Previous Page Next Page 
నేను పేజి 72


    "మనిషి పైకి వచ్చానని అనిపించుకోవాలంటే.... ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లని, రాజకీయ నాయకుల్నీ, మంత్రుల్నీ పాదాక్రాంతుల్ని చేసుకోవటమేనా?"


    "అలా చేసుకోవటం వల్లనే ఈ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోగలం. మార్లిన్ మాన్రో కోసం కెనడీ, క్రిస్టిన్ కీలర్ కోసం ప్రాప్యూమో, ఇటీవలే దేశ విదేశాల్లో కూడా సంచలనం రేకెత్తించిన పామెల్లా...."    


    "నన్ను కూడా ఈ జాబితాలో చేరి పొమ్మంటారా?"


    "సతీ! నువ్వింతవరకూ జీవితంలో చాలా పోగొట్టుకున్నావు. పొందాలని ఎందుకనుకోవటం లేదు?"


    "పొందాలని అనుక్షణం అనుకుంటూనే ఎప్పటికప్పుడు పోగొట్టుకుంటున్నాను."


    "ఎందుకూ? నువ్వు సరైన మార్గం ఎన్నుకోకబట్టి."


    "అసలు సరైన మార్గమనేది ఉన్నదా? కొంతమందికి కలిసి వస్తుంది. కొంతమందికి కలిసి రాదు. అంతే...."   


    ఇద్దరం గేటు బయటికొచ్చాం


    కారులో ఆమె ప్రక్కనే కూచున్నాను.


    కొంతదూరం పోయేవరకూ ఇద్దరం నిశ్శబ్దంగా ఉన్నాం. చివరకు ఆమే అంది "సతీ! జీవితం అనుభవించడానికి కష్టాలు పడటానిక్కాదు."


    "అందరూ అనుభవించాలనే అనుకుంటారు. కాని కొంతమందికే కుదురుతుంది."


    "కుదుర్చుకోవటం మన చేతుల్లో ఉంది."


    "ఇందాక చెప్పాను. నాలోని మార్పు నానుంచే రావాలని బహుశా.... నాలో ఇంకా అహంకారం చావలేదనుకుంటాను."


    "ఎందుకూ పనికిమాలిన వాళ్ళకే బోలెడు అహంకారమున్నప్పుడు ఎన్నో అర్హతలున్న నీలాంటి దానికి ఉండటంలో తప్పులేదు."


    నవ్వి ఊరుకున్నాను.


    చూపులు, నవ్వు... ఈ రెండూ నిశ్శబ్దంలోంచి ఎన్నో అర్థాలు సృష్టిస్తాయి. ఎంతో శక్తివంతమైన సంభాషణ కన్న సందర్భానుసారం అవి ప్రదర్శించే భావప్రకటన చాలా లోతుగా ఉంటాయి.    


    శమంతకమణి కారు డ్రైవ్ చేస్తూనే ఒక్కసారి నావంక చూసి వెంటనే తల త్రిప్పుకుంది. తర్వాత ఇంకేమీ మాట్లాడలేదు.


                                      31


    ఆ రాత్రి....


    అద్దం ముందు కూర్చుని నాలోకి చూసుకున్నాను.


    అంతకు ముందే తలంటు పోసుకుని ఉన్నానేమో జుట్టు విరబోసి ఉంది.


    నా రూపం నేను పూర్తిగా, ఆర్తిగా చూసుకుంటున్నాను.


    నాకు తెలుసు. ఈ రోజునుంచే నాకు నేను దూరమవుతున్నానని.


    నాలోని నేను చెరిగి పోతున్నానని.


    నా రూపం మారిపోతూ ఉన్నదని,


    నేనంటూ ఇహ ఉండబోవటం లేదని.


    నా పెదవుల మీద చిన్న చిరునవ్వు కదులుతోంది.


    'నేను'తో ఇలా మాట్లాడుకుంటున్నాను.  


    "చూడూ! నువ్వు నా నుంచి జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఇంతకాలం జాగ్రత్తపడుతూ వచ్చాను.


    ఇహ తప్పటం లేదు.


    అసలు నిన్ను తెలుసుకుందామన్న తాపత్రయంతో వెదుక్కుంటూ, ఆరాటపడుతూ ఇన్నాళ్ళూ గడిపేశాను.   


    ఉహు. నావల్ల అయింది కాదు.


    కొంచెం.... ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. తెలుసుకుంటూన్న సమయంలో నిన్ను పోగొట్టుకోవాల్సి వస్తోంది.


    అలా పోగొట్టుకోకుండా ఉండటానికి సర్వశక్తులూ ధారపోశాను.


    కాని.... ఇహ శక్తి చాలటం లేదు.


    గుడ్ బై


                                                        *    *    *


    తర్వాత ఆర్నెల్లయినా తిరక్కముందే నేను గొప్ప రచయిత్రినై పోయాను.


    నా కలంనుంచి పుంఖాను పుంఖాలుగా రచనలు వెలువడసాగినై.


    అన్నీ శృంగారం కలబోసి ఉన్న సెక్స్ నవలలు. అట్లాంటి ఇట్లాంటి శృంగారం కాదు. అక్కడ కవిత్వ ధోరణి లేదు. సాహిత్య జిజ్ఞాస లేదు. పచ్చి శృంగారం. ఎలాంటి పదాలు ఉపయోగించటానికైనా జంకేదాన్ని కాదు. పదునైన పదాలు. మారణాస్త్రం వంటి పదాలు. ప్యూబిక్ హెయిర్స్ అన్న పదం ఉపయోగించవల్సి వచ్చిందనుకోండి. అచ్చ తెలుగులో రాసేదాన్ని. శృంగార క్రీడను, దాని తాలూకు భంగిమల్ని విచ్చలవిడిగా వర్ణించేదాన్ని. ఎలాంటి భాషా వాడటానికి సంకోచించలేదు.     


    ఏ పత్రికలయితే నా మొదటి నవలని తిరస్కరించాయో, ఆ పత్రికలే నా నవలల్ని సీరియల్ గా ప్రచురించటానికి ఉరకలేస్తూ పరుగెత్తుకొచ్చాయి.    


    పాఠకుల్లో సంచలనం. నా మొదటి బూతు నవలే పెద్ద తుఫానును సృష్టించింది. నా రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగిపోయింది. సీరియల్ అయిపోగానే పబ్లిషర్స్ మేము వేస్తామంటే మేము వేస్తామని పోటీ పడేవారు. నాకు వాళ్ళిచ్చే పారితోషికం చూస్తే నాకే ఆశ్చర్యమనిపించేది. నా నవలలు ఇంగ్లీషులో క్కూడా అనువాదం చెయ్యబడి, దేశ విదేశాల్లో కూడా క్రేజ్ ఏర్పరిచాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఏర్పడటంవల్ల డబ్బు విపరీతంగా రాసాగింది. ఇల్లు కొనుక్కున్నాను. కారు కొనుక్కున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని.    


    నా ఇమేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది.


    ఎవరీ సతి!


    ఒక ఆడది ఇట్లా రాస్తున్నదంటే....?


    క్షణం తీరిక ఉండటం లేదు. వస్తోన్న ఆఫర్లు అంగీకరించటానికి టైము సరిపోవటం లేదు. ఇద్దరు అసిస్టెంట్లని పెట్టుకున్నాను. ఇద్దరూ అమ్మాయిలే.      


    ఆ పిల్లలు కూడా చాకుల్లాంటివాళ్లు. మొదట కొంతదూరం నేను డిక్టేట్ చేస్తోంటే రాసుకుపోయే వాళ్లు. తర్వాత తర్వాత నేను థీమ్ చెబితే పది పదిహేను రోజుల్లో నవల తయారు చేసేవాళ్ళు. ఇంచుమించు నా స్టయిల్నే అనుకరించేవాళ్ళు. కొన్ని కొన్ని సంభాషణలు అచ్చం నేను రాసినట్లే ఉన్నాయి. శృంగార సన్నివేశాలొచ్చినప్పుడు పదునైన పదాలు బాణాల్లా సంధించి వదిలారు. చదివేవాడి మనసు కామ ప్రకంపనలకు లోనయి, సుఖం కోసం వెదుక్కుంటూ పరుగులు పెట్టాల్సిందే.

 Previous Page Next Page