Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 79

                                 


                        వీరబాల మాంచాల

           

    కర్తవ్యపాలనము కొఱకై తన జీవిత సౌఖ్యములను త్యాగముచేసిన వీర రమణీమణి మాంచాల. మాంచాల పల్నాటి కృష్ణుఁడని చరిత్ర ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మనాయని ముద్దుల కోడలు. రెండవ యభిమన్యుఁడని యశస్సు గడించిన బాలచంద్రుని జీవితేశ్వరి. ఆమె జనకుఁడు శూరశేఖరుఁడగు గండు కన్నమ నాయఁడు. ఆమె తల్లి వీరపత్ని రేఖాంబ.
    బాలచంద్రుడు చిన్న వయస్సులోనే మంచాలను పరిణయమాడెను. మాంచాల సుకుమారి, సుందరిమూర్తి. బాలచంద్రుఁడు వీరశిరోరత్నము. ఆత్మాభిమానము మిక్కుటముగా గలవాఁడు. అందుచే వారి దాంపత్యము ప్రపంచమున కాదర్శప్రాయము కాగలదని బంధుమిత్రులు తలచుచుండిరి.
    అప్పుడు పల్నాడు నలగామ రాజు పరిపాలించుచుండెను. అతనికి నాయకురాలను నొక మహామంత్రిణి కలదు. నలగామ రాజునకు మలిదేవరాజను నొక సోదరుఁడు కలడు. మలిదేవరాజునకు బ్రహ్మనాయఁడు మంత్రిత్వము వహించెను.
    నాయకురాలి దుర్బోధనములు విని నలగామరాజు మలిదేవరాజునకు రాజ్యమునఁబాలీయలేదు. బ్రహ్మనాయఁడు శాంతి కాముకుఁ డగుటచే నన్నదమ్ములలో విరోధములు వినాశ హేతువులని తలంచి నలగామ రాజునకు ధర్మమార్గము ననుసరింపుమని రాయబార మంపెను. దుర్గార్గుడగు నలగామరాజు రాజధర్మము నైన పాటింపక రాయబారియగు అలరాజును చంపించెను అందుకే బ్రహ్మనాయనికి సమరమే యవశ్య మాచరణీయ మయ్యెను.
    ఇరువాగుల సేనలును కార్యమపూడికడ యుద్ధమునకు సిద్ధపడినవి. అప్పటికి బాలచంద్రుఁడు నూనూగు మీసముల నూత్న యౌవనమువాఁడు. చిన్నతనపు చిలిపిచేష్టలనైన మానిన వాఁడు కాదు. అతనికి తనవారెల్లరును కదనభూమి కరిగినారని తెలియవచ్చినది. అతని ప్రతి రక్తనాళమునందును వీరరక్తముప్పొంగినది. వెంటనే సమరభూమి కురుకుటము సంసిద్ధుఁడైనాఁడు.
    పాపము! ఐతమ్మ మాతృహృదయము క్షోభించిపోయినది. బాలుని యుద్ధమున కంపుట కామె యంగీకరింపలేదు. కాని బాలచంద్రుఁడామెను వీరమాతను చేయఁదలంచినాడు. అతడు "అమ్మా! తండ్రిగారు ధర్మప్రతిష్ఠ కొఱకై పోరాడుచుండ నేనింటఁ గూర్చుందునా? నేను తెలుఁగు వీరుడఁను. తల్లీ! నా కనుజ్ఞ నిమ్ము! పోయివచ్చెదను" అని పలికెను.
    వీరకుమారుడైన బాలచంద్రుఁ డెట్లయినను యుద్ధభూమికిఁబోక యానడఁని యైతమ్మ గుర్తించినది. ఐనను నతనిని మాంచాలకడ ననుమతి దీసికొనఁ బంపినచో నా యువతి సౌందర్యమే యతనిని కాలు కదలనీకుండ జేయగలదని యామె ముహించినది. ఐతాంబ పుత్రుని శరీరము నిమిరి విజయుడవు కమ్మని యాశీస్సు నోసంగినది. మాంచాల కడకుఁబోయి యామె యంగీకారము నందుకొని రణరంగమున కరుగుమని యాజ్ఞాపించినది.
    తల్లిమాట తలదాల్చి యతఁడు మాంచాల సౌధమున కరిగెను. బాలచంద్రుడు వచ్చుచున్నాఁడని తెలియఁగానే మాంచాల యమితానందము నందినది. జీవితనాయకుని దర్శన మబ్బునని యా రమణి యెంతయో సంతసించినది. అంతలో బాలచంద్రుడు మాంచాల యున్న మేడ మెట్లెక్కి పైకి వచ్చెను. మాంచాల పతికి పాదపూజలు చేసినది. దంపతుల నడుమ చాలాసేపు సరససల్లాపములు నడిచినవి.
    బాలచంద్రుడు యుద్ధమునకు వెంటనే పోయితీరవలయునని పట్టుపట్టెను. మాంచాల లోకానుభవములేని బాలిక. పతి మనస్సును యుద్ధము నుండి మార్చుటకామె చేతకాలేదు. వెంటనే యామె తన తల్లి దగ్గరకు పరుగెత్తి వెళ్ళినది. తన భర్త సమరమున కరుగఁబోవుచున్నాడనియు, తన జీవిత సౌఖ్యముల నిల్పుకొనుటకు తానేమి చేయవలయునో చెప్పుమనియు మాంచాల తన తల్లియగు రేఖాంబను పరిపరి విధముల ప్రార్థించినది.
    రేఖాంబ యశాశ్వతమైన సౌఖ్యము కొఱకై ధర్మ సమరము సేయబోవు పతిని వారించుట తగదని పుత్రికకు హితము బోధించినది. "నీ నాథుని యశస్సు చిరస్థాయి యగును! నీవు వీరపత్ని వగుదువు! నీ నాధుఁడు సేయబోవు వీరవిహారమున కడ్డుపడకుము. నీవు నీ పతికి వీరఖడ్గ మందించి, రక్తతిలకము ముఖమున దిద్ది సత్వరము సంగరమున కంపుము. తుచ్ఛభోగముల నాసింపకుము" అని రేఖాంబ మాంచాలకు హితోపదేశము చేసినది.
    మాంచాల యా మాటలు సావధానముగ నాలకించినది. తల్లి బోధించిన వీరధర్మ మామె హృదయమున నాటుకొని పోయినది. ఆమె వెంటనే తిరిగి జీవితేశ్వరునికడ కరిగినది. ఆ యౌవనవతి తనలో పొంగివచ్చు కోరికల నణచుకొనలేక పోయినది. అందమైన పతి ముఖము చూడగానే యామె కతనితో ముచ్చటలాడఁ దలఁపు గల్గినది. బాలచంద్రుడు మాంచాల సేయుచున్న సరసాలాపములోఁ బడి యుద్ధము మాటయే మఱచిపోయెను.
    ఈ విధముగ నా యువదంపతులు సంతోషముగాఁ గొంత సమయము గడిపిరి. అంతలో వీరబాల మాంచాలకు తల్లి మాటలు గుర్తునకు వచ్చినవి. ఆమె పతి నుద్దేశించి యిట్లు పలికినది.
    "నాథా! మీరు వీరులు గదా! ఈ విధముగా ముద్దరాలితో ముచ్చట లాడుచుఁ గూర్చుండుట మీకు ధర్మమా? మీ వారందఱును సమరభూమిలో దుమికి న్యాయరక్షనమునకై తమ జీవితముల నర్పింపనుండిరే! మీ రింటనుండుట సిగ్గుచేటుగాదా! లెండు. మీ శత్రువులను చీల్చి చెండాడి ధర్మమును రక్షింపుడు. అదియే మీ కర్తవ్యము. గెలిచి యశస్సుగాంచుటో, చచ్చి వీర స్వర్గము నందుటో యీ రెండే వీరుల కర్తవ్యములు. ధర్మ రణములో మరణమందినను కీర్తిగల్గును. బయలుదేరుడు."
    మాంచాల పలుకులు బాలచంద్రుని మేల్కొల్పినవి. మాంచాల వీరఖడ్గమును పతి కరములలో నుంచినది. ముఖమున తిలకము పెట్టినది. అతని జయము నభిలషించుచు నిట్లు వచించినది.
    "రతిరాజ సుందరా! రణరంగ ధీర!
    కమలబాంధవతేజ! కరుణాలవాల!"
    మాంచాల పలికిన వీరవచనములతో బాలచంద్రుని దేహమున వేడి నెత్తురు ప్రవహించెను. ఆమె ప్రబోధ మాతని విక్రమును నినుమడింపఁజేసెను. బాలచంద్రుఁడు శత్రువుల నెందఱనో చంపి కడకు సంగ్రామములో వీరస్వర్గ మలంకరించెను.
    కదనము విషయమే మఱచి యంతిపురమునఁ గూర్చుండి తనతో ముచ్చటలాడు పతికి కర్తవ్య మెరింగించి ఖడ్గము చేతి కిచ్చిన వీరకుమారి మాంచాల.
    భర్త కీర్తిప్రతిష్ఠలకై పల్నాటి గౌరవమునకై తన జీవిత సౌఖ్యమును బలిచేసికొనిన వీరబాల మాంచాల.
    మాంచాల వంటి మగువ మిన్నలఁ గన్న మన యాంధ్ర మాత ధన్యురాలు; మాన్యురాలు.


                             * * * *

 Previous Page Next Page