Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 78

                                 


                              సుల్తాను నాసిరుద్దీను

           

    నసిరుద్దీను పేరెన్నికగన్న పెద్ద సుల్తాను. ఆయన యెంత గొప్ప ప్రభువో యంతటి నిరాడంబరుఁడు. తన సేవకై సేవకుల నెవ్వరిని నియమించుకొనలేదు. తన పనులన్నియుఁ దానే స్వయముగఁ జేసికొనుచుండెడివాఁడు. ఎవరి పనులు వారు స్వహస్తములతో నెరవేర్చుకొనుట ప్రతి మానవుని ధర్మమని యాతని దృఢ నిశ్చయము.
    నాసిరుద్దీను ప్రభుత్వ ధనాగారమునుండి రాగి యేగాని సైతము ముట్టుకొనెడివాఁడు కాఁడు. అది ప్రజల ధన మనియు, దానికిఁ దాను ధర్మకర్త మాత్రమే యనియు, ప్రజోపయోగమునకే యా ధనము వ్యయమొనర్చుట ధర్మమనియు నాతని విశ్వాసము.
    ఆకాలమున ముద్రణ యంత్రములు లేవు. ఎంతటి పెద్ద గ్రంథమైనను జనులు స్వహస్తములతోనే లిఖించుకొనుచుండెడి వారు. ధనవంతులు తమ కావశ్యకమైన గ్రంథములను ధన మొసఁగి వ్రాయసకాండ్రచే వ్రాయించుకొను చుండెడివారు. ఒక్కొక్క గ్రంథమునకు రెండు మూడు వందల రూప్యములు లేఖకులకు లభించుచుండెడివి.
    నాసిరుద్దీను గొప్ప వ్రాయసకాడు. అతని యక్షరములు ముత్యాల మాలలవలె సుందరములై కన్నులు విందుగా కన్పించు చుండును. అతఁడు తన కళానైపుణ్యముచే మిక్కిలి చక్కగా గ్రంథములను దిద్ది తీర్చెడివాఁడు.
    నాసిరుద్దీను మహమ్మదీయ వేదమగు ఖురాను నకళ్ళు వ్రాసి వీధులతో విక్రయింపఁజేయుచుండెను. చక్రవర్తి స్వహస్తములతో వ్రాసిన యా పుస్తకములను ప్రజలు పెద్ద వెలయిచ్చి కొనుచుండెడివారు.
    ఈ విధముగ సంపాదించిన విత్తము నా మహమ్మదీయ ప్రభువు తన కుటుంబ పోషణమునకు వెచ్చించుచుండెను. సుల్తానువలెనే యాయన "బేగము" గూడ నింటిపనులన్నియుఁ దానే చేసికొనుచుండెను. అన్నము వండుట, రొట్టెలు కాల్చుట, ప్రక్కలు వేయుట మొదలగు గృహకృత్యములను నిర్వర్తించుటకు సేవకు లెవ్వరిని నుంచుకొనలేదు. అంతటి గొప్పవారయ్యు నా దంపతులు సమస్తము స్వహస్తములతో నెరవేర్చుకొనుచుండిరి.
    ఒక దినమున "జనానా"లో "బేగము" రొట్టెలు కాల్చు చుండెను. పొరపాటున పని తొందరలో నామె చేయి పెనమున కంటుకొనెను. పెనము బాగుగా కాలియుండుటచే "బేగము" వ్రేళ్ళు చుర్రుమని బొబ్బలెక్కెను. ఆమె వెంటనే సుల్తాను సమీపమునకు పరుగెత్తుకొని వచ్చెను.
    సుల్తాను:- బేగమ్! ఏమి జరిగినది? ఎందుల కింత వేగిరము వచ్చితివి?
    బేగము:- జహాపనా! వెంటనే యొక వంటవానిని పిలిపింపుఁడు.
    సుల్తాను:- వంటవాఁ డెందులకు?
    బేగము:- ఎందుల కేమిటి? వంట చేయుటకు.
    సుల్తాను:- నీ శరీరములో ననారోగ్యముగా నున్నదా? అదియేమి! నీ చేతినిండ బొబ్బలేమి?
    బేగము:- నా చేయి కాలినది. నేనీ రోజు రొట్టెలు కాల్చలేను. అందులకే వంటవానిని రాప్పింపుఁడని మనవిచేసికొన వచ్చితిని.
    సుల్తాను:- (నవ్వుచు) బేగమ్! నీవు రొట్టెలు కాల్చలేవు. నీ చేయి కాలినది. నిజమే! నీవు రొట్టెలు కాల్చుట కష్టము; కాని నేనేమి చేయుదును! నా చేతిలో ప్రస్తుతము ధనము లేదు. నిరుపేదలమైన మనము వంటవాని నెక్కడ పెట్టుకొనగలము?
    బేగమ్:- మనము నిరుపేదలమా! ఇదేమిటి? మీరు సుల్తానులు. మీ ధనాగారములో కోట్లకొలఁది బంగారు నాణెములు మూలుగుచున్నవి గదా!
    సుల్తాను:- పిచ్చి బేగమ్! ఆ ధనాగారము మనదనుకొంటివా! కాదు కాదు; అది మనది కాదు. అది ప్రజలది. ప్రజా ధనమును ప్రజల కొరకే వెచ్చింపవలయును గాని ప్రభువులు దిగమ్రింగరాదు. దానిపై మన కధికారము లేదు.
    బేగమ్:- అదేమీ జహాపనా! మనకా ధనముపై నధికారము లేదా?
    సుల్తాను:- ముమ్మాటికి లేదు. మనము దానిని స్పృశించినచో మహాపరాధుల మగుదుము. అల్లా మనలను క్షమింపడు. పరుల విత్తమును పరమాన్నమువలె భుజించి భగవంతునకు నా మొగ మెట్లు చూపుదును? ప్రజలకు సేవకుఁడనైన నేను నా సేవకై మరొక సేవకుని పెట్టుకొనుట హాస్యాస్పదము గాదా? నడువుము! నేను నీకు సహాయపడెదను.
    సుల్తాను వాక్యములు విని "బేగము" చకితురాలయ్యెను. ఆయన ధర్మబుద్ధికి నిరాడంబరత్వమునకు నామె హృదయము పొంగిపోయెను. ఆమె నేత్రాంచలములనుండి సంతోషబాష్పములు చెక్కిళ్ళపై జాలువారెను.


                            * * * *

 Previous Page Next Page