Previous Page Next Page 
నేను పేజి 73


    వారు రాసిన రెండు నవలలూ నా పేరుతో సీరియల్ గా రాసాగాయి. పాఠకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి.  


    సతి.... సతి.... సతి.... నా పేరు మార్మోగిపోతోంది. నన్ను చూడటం కోసం జనమెక్కడ్నుంచో తరలి వచ్చేవారు. నా ప్రయత్నం లేకుండానే పరిచయాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు: సినీ పరిశ్రమకు చెందినవారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మినిస్టర్లు.... మా ఇల్లు నిరంతరం మనుషుల్తో నిండిపోయి కళకళలాడుతూ ఉండేది.  


    పత్రికల్లో నా గురించి వింత వింత గాసిప్స్ వచ్చేవి. ఫలానా ఫలానా వాళ్ళతో నాకు సంబంధమున్నట్టు.


    సెక్స్ బాంబు


    కామ పిశాచి


    రచనల్లోనే ఇంత పిచ్చెక్కిస్తోంటే అసలు వ్యవహారంలో ఎలా చెలరేగిపోతుందో....  


    నవ్వుకుని ఊరుకునేదాన్ని. ఎందుకంటే ఈ గాసిప్స్ నేనింకా ఇంకా ఎదిగి పోవటానికి తోడ్పడేవి.       


    నా ఇంటర్వ్యూ కావాలంటే ముందుగా ఎపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందే.


    టీ.వి.లో నాతో చేసిన ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి.


    అమెరికాలోని ఓ ప్రముఖ సినిమా సంస్థ నా నవల నొకటి సినిమా తీయటానికి హక్కులు తీసుకుంది. వాళ్ళిచ్చిన పారితోషికం ఎంతో చెబితే గుండెలు పగిలిపోతాయి.    


    ఈ వార్త తెలిసేసరికి ప్రజల్లో నా ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది.


    నా పేరు చెబితేనే వెర్రెత్తి పోతున్నారు.


    నాకు రకరకాల ఫోన్ కాల్స్, ఉత్తరాలూ వచ్చేవి. ఒకరాత్రి నాతో గడపటానికి లక్షలు లక్షలు గుమ్మరించటానికి సిద్ధపడుతున్నారు.     


    'పిచ్చి వెధవలు' అనుకున్నాను. ఒక ఆడదాన్ని పొందటానికి పైసా ఖర్చు లేకుండా రేప్ లన్నా చేస్తారు. లక్షలన్నా గుమ్మరిస్తారు. లోపల వేడి బయటకు వెళ్ళగ్రక్కటం తప్ప వాళ్ళు పొందే ఆనందమేమిటో అర్థం కాదు.  


    సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నామని భుజాలెగరేసే వాళ్ళంతా సెక్సు అంటే అర్థం తెలీని చవట వెధవలు.     


    ఇదంతా బయటి జీవితం.


    లోపలి జీవితం మాటేమిటి?


    బయట పేరు ప్రఖ్యాతులెంత ఇనుమడిస్తున్నాయో.... లోలోపల దావాగ్ని అంత చెలరేగి పోతోంది. దాన్ని చల్లార్చే మార్గం లేదు. రాత్రిళ్ళు నిద్రపట్టక, ఆరాటం భరించలేక స్లీపింగ్ టాబ్లెట్లకు అలవాటు పడ్డాను. ఆ అలవాటంతటితో ఆగలేదు. క్రమంగా డ్రగ్స్ కలవాటు పడ్డాను.


    పేరు, ప్రఖ్యాతి, పరపతి, డబ్బు.... అన్నీ ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి.


    అయినా మనసులో ఊరడి కలగటం లేదు.


    భ్రమే జీవితాన్ని పరిపాలిస్తూన్నప్పుడు, ఊరట ఎలా కలుగుతుంది?


    చిత్రమేమంటే భ్రమేనని తెలిసినా, అందులోకి జొరబడతాడు మానవుడు. భ్రమలో అంత నిషా ఉన్నదన్నమాట.   


    ఆ రాత్రి....


    డ్రగ్స్ తీసుకున్నా నిద్రపట్టటం లేదు. ఒళ్ళంతా వేడిగా, తపనగా అనిపిస్తోంది.


    శారీరకమైన అనుభవం పొంది చాలా రోజులయింది. ఈ వయసులో మనిషికి అదెంత అవసరమో తెలిసి వస్తోంది. ఈ కోరికలు గురించి కొంతమంది ఆడవాళ్ళు "ఛా మాకలాంటి కోరికలంటే అసహ్యం" అని డంబాలు పలుకుతారు. అంతకుమించిన ఆత్మవంచన లేదు.    


    లేచి లైటు వేసి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ దగ్గరకొచ్చి నిలబడ్డాను.


    మిగతా శరీరం మీద వ్యామోహం కలగటం లేదు.


    ముఖంలోకి చూసుకుంటున్నాను.


    ఈ ముఖాన్నే ఎన్నోసార్లు మామూలుగా చూసుకున్నాను. అభినందన పూర్వకంగా చూసుకున్నాను


    ఇప్పుడు నాకు తెలీకుండా లోతుల్లోకి వెళ్ళిపోతున్నాను.


    ఎక్స్ రేలోంచి చూస్తున్నట్లు.


    అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఉన్నట్లుండి ఉలిక్కిపడ్డాను.


    అద్దంలోని నా ముఖం మెల్లగా మారిపోతూన్నది.


    ముఖం మీది చర్మం తొలగి పోతూన్నది.


    చివరకు.... స్కల్ కనిపించింది.


    ఒక్క కేకవేసి, పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడ్డాను.


    భయంతో నా శరీరం ఒణికి పోతూన్నది.


    అద్దంలో చూసుకున్న నా ప్రతిబింబమే నిర్దాక్షిణ్యంగా వెంటాడుతూ, నిద్రపట్టకుండా చేస్తూన్నది.    


    లోపల ఉన్న నా అసలు రూపమదేనని తెలుసు. కాని బయటికెందుకు ఆవిర్భవిస్తోంది?     


    ఆ భయంకరమైన రూపం కళ్ళముందు కదుల్తోంటే తట్టుకోలేకుండా ఉన్నాను. గుండెల నిండా బరువు. ఊపిరాడటం లేదు.


    లేచి షోకేసులో ఓ ప్రక్కన ఎవరికీ కనిపించకుండా పెట్టి ఉంచిన యాంప్యూల్స్, డిస్పోజబుల్ సిరంజి తీసుకుని నాకు నేను యింజక్షన్ చేసేసుకున్నాను.


    క్రమంగా మత్తు ఆవహిస్తూన్నది.

 Previous Page Next Page