Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 82


                            ఖాళీబోర్డు

    రామయ్య పూర్వకాలపువాఁడు. కల్లాకపటము లెఱుఁగని యమాయకుఁడు. పాపము దారిద్ర్య దేవత కతఁడు చుట్టము. అందుచే సమీపముననున్న పట్టణములో మామిడిపండ్ల వ్యాపారము జేయుచు జీవనము గడుపు కొనుచుండెను. మంచి మంచి మామిడిపండ్లు నమ్మకముగా చేయు చుండుటచే నాతని బేరము దినదినాభివృద్ధి నందసాగెను.
    అది వేసవికాలము. రామయ్య దుకాణములో రసాలఫలము లెక్కువగాఁ జెల్లిపోవుచుండెను. అతడు తన కొట్టు ముందుకూడ నగరములోనియన్ని దుకాణములందువలెనే యొక "బోర్డు" నుంచెను. వానిమీద "ఇచ్చట మంచి మామిడి పండ్లు విక్రయించబడును" అని వ్రాయఁబడి యుండెను.
    ఒకనాఁడు వెంకయ్యయను నొక పౌరుఁడు రామయ్య దగ్గర మామిడిపండ్లు కొనవలయునని వచ్చి యా బోర్డు చూచి యచ్చెరువందెను. తరువాత వారిరువురకీ క్రింది విధముగా సంభాషణము జరిగెను.
    వెంకయ్య: ఏమి రామయ్యా! "బోర్డు" మీద "ఇచ్చట మంచి మంచి మామిడిపండ్లు విక్రయింపఁబడును" అని వ్రాయించి నావే! ఇచ్చట కాక మఱి యెచ్చట అమ్ముచున్నావు? అట్లే "మంచి మంచి" అన్నపదముకూడ అనవసరము అనెను.
    రామయ్య ఆ పదములు తుడిపించెను ఇంకొకరోజు గోపయ్య అను వ్యక్తి వచ్చి_
    "ఏమి రామయ్యా! నీకేమైనా మతిపోయినదా? ఏమిటి పిచ్చివ్రాతలు!'మామిడి పండ్లు' విక్రయించుటకు గాక యింటిలో దాచిపెట్టుకొనుటకుఁ దెచ్చితివా? 'విక్రయింపబడును' అని వ్రాయుట యవివేకము కాదా? ఆరెండు మాటలు తొలగింపుము" అని సలహా యిచ్చెను.
    రామయ్యకు గోపయ్య పలుకులు యథార్థములని విశ్వాసము కలిగినది. 'విక్రయింపబడును" అను నక్షరములు బోర్డు మీద నుండవలసిన యగత్యము నిజముగానే లేదని యాతఁడను కొని వెంటనే వానిని తుడిపించివేసెను. ఇప్పుడిక రామయ్య దుకాణము నందు "ఖాళీబోర్డు" న్నది. ఐనను రామయ్య వ్యాపారము యథాప్రకారముగానే జరుగుచున్నది.
    ఒకనాడు రక్షకభటుఁడొకడు వచ్చి "ఖాళీబోర్డు నెందుకు తగిలించి నావయ్యా! వెంటనే తీసివేసితివా సరి. లేకున్న నీ పనిఁ బట్టెదను" అని గద్దించెను.
    రామయ్య గడగడ వడకుచు నా బోర్డును దాచిపెట్టెను. ఇప్పుడు రామయ్య హాయిగా ప్రశాంతముగా మామిడిపండ్ల నమ్ముకొనుచుండెను.
    పరులు చెప్పు ప్రతిమాటను విశ్వసించి దాని ననుసరింపరాదు. స్వయముగా నేమాత్ర మాలోచింపక యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము గోల్పోయి యుండువాఁడు రామయ్య వలెనే "ఖాళీబోర్డు" చేసికొనును.


                            * * * *

 Previous Page Next Page