Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 81


                      మందారము

                        విక్రమార్కుని జౌదార్యము

    పూర్వము భారతదేశమున నుజ్జయిని అను ఒక పట్టణము గలదు. దానిని విక్రమార్కుడను ప్రభువు పాలించుచుండెను. ఆ మహానగరము సర్వసంపదల కాకరమై విలసిల్లు చుండెను. దానశీలుఁడగు ధరణీపతి జనులను కంటికి రెప్పవలె కాపాడుచుండెను. అతని చేతి చలువ వలన ప్రజలు సకల సుఖములతో నిత్య సంతోషులై యుండిరి.
    విక్రమార్కుఁ డొకసారి యొక పెద్ద యజ్ఞము చేయ నిశ్చయించెను. అందులకు గొప్ప యాగశాల నిర్మింపబడెను. సామంత రాజులును, బంధు మిత్రులును యాగ సందర్శనముకై యాహ్వానింపఁబడిరి. రాజబంధువులతో రాజధాని నిండిపోయెను.
    ఒకనాడు విక్రమార్కుఁడొక బ్రాహ్మణుని బిలిచి "మీరు సముద్రుని కడకేగి యామమహామహుని యాగమునకు నిచ్చేయుఁడని మా ప్రార్థనగా నెరింగింపు" డని యాజ్ఞాపించెను. విప్రుఁడు రాజాజ్ఞ శిరసావహించి సముద్రుని చెంతకేగెను.
    భూమీసురుఁడు రత్నాకరుని పుష్పములతోఁ బూజించెను. ఎన్నియో విధముల ప్రార్థించెను. కాని సముద్రుఁ డేమియు సమాధాన మీయలేదు. విప్రునకు విస్మయముతోకూడ విసుగు జనించినది. అయినను నతఁ డట్టులే నిలబడి రత్నాకరుని రాకకెదురు చూచుచుండెను.
    అంతట సముద్రుఁడు వృద్ధ బ్రాహ్మణుని వేషముతో నాతనికి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుఁడు ముసలి పాఱునికి నమస్కరించి తన వృత్తాంత మెఱింగించెను. వృద్ధ భూసురుఁడు చిరునవ్వు నవ్వుచు "నాయనా! నేనే సముద్రుఁడను. నీవు వచ్చిన పని నాకుఁదెలియును సుమీ. మీ ప్రభువునకు నాపైఁగల భక్తికి సంతసించితిని. కాని ఆయన చేయు యాగమునకు నే నిప్పుడు రాజాలను. మీ రాజునకు బహుమానముగా నాలుగు దివ్య రత్నములను నీకిచ్చుచున్నాను. వీనిని సావధానుడవై కొనిపోయి విక్రమార్క మహీపాలునకు సమర్పింపుము" అని పల్కి మఱియు నిట్లనెను.
    "ఇందు మొదటి రత్నము సర్వసంపదలను సమకూర్చును. రెండవ దసంఖ్యాకులైన జనుల కాహారము తయారు చేయఁగలదు. మూడవ రత్నము విలువయైన వలువలను, భూషణములను నీయగలదు. నాల్గవది చతురంగ బలములను చేకూర్చును." సముద్రుఁడు రత్నములు భూసురునకిచ్చి యదృశ్యమాయెను. అవనీసురుఁ డుత్సాహముతో నుజ్జయిని కరిగెను. ఉజ్జయినిలో యాగ మప్పటికే పూర్తియైపోయినది. విక్రమార్కుఁడు తన సమస్త భోగభాగ్యములను యాచకులకు దానము చేసెను. మహారాజిప్పుడు వర్షించిన మేఘమువలె నుండెను.
    మహారాజు రత్నములను దెచ్చిన మహీసురునిజూచి "ఏలయాలస్యముగా వచ్చితిరి?" అని యడిగెను. బ్రాహ్మణుఁడు జరిగిన వృత్తాంతము సాంతము భూకాంతునికిఁదెలిపి చేతిలోని రత్నములఁజూపెను. రాజు సంతోషముతో "పాపము! చాల శ్రమపడితిరి! ఇందులకు నీ నాల్గు రత్నములలో మీ యిచ్చవచ్చిన రత్నమును గైకొనుఁడు" అని పలికెను. విప్రుఁడు సంతోషించెను. కాని యందే రత్నమును గ్రహించుటకును నాతఁడు నిశ్చయించుకొనఁజాలకపోయెను. "ప్రభూ! ఇంటికిఁ బోయి మా వారల నడిగి యిష్టమైనదానిని దీసికొందును" అని పలికి యాతడు గేహమున కరుదెంచెను.
    ఆ బ్రాహ్మణునాకు భార్య, కుమారుఁడు, కోడలు గలరు. అతఁడు వారందరకు రత్నముల మహిమఁ దెలిపెను. తరువాత వారికీ విధముగా సంభాషణము జరిగెను.
    కుమారుఁడు: నాయనా! మీకే రత్నమనిన నిష్టమో ముందు తెల్పుడు.
    బ్రాహ్మణుఁడు: కుమారా! "ధనమూల మిదం జగత్" అని కదా యార్యోక్తి! ధనమే మానవునకు ప్రధానమైనది. ధనమున్నవాడే లోకమునఁ బూజింపబడును. ధనికున కెల్లరును 'దాసోహ' మనక తప్పదు. ధనము సుఖ శాంతులకు మూలకారణము. కనుక మొదటి రత్నమే యావశ్యకమని నా యభిప్రాయము.
    భార్య: అట్లుకాదు. ఆహారము మానవులకు జీవనాధారము. "కోటివిద్యలు కూటికొఱకే" యన్నట్లు ఎవఁడెంత ఘనుఁడైనను నాహారము లేక జీవింపలేడు. భోజనమే మానవులకు ప్రేమ భాజనము. నాకు రెండవరత్నమన్న నిష్టముగా నున్నది.    
    కోడలు: నాకది నచ్చలేదు. అందము, ఆనందము నందఱు కోరునదే. చక్కగా నలంకరించుకొని హాయిగా నుండుటకు వస్త్రాభరణము లవసరము. కనుక నాకు మూఁడవ రత్నమన్న మక్కువ ఎక్కువగా నున్నది.
    కుమారుఁడు: ఇవి యన్నియుగాదు. బలవంతులే ప్రపంచమున రాణింతురు. బలవంతులకు సర్వకార్యములు సుసాధ్యములగును. బలము నవోత్సాహము చేకూర్పగలదు. శక్తిశాలి కెందును నెదురులేదు. వేయేల! చతురంగబల సంపన్నుడైనచో సామ్రాజ్యమునే సంపాదింపవచ్చును. కనుక నాల్గవ రత్నము సర్వశ్రేష్ఠమైనది. అదియే యవశ్యము కోరదగినది.
    నలుగురుకు నాల్గు రత్నములపై మనస్సు పోయినది. ఒకరి యభిప్రాయముతో నొక రేకీభవింపలేదు. విప్రుడా గృహవివాదమును తాను స్వయముగా తీర్చలేకపోయెను.
    బ్రాహ్మణుఁడు రాజుకడ కరిగి వివాద విషయమును విన్నవించుకొనెను. అది విని దాననిరతుఁడగు ధరణీపతి "విప్రోత్తమా! మీకుఁగావలసిన యానాల్గు రత్నములను తీసికొనుఁడు. సంశయింపకుఁడు." అని పలికి రత్న చుతుష్టయము నతని కర్పించెను. బ్రాహ్మణుడు పరమానంద భరితుఁడయ్యెను.


                                          * * * *

 Previous Page Next Page