Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 85
సుహరాబ్ - రుస్తుమ్
అక్సస్ నదీతీరమున నిఱువైపున సైనిక శిబిరములు నిర్మింపఁబడియుండెను. ఆ నది 'ఈరాన్' 'తూరాన్' దేశముల మధ్యభాగమున నున్నది. ఈ రెండు దేశముల కాగర్భ శత్రుత్వము పరంపరాగతమై వచ్చుచుండెను.
రుస్తుమ్ "ఈరాన్" సైన్యములకు సర్వాధికారి. అతడు నిరుపమాన శౌర్యవంతుడు. ఆ వీరాధివీరుడే 'ఈరాన్' సైనికులకు గర్వకారకుడు. ఆ మేటివీరుని ధాటి కోర్వజాలక 'తూరాన్' సైన్యములు తరచు పరాజితములై పారిపోవు చుండెడివి. రుస్తుమ్ కీర్తి దేశ దేశముల వ్యాపించెను.
రుస్తుమ్ పూర్వ మొకప్పుడు విజయగర్వముతో తూరాన్ దేశమున విహరించుచుండెను. అతఁడు లావణ్యవతియైన యొక తూరాన్ దేశపు రమణీమణిని సందర్శించెను. ఆమె రుస్తుమ్ శౌర్య ధైర్యములు విని యా వీరాగ్రేసరుని వివాహమాడదలచెను. రుస్తుమ్ ఆమె కోరికను మన్నించి యామెను బరిణయమాడెను. కొలఁదికాలమున కాతూరాన్ రమణి గర్భముఁదాల్చెను.
రుస్తుమ్ కొమ్ములు దిరిగిన వస్తాదు. శౌర్యధనుఁడు. ధీర శిరోమణి. అందుచే నాతఁడెక్కువకాలము భార్యయొద్ద తూరాన్ దేశములో నుండఁజాలక పోయెను. ఒకనాఁడు తన యర్ధాంగికడ సెలవుఁదీసికొని మాతృదేశ మగు ఈరానుకు వెడలిపోవుచుఁదన వంశ చిహ్నమగు నొక బంగారు పతక మామె కిచ్చియిట్లు పలికెను. "దేవీ! ఇది మన వంశచిహ్నము. దీనిని మన సంతానము మెడలోఁ గట్టుము. భగవంతుని దయవలన నీకు పుత్రసంతానము గలిగినఁ దప్పకుండ నాఁకు దెలియజేయుము"
రుస్తుమ్ ఈరాన్ దేశమునకు వెడలిపోయినాడు.
అనంతరము కొంతకాలమునకు రుస్తుమ్ భార్యకొక పుత్రుడుదయించెను. పతి జాడ తెలియనందున నాసుదతి యా శుభవర్తమానము భర్తకుఁ దెలుపఁజాలక పోయెను. ఆమె తన నందనునకు "సుహరాబ్"అని నామకరణము చేయించెను.
"సుహరాబ్" శుక్లపక్ష సుధాకరునివలెఁ బెరిగి పెద్దవాడగు చుండెను. వీరోచితమైన విద్యలందుఁ బ్రవీణుఁడై తండ్రికిఁదగిన తనయుఁ డనిపించు కొనెను. అతనికి వయస్సు వచ్చుకొలది జనకుని సందర్శింపవలెనను నాశ యధికమయ్యెను. తన యీప్పిత సిద్ధికై యతఁడు తూరాను సైన్యములోఁజేరి తగిన తరుణమునకై యెదురుచూచుచుండెను.
రుస్తుమునకు పుత్రుని జన్మవృత్తాంతమే తెలియదు. అతఁడు మాతృభూమిలో మన్నన లందుకొనుచు మహానందముతో తన శిష్యులను వీరులనుగా దయారుచేయుచుండెను.
ఈరాను తూరాను దేశముల మధ్య మరల వైరములు రేగినవి. ప్రశాంతి భగ్నమైనది. అక్సస్ నదీతీరమున యుద్ధమునకై యిఱుపక్షములవారును సిద్ధమైనారు.
తూరాను సైనికులు శత్రుపక్షమగు ఈరాన్ సైన్యమున కిట్లు వర్తమాన మంపిరి.
"ఈరాన్ సైనికులలో నేయొక్కరైనను మా బాలవీరుఁడు సుహరాబ్ తో మల్లయుద్ధము చేసి గెలుపొందినచో మేము మీ కోడిపోయినట్లే! లేదా మాసూహరాబ్ గెలిచినచో మాకు మీ రోడినట్లే, ఇట్లైన నుభయపక్షములకు సైన్యనష్టముండదు."
ఈరాను సైనికులిందుకు సమ్మతించి వీరశేఖరుఁడగు రుస్తుమునే ఈ వీర విహారములోఁ బాల్గొనుమని ప్రార్థించిరి.
రుస్తుమ్ రణక్షేత్రములో నిల్చుటతోడనే జయ జయ నినాదములతో దిక్కులు పిక్కటిల్లినవి. మల్లయుద్ధ మారంభమైనది. ప్రకృతి యంతయు నిశ్శబ్దమైనది. ఆరితేరిన యావృద్ధమల్లునకు బాలమల్లునకు జరుగుచున్న ద్వంద్వయుద్దమును జూచి "సెబా'సను చున్నట్లు నదీతీర మందలి వృక్షములు సైతము తలలూపసాగినవి.
బాలమల్లున కేదియో సందియము తోచినది. 'మీరేనా రుస్తుమ్ వీరులు?' అని యతఁడు రుస్తుమ్ ను ప్రశ్నించినాఁడు. సుహరాబ్ తన తనయుఁడని తెలియక "నీ మొగమునకుతోడు రుస్తుమ్ కూడ కావలయునా?' అని రుస్తుమ్ బాలమల్లునితో తిరస్కారముగాఁ నిర్లక్ష్యముగాఁ బలికెను.
రుస్తుమ్ బాలుని ధాటికి నిలువలేకుండెను. ఎన్నియో మారులు రుస్తుమ్ నేలపైఁబడెను. సుహరాబ్ చేఁజిక్కిన రుస్తుమును సంహరింపక విడిచిపుచ్చెను. "ఈపాటి శౌర్యమునకేనా వీరరుస్తుమును దాచియుంచి నీవు వచ్చితివి. వెడలిపోయి యా రుస్తుమునేపంపు"మని సుహరాబ్ మీసము దువ్వి పరిహసించెను.
రుస్తుమున కీపలుకులు ములుకులవలె గుండెలో గ్రుచ్చుకొనెను. రుస్తుమ్ కోపోద్రిక్తుఁడై గదాయుద్ధ మారంభించెను. ఆ యుద్ధమునసైత మతఁడు సుహరాబును గెలువలేకపోయెను.
అంతవారు హయారూఢులై కత్తియుద్ధమునకుఁదలపడిరి. రుస్తుమ్ సుహరాబ్ ధాటికిఁ దాళజాలక గుఱ్ఱము మీదనుండి క్రిందఁబడెను. అశ్వము బెదరిపరువెత్తెను. సుహరాబ్ మందస్మిత వదనుఁడై యీ వింత సంఘటనఁ జూడసాగెను.
వృద్దుడా యవమానము భరింపలేక "బాలుడా! నేనే వీరరుస్తుమును. ఇక రమ్ము" అని సింహగర్జనము చేయుచు లేచి నిలువఁబడెను. ఆ కేక బాలుని కత్యానందముఁ గలిగించినది. అతడు 'వీరరుస్తుమ్' అను శబ్దము వీనులఁ బడినంతనే సంతోషముతో మైమరచి యతని వంక నట్లే చూచుచుండెను.
ఆ సమయంలో రుస్తుమ్ బాలమల్లుని గ్రింద బడవైచి పైబడి ఖడ్గముతో వాని గుండెలో నొక్కపోటు పొడిచెను. సుహరాబ్ వక్షస్థలమునుండి రక్తము చిమ్మిరేగెను.
ఈ దుస్సంఘటన జూడజాలక సూర్యుఁడు పశ్చిమాద్రి చాటునకుఁబోయెను. ప్రసూనములు వాడిపోయెను. అక్సస్ నది "అధర్మమధర్మ" మని తరంగధ్వనులతో బోరున నేడ్వసాగెను.
విజయ గర్వములో మునిగి తేలుచున్న వీరరుస్తుమ్ సుహరాబును తేరిపాఱఁ జూచి "ఓయీ! నీవెవ్వర'వని ప్రశ్నించెను. రక్తకాంతులతోఁ బ్రకాశించుచున్న యా బాలవీరుఁడు గిల గిల తన్నుకొనుచు నిట్లనెను.
"అయ్యా! ఎంత పాపకర్మ మాచరించితివి? వీరుఁడు చేయదగిన దీ పనియేనా? నిజముగ నీవు ధర్మయుద్ధమున నన్ను గెలువగలవా? నీ నోట వెలువడిన 'వీరరుస్తుమ్' అను మాటచే నేను మైమరచి ఖడ్గము వీడితిని. నిరాయుధునిఁ జంపిన నీవెవ్వడవో? నా తండ్రి ధర్మాత్ముడు! అతఁడిట్టి యధర్మ కృత్యమునకుఁ బాల్పడఁడు. నీవు రుస్తుమునని బొంకుచున్నావు. నీచుడా! మా తండ్రి నీ యీ దురాగత మెరింగిన నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వేయును".
రుస్తుమ్ సుహరాబ్ వాక్యములకు చకితుఁడై 'ఓయీ! నీ తండ్రి పేరేమి?' అని యడిగెను.
సుహరాబ్ : ఇంతకుముందు నీవే వీర సింహము పేరెత్తితివో యా రుస్తుమే నా తండ్రి.
రుస్తుమ్ : ఏమి! రుస్తుమ్ నీ తండ్రియా! ఇది యసత్యము. రుస్తుమునకు కొడుకులు లేరు. ఒక కూతురు మాత్రమే యుండియుండవచ్చును. తనయుఁడై యున్నచో తూరానులోనెన్నటికిని బడియుండడు. మాకు వర్తమానము వచ్చియుండెడిది.
సుహరాబ్ : మూర్ఖుడా! నా తండ్రికి వెఱచి రుస్తుమునకు నందనులే లేరందువా? ఇదిగో! ఇటు చూడుము. ఈ మెడలోని చిహ్న మెచ్చటిదో తెలియునా? ఇది నా వీరమాతకు మా తండ్రి రుస్తుమ్ ప్రసాదించిన పతకము. ఇది మా వంశ లాంఛనము. దీనిని మా జనకుని యనుమతి ననుసరించి మా యమ్మ నా మెడలోఁ గట్టినది.
స్వర్ణపతకమును చూడగానే రుస్తుమ్ కన్నులవెంట నీరు తిరిగెను. కాళ్ళు గడగడ వడఁకెను. ఆకసము విరిగి తలపైఁబడినట్లయ్యెను. అతఁడు సుతుని శరీరముపైఁ బడి నెత్తి నోరు మొత్తుకొనుచు ముక్తకంఠముతో నేడ్వసాగెను.
తన తండ్రియగు "రుస్తుమ్" ఆ వృద్ధ మల్లుడేయని తెలియఁగనే సుహరాబ్ చకితుఁడయ్యెను.
కన్నబిడ్డ నధర్మముగాఁ గరవాలముపాలు జేసినందుకు రుస్తుం ఎంతయో దుఃఖించుచు మొలనున్న బాకు పెఱికి యాత్మహత్య చేసికొనఁబోయెను.
సుహరాబ్ తండ్రిని నివారించి "నాయనా! యనుచిత సాహసము తగదు. ఎన్నిదినములనుండియో నీ సందర్శనమునకై తపించుచుంటిని. నేఁటికి నా వాంఛితము సఫలమైనది. నీవు లేకున్న నా మాతకు దిక్కెవరు? ఆమెను గూఁడ దుఃఖసాగరమున ముంచి దుర్మరణముపాలు సేయకుము. ఆమెకు నా కడసారి నమస్కారము లందిమ్ము! తండ్రీ! నాకింక సెలవిమ్ము" అని పలికెను. ఇక సుహరాబ్ మాటాడలేకపోయెను. అతని కన్నులు మూఁతవడెను. రుస్తుమ్ నిశ్చేష్టుఁడై నిలిచియట్లే చూచుచుండెను.
* * * *
Previous Page
Next Page