"మనమూ ఉన్నాం ఎందుకూ? మొగుడూ వారానికోసారయినా గెడ్డం చేసుకోకపోయినా. పదిహేను రోజులకోసారయినా పడుకోపోయినా.... ఆ ముండాకొడుకునే నమ్ముకుని...."
హ హ హ హ హ హ
అబ్బ! ఇలాంటి కబుర్లు నా కసహ్యం. మా అమ్మాయే ఇలా చేసిందా? చాచిపెట్టి లెంపకాయ కొడతాను.
"అవునూ.... అలా పదిమందితో పడుకుంటూంటే .... అసహ్యం కాదూ?"
ఒకసారి రేప్ అయ్యాక.... ఎన్నిసార్లయినా.... ఆరిగి పోతుందా కరిగి పోతుందా?
హ హ హ హ హ
వీళ్ళూ ఆడవాళ్ళు. నీతిమంతులు. సంసారులు.
ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలయి ఉంటుంది. వేసవికాలం కావటం వల్ల చాలా ఎండగా వుంది. అప్పటికి అన్నం తిని రెండు రోజులయింది. అప్పుడే ఓ పత్రికా సంపాదకుణ్ణి చూసి, అతని చేత కూడా లేదనిపించుకుని రోడ్డుమీద నడిచి వస్తున్నాను.
బయట ఎండ వేడికి తట్టుకోలేక, లోపలి ఆకలి బాధ వల్లా నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి.
మరోవైపు నుంచీ దాహం, అడుగు తీసి అడుగువెయ్యటం కష్టంగా ఉంది చేతిలో ఫైలు. ఎక్కడ జారిపోతోందో నన్న భయంతో గట్టిగా పట్టుకుని ఎలాగో నడుస్తున్నాను.
ప్రక్కనే ఓ కారాగినట్లనిపించి తలత్రిప్పి చూశాను.
మారుతీ కారు. మదన్.
"పాపం ఎండలో నడుస్తున్నావు. ఆటోక్కాని, రిక్షాక్కాని డబ్బుల్లేవా ఏమిటి?"
జవాబివ్వకుండా ముందుకడుగులు వేస్తున్నాను.
"ఏమయింది నీ కళాఖండం? సాహిత్య సింహాసనం అధిష్టించిందా?" అప్పటికీ జవాబివ్వలేదు.
"పాపం.... అన్నంతిని ఎన్నాళ్ళయిందేమిటి? నీరసంగా కనబడుతున్నావు."
ఇహ కోపం ఆపుకోలేక అతని వంక చూస్తూ అన్నాను. "మదన్ ప్రపంచంలో అన్నిటికన్న అసహ్యమైన దేమిటో తెలుసా? వ్యంగ్యం ఒకానొక రోజు వస్తుంది. అప్పుడు...."
"అప్పుడు.... ఏం జరుగుతుంది? ఓ ప్యాలెస్ లో ఉంటూన్న నీ దగ్గరకు యాచిస్తూ వస్తే నౌకర్లతో బయటికి గెంటిస్తావా? కుక్కలని నా మీదకు ఉసిగొల్పుతావా?"
"ఈ రెండూ చెయ్యను. నీ ఊహక్కూడా అందనిది మూడోది చేస్తాను."
"ఏమిటది?"
"ఇప్పట్నుంచే ఎందుకులే"
"పోనీ సమయమొచ్చినప్పుడు చేసి చూపిద్దువుగానిలే. నడవ లేక ఇబ్బంది పడుతున్నావు. కారులో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా."
"అఖ్కర్లేదు. ఇక్కణ్ణుంచి వెళ్ళిపో మదన్."
"అహం చావలేదు" అంతవరకూ నా అడుగుల్తోపాటు కదుల్తోన్న కారు, వేగంగా ముందుకు సాగిపోయింది.
అతన్తో మాట్లాడుతూన్నంత సేపు ముళ్ళమీద నిల్చున్నట్లు కంపరంగా ఉంది. వెళ్ళిపోయాక ఎంతో రిలీఫ్ అనిపించింది.
ఒక్కక్షణం నిస్తేజంగా నిలబడిపోయి తర్వాత మళ్ళీ నడవసాగాను.
ఓ పదినిమిషాలు గడిచి ఉంటుంది. సందు మలుపు తిరగబోతూండగా ప్రక్కన మరో కారొచ్చి ఆగింది.
శమంతకమణి.
ఆడది ఒంటరితనంలోకి ప్రవేశించగానే అలా ఉండటానికి ఈ మనుషులు అనుమతించరు. ఒక మగాడు వదలిపోగానే 'ఉద్ధరిస్తానన్నట్లు ఇంకో మగాడు, లేకపోతే జీవితానికి నగిషీలు చెక్కుతానంటూ ఇంకో ఆడది.... ఇంచుమించు ప్రతి స్త్రీ జీవిత చరిత్ర ఇంతే.
"ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను" అన్నాను నవ్వి. తను కూడా నవ్వింది.
"ఇద్దరం ఒకర్నొకరు మాటలతో పొడుచుకోవటం తర్వాత ముందు కారెక్కు. ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేద్దాం. నేనూ ఏమి తినలేదు."
"ఆ క్షణంలో నన్ను ఆకలి జయించింది."
మౌనంగా కారెక్కి కూచున్నాను.
పెద్ద ఎ. సి. రెస్టారెంట్ ముందు కారాపింది.
లోపలకెళ్ళి సీట్లలో కూచోగానే సప్లయర్ తెచ్చిన ఐస్ వాటర్ రెండు గ్లాసులు త్రాగేశాను.
చాలా ఆర్డర్ చేసింది. టమాటా సూప్, పూరీ, వెజిటబుల్ బిరియానీ, తర్వాత, మీల్స్, చివర్న ఫ్రూట్ సలాడ్.
చాలా రోజుల తర్వాత సుష్టుగా భోజనం చేశాను.
"మీకు నేను స్పెషల్ మీల్స్ బాకీ" అన్నాను.
"వడ్డీతో సహా తీసుకుంటాను. ఇప్పుడు మాటలతో పొడుచుకుందాం. సతీ! ఇన్ని చేదు అనుభవాలు పొందాక కూడా నువ్వింకా మారలేదా?"
"మారాను. కానీ మీరనుకున్నట్లు కాదు."
"అంటే.... ఇంకా నీతి సూత్రాన్నే నమ్ముకో దలిచావా?"
"నీతి అనేది ఓ పదం. అబద్ధం. మోసం. దానిమీద నాకెప్పుడూ నమ్మకం, గౌరవం లేదు."
"మరి....?"
"నాలోని మార్పు నా నుంచే రావాలి. ఇతరుల నుంచి కాదు."
"ఆ" మార్పు నీ నుంచే రావచ్చు. కాని సహాయం బయటినుంచే రావాలి. సతీ! ఓ అద్భుతమైన జీవితాన్ని నీ ముందు పరుస్తానంటే ఎందుకు వద్దంటున్నావు. ఈ ఆఫీసర్లూ, మంత్రులూ, అపారమైన పరపతి ఉన్న వ్యక్తులూ. ఈ రాజ్యాంగం - అంతా నీ పాదాల మీద ఉండేటట్లు చేస్తాను."
నవ్వొచ్చి నవ్వేశాను.
"ఎందుకు నవ్వుతున్నావు?"