Previous Page Next Page 
చెదిరిపోతున్న దృశ్యం పేజి 8

చెదిరిపోతూన్న దృశ్యం...
    మామ్జకి తాతయ్యంటే
    పంచదార చిలకలన్నా ప్రాణం
    తాతయ్యకి మామ్మంటే
    పండు మిరపకాయ పచ్చడికన్నా పరమ ఇష్టం
    గతాన్ని కనీసం రోజుకు ఒకమారైనా తల్చుకుంటారు
    మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటారు
    మామ్మ పసిపిల్లలా ఉడుక్కుంటుంది తాతయ్య మాటలకి
    మరింత ఉడికిస్తాడు ఆమెనేడిపిస్తూ తాతయ్య
    కళ్ళూ ముక్కు కాలువ కట్టి
    మున్సిపాలిటీ తొంగిచూడని మురికి బస్తీలా
    అవుతుంది మామ్మ మొహం
    బస్తీనంతా హడలగొట్టి
    బలాదూర్ తిరిగే రౌడీలా వుంటుంది
    తాతయ్య వైనం
    మామ్మ ముక్కెర మీద విసురు విసుర్తాడు తాతయ్య
    'పశువు ముక్కుకు తాడేసి లాగినట్టుంది
    నీ ముక్కుకు ముక్కెర' అంటాడు
    'వయసు మళ్లినా రంగు పూసిన ఆ మీసాలు
    బొద్దెంకల్లా వున్నా'యంటుంది
    తాతయ్య మీసాలని ఏవగించుకుంటూ మామ్మ
    మామ్మకి బొద్ధెంకంటే భయమని తెలిసి
    మెల్లగా కర్ర పట్టుకుని లేచి
    ఊడిపోతున్న పంచె సవరించుకుంటూ
    మామ్మ మీది కొస్తాడు తాతయ్య
    కొట్టడానికి కాదు
    ముద్దెట్టుకోవడానికి!
    'బొద్ధెంక మీసాలు నాదగ్గెరికి రావొద్దు'
    భయపడిపోతుంది మామ్మ నిజంగానే
    వాటిని బొద్ధెంకల్లా ఊహించుకుంటూ
    'ముక్కెరపట్టి లాగి మరీ ముద్దెట్టుకుంటాను
    మూతి కడ్డంగా ముక్కెరెందుకో'
    తాతయ్య మీది మీది కొస్తాడు
    నా వెనకాలే దాక్కునేది మామ్మ
    అడ్డు జరగొద్దని బతిమాలుతుంది
    తాతయ్య నన్ను పట్టుకుని ముద్దెట్టుకుంటాడు 
    ముసి ముసిగా నవ్వుకుంటాడు
    బొద్దు మీసాలు మెలేస్తూ
    అసలు విషయం మీకు తెలీదు కదూ-
    ఆరోజు తాతయ్యా మామ్మల పెళ్లిరోజు!
    అమ్మా నాన్నా కొత్త బట్టలు కొన్నారు
    'కాస్త మీసాల రంగు తెచ్చి పెట్టవూ?
    మామంచి బాబువి' తాతయ్యకి చెప్పకు
    బతిమిలాడింది మామ్మ
    బుంగమీసాలింకా నిగ నిగా మెరుస్తాయ్
    అని నవ్వుకుంటూ
    నన్ను తన వెంట తోడు రమ్మన్నాడు తాతయ్య
    బజారుకెళ్లి ముక్కెరకు తగిలించడానికి
    బజారుకెళ్లి ముక్కెరకుతగిలించడానికి
    మూడు ముత్యాల గుత్తి కొనడానికి
    'మీ మామ్మకి చెప్పకేం' అంటూ
    ముక్కెరకి ఈ గుత్తి తగిలిస్తే
    మీ మామ్మ మొహం ఇంకా వెలిగిపోతుంది
    అని నవ్వుకుంటూ చేతి కర్ర పారేసి
    నా చెయ్యుచ్చుకు నడిచాడు హుషారుగా
    తాతయ్య మామ్మల మధ్య నాకంచం-
    అమ్మ చేసిన పిండివంటల కేసి
    ఆత్రంగా చూస్తూ కూర్చున్నాను
    'ఈ ముత్యాల గుత్తిని ముక్కెరకు తగిలించి
    గారెలు తిను చూద్దాం'
    గుత్తి నందించాడు తాతయ్య
    'ముందు ఈ రంగుని మీసాలకు పూసుకుని రండి
    నిగనిగ లాడుతాయి వస్తాదు మీసాల్లా
    అంది మామ్మ గర్వంగా రంగు నందిస్తూ
    క్షణం ఇద్దరూ నోట మాట రాక
    మొహమొహాలు చూసుకున్నారు బిత్తరపోయి
    'బొద్ధెంకల్లాంటి మీసాలు నీకిష్టం లేదని
    తీయించేశా పిల్లా'
    'రంగు సీసా కేసి పకపకా నవ్వుతూ అన్నాడు తాతయ్య
    'పశువుకు కట్టినట్టున్న ముక్కెర' మీకు నచ్చలేదని
    మార్పించేశాను'
    ముసి ముసిగా నవ్వింది ముత్యాల గుత్తి చూస్తూ మామ్మ
    ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు
    ఆ నవ్వుల్లో శృతి కలుపుతూ అందరం భోంచేశాం
    ఆ నవ్వుల్లో వెన్నెలలు పండాయి
    అమ్మా నాన్నల చిరునవ్వులు
    జీరబోయిన గొంతులో గుసగుసలాడాయి
    మళ్లీ మామూలే!
    మామ్మ తాతయ్యల వసివాడని
    పడిసి జ్ఞాపకాల మధ్య
    కసికసిగా దెబ్బలాటలు!
    'నిక్షేపంలాంటి ముక్కెర మార్చిపారేశావ్!
    నీ మొహం చూడ బుద్ధి కావడం లేదు'
    తాతయ్య  చీదరింపు.
    'సంపెంగ పువ్వులాంటి మీసాలు
    తీసి పారేశారు!
    పప్పు శుద్దలా వుంది మొహం'
    మామ్మ విసుగు
    'పోనీలే మామ్మా నీకు బొద్ధెంకలు
    జ్ఞాపకం రావు
    తాతయ్యను ముద్దెట్టుకోవచ్చు' అన్నాన్నేను
    'ఆరిభడవా! అచ్చు మీ తాతయ్య పోలికే'
    కౌగిలించుకుంది మామ్మ
    'ఓరి చిచ్చరపిడుగా! అన్నీ మీ మామ్మ మాటలే'
    ముద్దెట్టుకున్నాడు తాతయ్య
    వారి కళ్లల్లోని కాంతి
    వేయి బల్బుల సమానం
    వారి మనస్సుల్లో శాంతి
    ఊహకందనంత వైశాల్యం
    వారి పోట్లాటల్లో కలిసి జుర్రుకున్న ఆనందం
    మాటలకందని మాధుర్యాల తీయదనం
    వారి ప్రేమలో కలిసి పంచుకున్న
    ఆవేశం ఆరాటం అపార్ధాలు ఆప్యాయతలు
    అనురాగాలు అభిమానాలు కలగలిపిన నిండైన జీవితం
    కదంబంమాల నుంచి విరిసే పరిమళం
    మల్లెలు పొన్నలు మరువాలు కలగలసిన
    సుమహారం ఆ జీవితం
    పరిపూర్ణమైన సంతృప్తికి
    సంపూర్ణమైన నిదర్శనం
    నేడు పగలే దివిటీతో గాలించినా
    కనబడక మరుగుపడిపోయిన
    ఈ అదృశ్య పవిత్ర చిత్రం
    వర్తమానంలో చెదిరిపోతున్నదేమోనని నాభయం
    రేపటి నా తరానికి ఈ తీపి గుర్తులు
    చెరిగి పోకూడదని నా ఆరాటం!
                  * * *

 Previous Page Next Page