Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 87


                          అనూరాధపురము

    భారతదేశమున దక్షిణమున హిందూ మహాసముద్రమున్నది. అది ప్రపంచములోని మహాసముద్రములలో మిక్కిలి ప్రధానమైనది. ఆ మహాసాగరము నడుమ "సింహళ" మను సర్వాంగ సుందరమైన యొక ద్వీపము కలదు.
    భారత దేశము నుండి సింహళమునకుఁ బోవుటకు నౌకా సౌకర్యమున్నది. కొందఱు విమానయాన మొనర్చియును సింహళ ద్వీపమునకుఁ జేరుచుందురు.
    సింహళదేశమున మిక్కిలి సుందరమైన యొక ప్రాచీన పట్టణము కలదు. దాని నామమే "యనూరాధ పురము".
    పూర్వము సింహళ ద్వీపమును "విజయసేనుఁ"డను నరపాలుఁడు పరిపాలించెను. ఆ మహీపతి "కనూరాధుఁ"డను నొక సోదరుఁడు కలఁడు. ఆ 'యనూరాధుఁడే' క్రీ.పూ. 6వ శతాబ్దమున తన పేర నీ పట్టణమును కట్టించెను.
    అనంతరము కొంతకాలమునకీ యనూరాధపురము దినదినాభివృద్ధినంది యిరువదినాలుగు మైళ్ళ చుట్టుకొలతగల మహానగరమై విలసిల్లినది. అంతేకాదు, సింహళ దేశమునకు రాజధానియై విరాజిల్లినది.
    సింహళద్వీపము సుప్రసిద్ధులగు శిల్పులకు పెట్టినది పేరు. లలితకళలకుఁ బుట్టినిల్లు. సింహళదేశస్థులందరును బౌద్ధ మతస్థులు. అందుచే నచ్చటి శిల్పవరేణ్యులు మనోహరములైన బౌద్ధ శిల్పములతో ననూరాధపురము నలంకరించిరి.
    అనూరాధపురము బౌద్ధుల కత్యంత ప్రీతిపాత్ర మగుపుణ్యక్షేత్రము ఆ నగరము నలుగడల నడుగడుగునకు బౌద్ధ స్థూపములు, విహారములు, ప్రార్థన మంటములు వెలసినవి. నేడా కట్టడము లన్నియు కాలగర్భములోఁ గలసిపోయినవి. అచ్చటచ్చట కొన్ని మాత్రము బౌద్ధశిల్ప కళాసంపదకు ప్రత్యక్ష సాక్ష్యములుగ నలరారుచున్నవి.
    అనూరాధ పురమును "తిస్సరాజు" అను మహీపతి కొన్నాళ్ళు పాలించెను. తిస్సరాజు భారత చక్రవర్తియైన యశోకునకు సమకాలికుడు. అశోకుని యాదేశమున నతఁడు తన దేశములో బౌద్దమతాభివృద్ధికి మిక్కిలి కృషిచేసెను. అప్పుడే బౌద్ధమత మీ దేశములో వాడవాడ వ్యాప్తిచెందినది. తిస్సరాజు కాలమున ననూరాధపురము మహౌన్నత్యముతో, మహావైభముతో కన్నులవిందుగా వెలుగొందినది.
    తిస్సరాజు భారతదేశము నుండి పూజనీయమైన బోధివృక్షమును దెప్పించుకొని తన రాజధాని యగు ననూరాధపురమున నాటించెను. ఇప్పటికిని దాదాపు రెండువేల సంవత్సరముల వయస్సుగల యా వృక్షరాజము శాఖోపశాఖలతో విస్తరిల్లి కన్నులపండువగాఁ గాన్పించుచున్నది.
    ఆ బోధివృక్షమునకు చుట్టును బౌద్ధవిహారములు నిర్మింపఁబడినవి. ఆ విహారముల కనతిదూరముననే తిస్సరాజు స్తూపాకారముగనున్న ప్రార్థనామంటపమొకదాని నిర్మింపఁజేసినాఁడు. దానియందే కరుణానిధి యగు "బుద్ధ భగవానుని" యస్తికలు భద్రపఱుచబడినవని పెద్దలు చెప్పుదురు.  
    తన రాజధానియైన అనూరాధపురములో తిస్సరాజు పది నూతన చైత్యములు కట్టించెను. సింహళదేశ శిల్పుల కళానైపుణ్యమునకా చైత్యముల యందలి చిత్రరాజములే ముచ్చట గొల్పు మచ్చు తునుకలు.
    అనూరాధపురమునఁగల యాకర్షణీయములైన కట్టడములలో "కంచు రాజమందిర" మొకటి. అది తొమ్మిది యంతస్తులు గల పెద్ద సౌధము. అందు మొట్టమొదటి యంతస్తు సహస్రస్తంభముల మంటపము. కంచురాజ మందిరమును నిర్మించుటకు ముప్పదికోట్ల రూప్యములు వ్యయమైనవి. కన్నులకు మిరుమిట్లు గొలుపు 'కంచు పెంకులతో' మందిరోపరిభాగ మంతయును కప్పబడి చూడముచ్చటగ నుండును.
    అనూరాధ పట్టణమునఁగల "హిమవతి దాగోబా" యను బంగారు స్తూపము ప్రేక్షకుల దృష్టికి విస్మయము గొల్పుచుండును. వెయ్యికోట్ల రూప్యములతో నిర్మింపఁబడిన యా సువర్ణస్థూపమే యా పట్టణ సౌభాగ్యమునకు సుయోగ్యమగు నిదర్శనము.
    భారతావనియందలి అమరావతి, తక్షశిల, నలంద మొదలగు విద్యాపీఠముల వలెనే యనూరాధపురము సైతము విశ్వవిఖ్యాతమగు గొప్ప విద్యాపీఠము. ఈ విద్యాపీఠమునకు ఖండఖండాంతరములనుండి తండోప తండములుగ విద్యార్థులు వచ్చుచుండెడివారు. ఇందు బౌద్ధభిక్షువులకు పాళీ భాషలో నీతిశాస్త్రము, తత్వశాస్త్రము, యోగశాస్త్రము, వ్యాకరణశాస్త్రము బోధింపఁబడు చుండెడివి. సర్వకళాసమర్థులగు నాచార్యులెందరో శిష్యగణమునకు విజ్ఞానవిషయములు బోధించుచుండెడివారు. సామాన్య ప్రజానీకము సైతము ధర్మశాస్త్రము, సాహిత్యము, జ్యోతిష్యము మున్నగువాని నభ్యసించుచుండెడిది.  
    ఇట్టి యత్తమోత్తమమైన విద్యాపీఠముతోడను, సుందరములైన స్తూపముల తోడను కళకళలాడు కట్టడముల తోడను నొక్క వెలుగు వెలిగిన యనూరాధపురము నేఁడు తన సౌందర్య సంపదను జాలవఱకు గోల్పోయియున్నది.


                            * * * *

 Previous Page Next Page