బయటపడుతుంది. పరువు పోతుంది. రభస జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేక అమ్మా, నాన్న, అన్నయ్యా ఏమవుతారో? ఏం చేస్తారో? చంపేస్తారు.
పరువు ప్రతిష్ఠ వాళ్లకి ముఖ్యం. ఇప్పుడేం చేయాలి?
కింది పెదిమని పంటితో నొక్కి పట్టింది భారతి. ఏం చేయడానికీ తోచడం లేదు. ఏడుస్తోందో పక్క. చీకటిలో గబగబా నడుస్తోంది. ఆ రోడ్డు చాలావరకు నిర్మానుష్యంగా వుంది.
ఎడతెగని ఆలోచనలు. ఓ కొలిక్కి రాలేకపోతోంది. వెనుక ఏదో అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో తనని అనుసరిస్తున్నారన్న అనుమానం కలిగింది భారతికి. ఓసారి వెనక్కి తిరిగి చూసింది. కానీ ఎవరూ కనిపించలేదు.
తనని ఎవరన్నా ఫాలో అయితే మాత్రం భయందేనికి? చావబోయే మనిషి తమని చూసి భయపడి ఏడ్చినట్టు! అంత బాధలోనూ ఆమెకి నవ్వొచ్చింది.
"ప్రేమించినవాడు, నమ్మినవాడు కడుపుచేసి మెడమీద చెయ్యేసి బయటికి గెంటేశాడు.
"నేను కడుపు చేయించుకొచ్చాను. నన్ను ఆదుకోండి' అని ఏ ఆడపిల్లా తల్లినీ తండ్రినీ ఆశ్రయించలేదు.
అందుకే భారతి ఓ పరిష్కారానికొచ్చింది.
అది ఆత్మహత్య!అవును. తను బతికి చేసేది ఏమీ లేదు.
చచ్చిపోవడం ఒక్కటే ఈ పరిస్థితినించి బయటపడ్డానికి మార్గంగా కనిపిస్తున్నదామెకి.
కడుపులోంచి దిగులు.
గుండెలోంచి గుబులు.
ఒక్కసారిగా చెలరేగి ఆమెని కృంగదీస్తున్నాయి.
తడబడుతోన్న అడుగులతో నడుస్తోంది భారతి. రోడ్డు పక్కనే వున్న రైలుకట్ట మీదకి నడిచింది భారతి. తనంత దారుణంగా వంచింపబడుతుందని కలలో సైతం వూహించలేదు.
కొన్ని నిమిషాల్లో అంతం కాబోతున్న తన జీవితాన్ని గుర్తు చేసుకొని విలవిల్లాడిపోయింది. రైలు కట్ట మధ్యలో నిలబడిపోయింది.
ఆమెకెందుకో రంగారావు గుర్తుకొచ్చాడు. అతను ఆమె కొలీగ్.
సాయంత్రం ప్రశాంత్ ని కలుసుకోడానికని పర్మిషన్ పెట్టి బయలుదేరుతుంటే వరండాలో నించుని తనని పిలిచాడు.
"భారతీ!" అని.
రంగారావు చాలా మంచివాడు. తనకి తెలీని పనిని చేసి పెడుతుంటాడు. ఆఫీసులో ఏదన్నా అవసరం పడితే ఆమె అతన్నే అడుగుతుంది. తను ఆగింది.
అతను సిగరెట్ కాలుస్తూ తన దగ్గరగా వచ్చాడు.
"మధ్యాహ్నం నించీ గమనిస్తున్నాను. నువ్వు అదోలా వున్నావు. ఇంటికి సరిగా వెళ్లగలవో లేదో అనిపిస్తుంది. అభ్యంతరం లేకపోతే నేను వచ్చి డ్రాప్ చేస్తాను" అన్నాడతను.
తను నవ్వడానికి ప్రయత్నించిందే కానీ ఆ నవ్వు తన పెదవుల పైన తేలిపోయిందని భారతికి తెలుసు.
"ఆటోలో వెళ్ళిపోతాను" అంది మెల్లగా.
చేతిలోని సిగరెట్ ని దూరంగా విసిరేశాడతను.
"భారతీ! ఒక్క పది నిమిషాలు నీతో పర్సనల్ గా మాట్లాడాలి "చాలా సౌమ్యంగా అడిగాడు.
"సారీ, ఇప్పుడో పనిమీద అర్జంటుగా వెళ్తున్నాను. రేపు మాట్లాడతాను" అంది. అప్పటికే టైం చాలా వేస్టయిపోయినట్టనిపించింది తనకి.
రంగారావు మళ్లీ సిగరెట్ వెలిగించాడు. తనతోపాటుగా బస్ స్టాప్ వరకు వచ్చాడు. అతనలా తన వెనకే రావడం చాలా ఇబ్బందిగా అనిపించినా సబ్యతకోసం మాట్లాడలేకపోయింది.
బస్టాపులో జనం చాలా మందివున్నారు. ఆ జనాన్ని చూస్తూంటేనే అర్దం అవుతోంది చాలా సేపుగా బస్ రాలేదని.
అప్పుడే వచ్చి అక్కడ ఆగిన ఆటోలో గభాల్న ఎక్కి కూర్చుంది భారతి.
లేకపోతే అది కూడా దొరికే అవకాశం లేదు. ఆటోరాడ్ ని చేత్తో పట్టుకుని నిలబడి అన్నాడు రంగారావు.
"ఆల్ రైట్ భారతీ! మరోలా అనుకోనంటే ఒక్కమాట.
ఇప్పుడు నువ్వు ఎక్కడికెళ్తున్నావో నాకు తెలుసు.
నువ్వు వెళ్తున్న పని సక్సెస్ కావాలని దేవుడ్ని ప్రార్దిస్తున్నాను.
కాని మరోమాట.
నువ్వు ఆశించింది జరగకపోతే మాత్రం బాధపడకు. భయపడకు ఇక్కడ రంగారావున్నాడని మరచిపోకు....."
అతని మాటలు పూర్తికాంగానే....
"ఆటో పోనీయ్" అంది తను. ఆటోతోపాటే రెండడుగులు ముందుకి వేశాడు రంగారావలు.
"ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సోమచ్ భారతీ!" అన్నాడతను.
ఆ మాటలు ఆటో శబ్దంలో కలిసిపోతూ లీలగా వినిపించాయామెకి.
కొండంత ఆశథో మనసునీ, శరీరాన్ని అర్పించిన ప్రియుడిని కలుసుకోడానికి వెళ్తున్న ఆ సమయంలో రంగారావు మాటల్ని పట్టించుకోలేదు.
అతని మాటలని బట్టి తన గురించి రంగారావుకి పూర్తిగా తెలుసన్న సంగతి అర్దం అయిపోయింది.
"ఇక్కడ రంగారావు వున్నాడని మరిచిపోకు" రంగారావు మాటలు ఆమె చెవుల్లో రింగవుతున్నాయి.
దూరంగా రైలుకూత వినబడింది. రైలు వస్తోంది.