Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 80

                                 


                                        ఈరా భారతి

           

    పూర్వము మేవాడ దేశమునుదయసింహుఁడను నొక రాజపుత్రవీరుఁడు పరిపాలించుచుండెను. అతని కిరువురు కుమారులు గలరు. వారిరువురిలోఁ బెద్దవాఁడు ప్రతాపసింహుడు. రెండవవాఁడు శక్తిసింహుఁడు.
    శక్తిసింహుఁడు జన్మించినపుడు దైవజ్ఞు లాతఁడు తండ్రి గండమున పుట్టినవాఁడని వచించిరి. అందుచే నుదయసింహుడు శక్తిసింహుని గొనిపోయి మహారణ్య మద్యములోఁ బరిమార్చి రండని తలారుల నంపెను. కాని సలుంబ్రాధీశ్వరుడైన కృష్ణసింహుఁడు శక్తిసింహుని దలారుల బారినుండి రక్షించి తన దేశమునకు దీసికొనిపోయి రహస్యముగాఁ బెంచుచుండెను.
    ఉదయసింహుని యనంతరము ప్రతాపసింహుఁడు మేవాడ దేశమునకు మహారాణా యయ్యెను. అతడు తన సోదరుడగు శక్తిసింహుని మేవాడ రాజ్యములోనికి పిలిపించుకొని యాదరించెను. ఒకనాడు రసపుత్రవీరు లందరును వేటకై యరణ్యమునకు వెడలిరి. మహారాణా ప్రతాపసింహుడు ధనుర్బాణములు ధరించి విచ్చలవిడిగా విహరించుచున్న క్రూరమృగములను సంహరించుచుండెను.
    ప్రతాపసింహుఁడు వింటి నెక్కు పెట్టి యొక యడవిపంది వెంటబడెను. గుఱిచూచి యతడొక బాణమును విడిచెను. అలుగు రివ్వున వచ్చి యా యడవిపంది డొక్కలో గ్రుచ్చుకొనెను. సరిగా నదే సమయమునకు మరియొక బాణము వచ్చి యా సూకరమునకుఁ దగిలెను వెంటనే యా వరాహము క్రిందబడి విలవిల గొట్టుకొని యసువుల వదలెను.
    ప్రతాపసింహుఁడు దానినిఁ దీసికొని పొమ్మని భటుల కాజ్ఞాపించెను. అంతలో జటాలున నచటి కోక వీరుడు వచ్చి "వనవరాహము నా బాణపు దెబ్బకే ప్రాణములు వీడినది. కావున దానిపై నధికారము నాది" యని పలికెను.
    ప్రతాపసింహుఁడాశ్చర్యముతో "శక్తిసింహా! దానిని నీవు సంహరించితివా? నా బాణమే దానికి మొదటఁఁదగినది. అసత్యములాడకుము" అనెను. శక్తిసింహుఁడావేశముతో "మహారాణా! అధికారము నడ్డము వెట్టుకొని యధర్మము నాచరింపనెంచుచున్నావా? నన్ను జయించి యా వనవరాహమును గొని పొమ్ము" అని పలికి ఖడ్గము పెరికి యన్నపై దుమికెను. ప్రతాపసింహుఁడు వీరావేశముతో కత్తి దూసెను. అన్నదమ్ములకు భయంకర సంగ్రామ మకారణముగ జరుగుచున్నది. హరభట్టారకుఁడు రాజపురోహితుఁడు. అతడు ప్రతాపసింహ శక్తి సింహులను వారింపనెంచి వారినడుమ నిలిచి యెన్నియో విధముల బ్రతిమాలెను. హరభట్టారకుని హితోక్తులు వారి చెవికెక్కలేదు. సోదరులిరువురు పరస్పరము ఖడ్గహస్తులై కలహింపఁబోయిరి. అంతలో "హా మహారాణా!" యను కంఠధ్వని వినఁబడెను. రణరంగమధ్యమున రాజ పురోహితుని రక్తము ప్రవహించెను.
    హరభట్టారకుఁ డాత్మహత్యచేసికొని నేలఁ గూలెను. ప్రతాపసింహుని కన్నులు చెమ్మగిల్లెను. "శక్తిసింహా! నీ యనవసర వివాదము వలన పూజ్యులగు హరభట్టారకులు మరణించిరి గురుహత్య బ్రహ్మహత్య చేసిన మహాపాపమునకు నీకు దేశ బహిష్కారమే శిక్షగా విధించుచున్నాను. ఇఁక నిటనుండి తొలగి పొమ్ము" అని మహారాణా గర్జించెను.
    శక్తిసింహునకుఁ బట్టరాని యాగ్రహము కలిగినది. అతడు చేయునదిలేక పండ్లు పటపట గొరుకుచుఁ జరచర యటనుండి వెడలిపోయెను.
    శక్తిసింహుఁడు మొగలాయి చక్రవర్తియగు అక్బరు సార్వభౌముని కడకుఁ బోయి యాతని కడనొక యున్నత సైన్యాధ్యక్షుఁడుగా నుద్యోగమునకుఁగదిరెను.
    మాహారాణా ప్రతాపసింహుఁడు సుప్రసిద్ధ దేశభక్తుడు; స్వతంత్రవీరుఁడు; అభిమానవంతుఁడు. సకల దేశనాయకులు మొగలాయి చక్రవర్తికి లొంగిపోయి యతనికి సామంతులైరి. స్వాతంత్ర్యవీరుడగు మహారాణా ప్రతాపుడు మొగలు చక్రవర్తికి 'దాసోహ' మనలేదు. అతడొక్కడే గౌరవముగాఁ దలయెత్తి తిరుగఁ గలుగుచుండెను. అది ఢిల్లీశ్వరుండగు నక్చరు చక్రవర్తికి గంటకముగా నుండెను.
    శక్తిసింహుని రాక మొగలాయి చక్రవర్తి కానందముఁ గూర్చినది. తన్ను లెక్కచేయకున్న రాణాప్రతాపసింహుని సాధించుట కవకాశము లభించినదని యతఁ డు సంతసించెను. శక్తిసింహుఁడు పూర్వవైరమును సాధింపఁ దలచెను.
    అక్బరు ననుజ్ఞగొని శక్తిసింహుఁ డపారములగు సేనా వాహినులతో మేవాడదేశముపై దండెత్తి వచ్చెను.
    అది కాళరాత్రి. మొగలు సైనికులు గుడారములలో హాయిగా నిదురించుచుండిరి. శక్తిసింహుఁ డొకచోట గూర్చుండి తీవ్రముగా నాలో చించుచుండెను. అంతలో పదునాలుగేండ్ల "బాలఫకీ" రొకఁడు శక్తిసింహుని కడకు వచ్చెను.
    శక్తిసిం :- నీ వెవరవు? ఇచట కేల వచ్చితివి?
    బాలఫకీరు :- మీతో మాటలాడిపోవలయునని వచ్చితిని.
    శక్తిసిం :- నాతో నీకేమి పని?
    బాలఫకీరు చిరునవ్వు నవ్వుచు తన దొంగదుస్తులను తీసి వేసెను. శక్తిసింహుఁడాశ్చర్యముతో "ఎవరు రాకుమారి! ఈరాభారతీ!" నీ వేల వచ్చితివమ్మా? యని యడిగెను.
    ఈరా భారతి మహారాణా ప్రతాపుని ముద్దుల పుత్రిక.
    ఈరా:- నేను నేఁడొక మహాకార్యముఁ జేయవచ్చితిని. తండ్రీ! మీ రిపుడిచట కేల వచ్చితిరి?
    శక్తిసిం :- ఆ విషయము నీకెందుల కమ్మా? యుద్ధమునకు వచ్చితినిలెమ్ము.
    ఈరా :- తండ్రీ! ఈ సైన్యము లెవరివి?
    శక్తిసిం :- అక్బరు చక్రవర్తివి.
    ఈరా :- మీ రెవరితో యుద్ధము చేయవచ్చితిరి?
    శక్తిసిం :- రాణా ప్రతాపసింహునితో.
    ఈరా :- తండ్రీ! అతఁడు మీ సోదరుఁడు కాదా!
    శక్తిసిం :- అయిన నేమి? నన్నవమానించినాఁడు.
    ఈరా :- నాయనా? మీ జన్మభూమి యేది?
    శక్తిసిం :- మేవాడదేశము.
    ఈరా :- తండ్రీ! అన్నియుఁ దెలిసిన మీరేనా యీదుష్కృత్యమునకుఁ బాల్పడితిరి? కన్నతల్లిపైఁ గత్తిఁగట్టితిరా? మాతృభూమిపై దండెత్తివచ్చితిరా? ఇదెక్కడి ధర్మము? ఇదెక్కడి వీరత్వము?
    శక్తిసిం :- ప్రతీకారము చేయుట రాజపుత్రవీరుని లక్షణమమ్మా! నన్నవమానించిన మహారాణాపైఁ బగఁదీర్చుకొన వచ్చితి నమ్మా!
    ఈరా :- ఆహా! ప్రతాపసింహునిపైఁ బగఁగొనుటా! తండ్రీ! మిమ్ము సాదరముగాఁ జూచినందులకా? ప్రతాపసింహుఁడు నీ యగ్రజుడే! మీ తండ్రి నిన్ను జంపఁ బంపిన వలదని వారించినాడే! ఆ సలుంబ్రాధీశుని కడనుండి పిలిపించి సోదరప్రేమతో ఆదరించినాడే!
    తండ్రీ! మీ సోదరునిపైఁ గల యాగ్రహముతో మేవాడను సర్వనాశనము చేయుదువా? మాతృభూమి గౌరవమును మంట గల్పెదవా? చిత్తూరు కోటను నామరూపములు లేకుండఁ జేసెదవా? దేశమాత చేతులకు దాస్యబంధములు తగిలించెదవా? దురాచారులకు సాయము చేయుదువా? రసపుత్ర చరిత్రమును గళంకము చేసెదవా? నీ శౌర్య ధైర్యములు మాతృదేశమును మారణము చేయుటకు వినియోగించెదవా? ఇప్పటికే శిథిలమై పోయిన మన చిత్తూరు దుర్గమును సర్వనాశనము చేయుదువా? "శిశోదియా" వంశగౌరవము గంగలోఁ గలిపెదవా? "జననియు జన్మభూమియు స్వర్గముకన్న మిన్న" యను మాట మఱచి పోయితివా?
    రాజపుత్రులు గౌరవ హీనులై మొగలుల యడుగులకు మడుఁగు లొత్తిన నాఁడు నీకు ప్రశాంతి చేకూరునా? అప్పుడు నీ కానందము లభించునా? బ్రతికి చెడిన రాజపుత్రుల దైన్యజీవితములను గని నీవు సంతోషింతువా?
    నాయనా! అధర్మమున కొడిగట్టకుము. అత్యాచారమునకు బాల్పడకుము.
    తన సర్వస్వమును సమర్పించి దేశస్వాతంత్ర్యమును నిల్పుకొన్న మహారాణా ప్రతాపసింహునిఁ దలచుకొనుము. తల్లిదేశముపై దాడివెడలిన నిన్ను గూర్చి యొకమాట ఆలోచింపుము.
    తండ్రీ! ప్రతాపసింహుడు స్వాతంత్ర్యజ్యోతి. నీవా వీరాధివీరుని యనుఁగు సోదరుఁడవు! తొందరపడకుము. ఇప్పటికైనను మించిపోయినది లేదు. కర్తవ్యమును గుర్తింపుము!
    ఈరాభారతి పలుకులు విని శక్తిసింహునినోట మాట వెలువడలేదు. అతని హృదయము చలించిపోయినది. కంఠము గాద్గద్య మందినది. కాలుసేతులు వడఁకినవి. మనస్సు మారిపోయినది. అతఁడు ఈరాను కౌగలించుకొని "అమ్మా! నాకుఁ గర్తవ్యము బోధించితివి. మదాంధుడ నగు నాకన్నులు విప్పితివి. మహారాణా కడకుఁ బోదము రమ్ము". అని యామెను వెంటఁబెట్టుకొని చకచక ప్రతాపసింహునిఁ జేరఁ బోయినాడు.
    శక్తిసింహుఁడు తన దుడుకుతనమునకు, దురాలోచనకు సిగ్గుపడుచుఁ బ్రతాపసింహుని క్షమాపణ వేఁడుకొనినాఁడు.
    అయన్నదమ్ము లిరువురు హర్షబాష్పములతో నొకరినొకరు ఆలింగన మొనర్చుకొనినారు.


                                            * * * *

 Previous Page Next Page