Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 86


                         తెలివిగల కుందేలు

    పూర్వమొక మహారణ్యమునందొక సింహము వసించుచుండెను. ఆ హర్యక్షము విచ్చలవిడిగా విహరించుచు ప్రతి దినము కాననములోఁ గల మృగములనెల్ల చంపి దినుచుండెను. ఆ మృగరాజువలని బాధ పడలేక జంతుసంతతులన్నియుఁ గలసి యొకనాఁడు దానియొద్దకేగి యిట్లు విన్నవించుకొనినవి. "మహాప్రభూ! తమరు స్వేచ్చగా కంటబడిన జంతువుల నెల్ల భక్షించుచున్నారు. ఇట్లేకొన్ని దినములు గడిచినచో నీ యరణ్యము జంతుశూన్యమగును. అప్పుడు తమ కాహారము దుర్లభమగును. కనుక మా విన్నపము మన్నింపుడు. మాలో దినమున కొక జంతువు వంతున తమ కాహార మగుదుము. మాయందు దయయుంచి ఇందుల కంగీకరింపుడు."
    జంతువుల ప్రార్థనలు విని కంఠీరవము కరుణించి "మంచిది. యట్లే చేయు"డని వానిని బంపివేసెను.
    కాలము గడచిపోవుచుండెను. ప్రతి దిన మొక్కొక్క మృగము పంచాస్యమున కాహార మగుచుండెను. ఒకనాఁడొక కుందేలునకు వంతు వచ్చింది. పాప మా చెవులపిల్లి సింహము నోటఁబడవలసి వచ్చినందుల కెంతయో సంతాపము నందెను. దానికేమి చేయుటకును దోఁచలేదు. మృత్యుముఖము నుండి తప్పించుకొనవలెనని యది యెన్నియో విధముల నాలోచించెను. క్రిందికిఁ జూచెను. పైకిఁ జూచెను. దెసలు పరికించెను. తల పంకించెను. కొంచెము శంకించెను. మరల కొంచెమాలోచించెను. తనలోతాను చిరునవ్వు నవ్వుకొనెను. మెల్ల మెల్లఁగా సింహము చెంతకు బయలుదేరెను.
    సింహ మాకలిబాధతో మండిపడుచుండెను. ఎంత సేపటినుండియో నిరీక్షించుచున్నది. ఏ జంతువును రాలేదు. దాని కాహారసమయము దాటి పోయినది. ఈయడవి జంతువుల కొడలుమత్తెక్కి తన సంగతి మఱచిపోయినవని మృగేంద్రము నిప్పులుగ్రక్కెను. వాల మల్లార్చి దిక్కులు దద్దరిల్లునట్లు గర్జించెను.
    అంతలో మెల్లగా నడుగులో నడుగు పెట్టుకొనుచు శశకము మృగరాజును చేరినది. మృగేంద్రము గ్రుడ్లెఱ్ఱజేసి "మదాంధుఁడా! ఇంకను నెమ్మదిగా వచ్చుచున్నావా? నాకు భోజన సమయ మతిక్రమించెనని తెలియదా? ఇంత ప్రొద్దెక్కి వచ్చితివే? ఇప్పటిదాక నేమిచేయుచుంటి"వని గర్జించెను.
    చెవులపోతు వినయము నటించుచు "స్వామీ! క్షమింపుడు. నేను యథాసమయమునకే యింటినుండి బయలుదేరితిని. నాలుగడుగులు వచ్చునప్పటికి నాకొక హర్యక్ష మెదురువచ్చినది నేను దేవరవారి కాహారముగాఁ బోవలయును గాన నన్ను విడువుమని దానిని వేడితిని. అందులకా సింహము నవ్వుచు "నోరీ! ఈ వనమునకు నేనే రాజును. నేనుగాక మఱియొక ఱేఁ డెవ్వఁడున్నాఁడు? నాకు జూపితివా సరి! లేకున్న నిన్ను మారణముసేయుదును. నీ ప్రభువును బిలుచుకొని రమ్ము పొమ్ము." అని గద్దించి యిప్పటికి నన్నిట కంపినది. నేను బుద్ధిపూర్వకముగా దయకేమియు నపచారము సేయలేదు. జరిగిన విషయము నెఱుక పఱచితిని. తమ యాధిపత్యమునే లెక్కసేయక తమకడకు వచ్చు నన్నడ్డగించిన యా మ్రుక్కడి నేమిచేయవలయునో మీరే నిశ్చయింపుడు" అని పలికి తలవంచి గోళ్ళు గిల్లుకొనుచు శశకము మిన్నకుండెను.
    మృగరాజు క్రోధము ద్విగుణీకృత మయ్యెను. కేసరి చెవులపోతును జూచి "యోరీ! నా యధికారమును తృణీకరించు మూర్ఖుఁడెవ్వడు! వాడెఁచ్చట నున్నాఁడు? ఆ దురాత్ముని నాకుఁజూపుము. వాని గుండెలు చీల్చివైచెదను" అని యనగానే శశకము 'చిత్తము ప్రభూ! దయచేయుఁడు, తమ శత్రువున్న స్థలముఁజూపింతును' అని పలికెను.
    కుందేలు ముందు పోవుచుండెను. వెనుక కంఠీరవము గర్జించుచు వచ్చుచుండెను, ఇట్లు శశకము మృగరాజు నొక యగాధమగు నూతికడకుఁగొనిపోయి "స్వామీ! ఈ కూపమే తమవైరి కాపురా ముండుచోటు. చూడుఁడు. అతడిందే యున్నాడు" అని వినయపూర్వకముగా విన్నపము చేసెను.
    మృగరాజు నూతిలోనికిఁ దొంగిచూచెను. బావినీటిలో దానికి మరియొక మృగేంద్ర మగపడెను. తన ప్రతిబింబమునే తన శత్రువైన మరియొకకేసరిగా అదితలంచెను. వెంటనే క్రోధోద్రేకముతో దానిని సంహరింప నెంచి భయంకరముగా గర్జించెను. బావిలోనుండి మరల ప్రతిగర్జనము వినబడెను. సింహమున కొడలు భగ్గుమనెను. అది తక్షణమే కేసరముల నిక్కించి యొక్క మాటుగా దన ప్రత్యర్థిపై గుభాలున బావిలోనికి దుమికెను.
    పాపము! ఆ పాడునూతిలోఁబడి పంచాస్యము ప్రాణములు గోల్పోయెను. అడవిలోని జంతువుల పీడ వదలెను.
    శశకము సంతోషముతో గంతులు వైచుచు నింటిఁకి దిరిగి వచ్చెను. తనతోడి మృగములకా సంతోషవార్త నెఱింగించెను. ఆ సంగతి విని జంతు సంతానము లన్నియు సంతుష్టాంతరంగములతో కుందేలు తెలివిని కొనియాడెను.
    బుద్ధిబలమున కసాధ్యమైన దేమియులేదు. బుద్ధిమంతుఁడగువాఁడు సమయోచితముగాఁ బ్రవర్తించి యుపాయముచే నపాయములఁ బాపుకొనుచుండును.


                             * * * *

 Previous Page Next Page