట్టుకుంటోంది.
ఆమె ఒంటిపైన తెల్లని సిల్కులంగా ఫాన్ గాలికి రెపరెపలాడుతూ ఆమె పిరుదులని, తొడలని, కాలి పిక్కలని చుట్టుకుపోతోంది. ఏపుగా ఎదిగిన ఆమె అవయవసౌష్టవాలు అతన్ని పిచ్చివాడ్ని చేస్తున్నాయి.
ప్రశాంత్ పెదవుల మీద చిన్న నవ్వు కదిలింది. మెల్లగా ఆమె వెనక్కి వెళ్లి నించున్నాడు. అద్దంలోంచి ఆమె నవ్వడం అతను గమనించాడు. ఆమె సన్నని నడుం మీద చేతులు వేసి.. .ముందుకి... పొట్టమీదకి పోనిచ్చి, "అప్పుడే వేసుకొంటున్నావే?" అన్నాడు.