Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 83

                                 


                     మానవసేవయే మాధవసేవ

    "వేణు"కు నిద్రపట్టలేదు. అతని మానసమున నేవియో భావతరంగములు పొంగి పొరలుచుండెను. అతఁడు కప్పుకున్న దుప్పటి నొత్తిగించి కుతూహలముతో తలయెత్తి నలుమూలలు చూచెను. గూటిలోని ఆముదపు దీపము మినుకు మినుకు మనుచుండెను. ప్రక్కనే నులక మంచముపై శయనించియున్న తాతయ్య తెల్లని గడ్డము దీపపు కాంతిలోఁ తళతళ లాడుచుండెను. వేణు మరల దుప్పటి తననిపట్టి పరుండెను. కాని యాతనికి నిద్దుర పట్టలేదు.
    అతఁడు చివాలున లేచి కూర్చుండెను. "తాతా! తాతా!" యని పిలచెను. తాత యులికిపడి లేచెను.
    తాత : ఏమిరా! వేణూ! నిద్ర రాలేదా!
    వేణు : లేదు తాతా! నిన్నొక సంగతి యడుగవలయు నను కొంటిని, అడుగమందువా?
    తాత : ఏమిరా అది?
    వేణు : తాతా! మన పట్టణములో రేపు గొప్ప పండుగట కదా! అందరూ తమతమ గృహముల నలంకరించుకొను చున్నారు. నూతన వస్త్రములను ధరించుచున్నారు. ఆ పండుగ పేరేమిటో గుర్తువచ్చుట లేదు తాతా!
    తాత : అదా! "గుడిగంటల పండుగ" కాదటరా!
    వేణు : ఆఁఆఁ! అవును తాతా! గుడిగంటల పండుగ. ఐతే మన పట్టణములో రేపేమి విశేషము జరుగును తాతా?
    తాత : రెపేమియు జరుగదురా! మహిమాన్వితములగు నారోజులు వెనుకనే గడచిపోయినవి.
    వేణు : ఏమి తాతా! ఆ మహిమ లెటువంటివి?
    తాత : మన దేవాలయమునకుఁ దూర్పువైపున గోపురము లేదురా! ఆ గొప్ప గోపురములో పెద్ద పెద్ద గంటలమర్పఁబడి యున్నవి చూచితివా!
    వేణు : నిజమే, అమర్పబడియున్నది.
    తాత : గుడిగంటల పండుగనాఁడు ఆ గంటలు తమంతటతామే 'గణగణ' మ్రోగును.
    వేణు : నిజమా తాతా!
    తాత : యథార్థమురా! పూర్వకాలము సరిగా నా పర్వకాలమున కట్లుమ్రోగెడివి. కాని యిప్పుడా గంటలు మ్రోగుటలేదు.
    వేణు : ఏమిటి తాతా! పూర్వపు గంటలు స్వయముగా మ్రోగెడివా! ఏమి మహత్మ్యము తాతా! అవి రేపేల మ్రోగవు తాతా? రేపేగదా ఆ పండుగ?
    తాత : అవునురా! మన రాజ్యములో ధర్మగుణ మిప్పుడు నశించినది. ఆనాటి సత్యము, శాంతి, కరుణ, ప్రేమ ప్రజల హృదయములనుండి మాయమైపోయినవి. ఆడంబరము, అహంకారము, దుర్మార్గము, ధూర్తత పెచ్చు పెరిగినవి. పవిత్ర హృదయములతో ప్రజలు భగవంతు నర్చించుట లేదు. భగవానుడు వారిని కరుణించుటయులేదు. మఱి గంటలేల మ్రోగును?
    వేణు : మఱి మన రాజుగారీ విషయము నెందు కాలోచింపరు తాతా! వారేకదా నేటి ధర్మ రక్షకులు.
    తాత : ఏమి రాజులురా! నేడు రాజుల ధర్మ రక్షణకు బూజు పట్టినది. వారసమర్థులైనారు. వారి యాత్మబలము నశించి పోయినది. స్వార్థపరత్వము హెచ్చినది.
    వేణు : మఱి యుత్తుత్త పండుగ కిన్ని ప్రయత్నములు, సంబరములు, సంరంభములు జరుగుచున్న వేమి తాతా?
    తాత " ఏ యేటి కాయేడు గంటలు మ్రోగునేమో యని ఆ మహాద్భుతము కనులారఁ గాంచవలయునని ముచ్చటపడి ప్రజలు వచ్చుచునేయున్నారు. సరిగ పండుగనాఁడు పగలు పన్నెండు గంటలకు వేయి కన్నులతో గోపురము వైపు నిరీక్షించుచునేయున్నారు. కాని గంటలు మ్రోగుటలేదు. ఐదారు సంవత్సరముల నుండి యా పవిత్రధ్వనులు వినిపించుటలేదు. చివరకు ప్రజలు నిరాశతో, నిరుత్సాహముతో, నీరస హృదయములతో మరలి పోవుచున్నారు.
    వేణు : తాతా! రేపు నేను కూడా ఆ యుత్సవమునందు పాల్గొన్న వలయునని కుతూహలముగా నున్నది.
    తాత : అమ్మో! పిల్ల లా జనసమూహములోని కరిగి తిరిగి రాలేరురా! ఆ రాజభటులు, ఆ యశ్వములు, ఆ గజములు, ఆ స్యందనములు, ఆ తండోపతండములుగ వచ్చు ప్రజలు ఆసమ్మర్దము తప్పించుకొనుట కష్టము నాయనా!
    వేణు : భయములేదు తాతా! జాగరూకుఁడనై పోయిరాగలను. ఆ మహోత్సవమును నయనపర్వముగాఁ జూడవలయునని యున్నది తాతా!
    తాత : సరే పోయి సురక్షితముగా తిరిగి రా నాయనా! నీ కోరిక నేల కాదనవలయును? ప్రత్యూషముననే బయలుదేరి వెళ్ళి మరల పెందలకడ గృహోన్ముఖుడఁవు కమ్ము.
    వేణు : అట్లే తాతా!
    తాత : భద్రము బాబూ! సరే ప్రొద్దుపోయినది. ఇఁక నిద్రపో!
    వేణు దుప్పటి కప్పుకొని నిశ్చింతగా నిదురించెను. తాత ప్రశాంతముగా భగవన్నామమును జపించుచు కన్నులు మూసి కొనెను. తెల్లవారినది.
    అది యొక గొప్ప దేవాలయము. ఆ దేవాలయము ముందొక పెద్ద గోపురము కలదు. దాని శిఖరము గగనమును చుంబించుచుండెను. ఆ గోపురములో గొప్పగొప్ప గంట లలరారుచుండెను. ఆ గంటలే యీ పండుగ దినమున మ్రోగవలసినవి.
    క్రమ క్రమముగా జనసమ్మర్దము హెచ్చసాగినది. ప్రజలు గుంపులు గుంపులుగా దేవుని సందర్శించి కానుకలు సమర్పించుటకు వచ్చుచుండిరి. వారి చేతులలోని పసిడి పళ్ళెరముల నిండ బంగారు నాణెములు, ఫలములు, ప్రసూనములు విరాజిల్లుచుండెను.
    ప్రజలందరూ తాము తెచ్చిన యుపాయనములు స్వామి కర్పించిరి. పలువిధములఁ బ్రార్థించిరి. పూజలు చేయించిరి. ప్రాణాచారములు పడిరి. వీరంగములు వేసిరి. గొంతులెత్తి యరచిరి. కాని గంటలు మ్రోగలేదు.
    మహారాజు స్వహస్తములతో రత్నములు, వజ్రములు, స్వామికి సమర్పించెను. మంత్రులు, సామంతులు, సేనాపతులు లెక్కకు మిక్కుటమగు బహూకృతులు దేవుని మందుఁ గుప్పవోసిరి. అందఱు సాష్టాంగ ప్రణామము లాచరించిరి. కాని గంటలు మ్రోగలేదు.
    చక్రవర్తి వదనము వాడిపోయెను. ప్రజలెల్లరు నిరుత్సాహపడిరి. ఇఁక నీ యేటికి గంటలు మ్రోగవని నిశ్చయించుకొనిరి. అందఱును ఖిన్న వదనముతో గృహాభిముఖులైరి.
    అంతలో వేణు కొన్ని ఫలములు పట్టుకొని గబగబ వచ్చుచుండెను. జన సమ్మర్దములో నతని కొక మూలుగు వినఁబడెను. పరికించి చూచునప్పటికి బాటప్రక్కనొక చెట్టుక్రింద బడియున్న బిచ్చగత్తె యొకతె యతనికిఁ గనుపించెను. ఆమె శరీరముపై చింకి పేలికలు వ్రేలాడుచుండెను. ఆ ముఖములో దైన్యము కాపురము చేయుచుండెను. నకనకలాడు పొట్టలతో నిరువురు మువ్వురు బిడ్డ లామెను జుట్టుకొని యుండిరి. ఆ మహోత్సవములో నా దిక్కుమాలిన దీనురాలి మొగముఁ జూచువారెవ్వరును లేరైరి. బిచ్చగత్తెకు పిడికెడన్నము పెట్టలేని దయారహితులపై దైవమునకు దాక్షిణ్యమేల కల్గును!
    వేణు మనస్సు కరగినది. అతడు చరచర బిచ్చగత్తె కడకుఁబోయినాడు. తనపైనున్న గుడ్డ వారి శరీరములపై గప్పినాఁడు. తాను భగవంతునికి సమర్పించుటకై కొనిపోవుచున్న యరటిపండ్లు వారి చేతుల కందించినాఁడు. ఇచ్చునది తడవుగ పాప మా నిర్భాగ్యులు పరమానందముతో ఫలములను భుజింపసాగిరి.

            

    అంతలో గంటలు "గణగణ" "గణగణ" "గణగణ" మ్రోగినవి. ప్రజలెల్లరు చకితులైరి. ఆశ్చర్యముతో తలలెత్తి చూచిరి. ఎదుట బిచ్చగత్తె కుటుంబమును తృప్తిపరచుచున్న 'వేణు' కన్పించెను. అతని వదనము నవ్యదీప్తులతో మెఱసి పోవుచుండెను. బిచ్చగత్తె "మీ కన్నతల్లి కడుపు చల్లగా నూరేండ్లు వర్థిల్లు" మని వేణుని దీవించుచుండెను. దూరమున నొక బైరాగి తంబురా మ్రోగించుచు "మానవసేవయే మాధవ సేవ" అని మెల్లగ పాడసాగెను.


                             * * * *

 Previous Page Next Page