"నన్ను పడేస్తావా? దుర్మార్గురాలా. చూడు నిన్నేం చేస్తానో" అంటూ లేచి నిలబడి మళ్ళీ మీద కొస్తున్నాడు.
అటూ ఇటూ చూసేసరికి క్రిందపడి ఉన్న ఓ ఇనుప వస్తువు కనిపించింది. మెరుపులా వంగి అందుకుని అతని మీదకు విసిరేశాను.
తలకి కొట్టుకుని "అబ్బా" అని మూలిగాడు. నెత్తురు బొట్టు బొట్టు కారటం కనిపించింది.
ఒక్క నిమిషం ఇద్దరం ఒకరి వంక ఒకరు చూసుకుంటూ అలా నిలబడిపోయాం.
అతన్లో ఇంకా కలయబడాలన్న ఊహ ఉన్నట్లు కనబడటం లేదు. గోడవైపు జరిగి క్రింద పడిపోకుండా నిలద్రొక్కుకుంటున్నారు.
"ఇంత జరిగాక.... నీలో ఇంత పైశాచికత్వం చూశాక కలిసి ఉండాలని అనిపించటం లేదు" అంటూ గదిలోంచి బయటికెళ్ళి పోయాను.
30
"ఇంత చిన్న విషయానికి భార్యాభర్తలు విడిపోవటం సమంజసం కాదనుకుంటాను" అన్నాడు మదన్.
"ఇంతకన్న చిన్న విషయాలక్కూడ విడిపోయిన భార్యాభర్తలున్నారు. నా దృష్టిలో ఇది చిన్నదేం కాదు. నువ్వంటే అసహ్యమేస్తోంది. నిన్ను నేను భరించలేకుండా ఉన్నాను."
"రాజీ పడు. ప్రపంచమంతా ఈ రాజీ సూత్రం మీదే నడుస్తోంది."
"రాజీ పడను."
"ఎంతమందిని ఒదిలేసి మళ్ళీ పెళ్ళిళ్లు చేసుకుంటూ ఉంటావు? నువ్వేమన్నా ఎలిజెబెత్ టేలర్ వనుకుంటున్నావా?"
"నన్ను ఇంకొకరితో పోల్చుకోవటం లేదు. నేను నేనే."
"నేను...." అని హ హ్హ హ్హ అంటూ నవ్వసాగాడు.
"ఎందుకలా నవ్వుతావు?"
"అర్థమయిందిగా. నీకు నువ్వంటే ప్రేమ. నిన్ను తప్ప వేరెవర్నీ భరించలేవు. నీకు నువ్వు కావాలి. ఇంకెవర్నీ భరించలేవు."
"అలాగే అనుకో. అర్థమయిందిగా. అందుకనే నా దార్న నన్ను ఉండనియ్."
"ఏం చేస్తావు ఉండి! నీ నవల అచ్చవుతుందనీ, అమాంతం గొప్పదానివయి పోదామనీ చూస్తున్నావేమో. ఈనాడు సాహిత్య సామ్రాజ్యం మాది. పత్రికలూ, పబ్లిషర్లూ అందరూ మా గుప్పెట్లో ఉన్నారు. మేం ఒకళ్ళ నొకళ్ళు పెంచుకుంటున్నాం. పోషించుకుంటున్నాం. ఈ ఇనప తెరల్ని ఛేదించుకుని నీలాంటి వాళ్ళు పైకి రాలేరు."
"ఛాలెంజిలు చెయ్యటం నా కలవాటు లేదు. నాకు తోచిన బాటలో ముందుకు నడవటమే నా లక్ష్యం."
ఇద్దరం విడిపోయాం.
* * *
ఇంకో ఇల్లు.
మరో మూడునెల్లకు నవల పూర్తయింది.
చాలా శ్రమించాను. ఇంచుమించు రక్తాక్షరాలతో రాసినట్లు రాశాను.
అంతవరకూ నవల టైటిల్ పెద్దలేదు. తిరిగి మొత్తమంతా చదువుకున్నాక 'రక్తనేత్రం' అని పెట్టాలనిపించింది.
మూడు రోజులు ఆ స్క్రిప్టును చూసుకుంటూ మురిసిపోయాను. గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగలించుకుని నిద్రపోయాను.
ఇహ ఆ తర్వాత అన్వేషణ మొదలుపెట్టాను.
నా మొదటి నవల ప్రచురించిన పత్రికాఫీసు కెళ్ళాను.
గుర్తుపట్టాడు గాని అంత ఆదరంగా పలకరించలేదు. వచ్చిన పని విన్నాక స్క్రిప్ట్ తీసుకుని తిరగేస్తున్నాడు.
"టైటిలేమిటి! రక్తనేత్రమా?"
డిటెక్టివ్ నవలా ఏమిటి?
సామాజిక స్పృహ ఉన్న నవలా?
"ప్చ్. ఇప్పటి రోజుల్లో ఇలాంటివి ఎవరికి కావాలమ్మా"
సెక్స్ సెక్స్ పేరుతో ఎంత బూతులు రాసినా ఫరవాలేదు.
దెయ్యాలు, భూతాలు, ఎంత అభూత కల్పనలైనా ఫరవాలేదు.
లేకపోతే ఓ పరమకిరాతకుణ్ణో, స్మగ్లర్ నో తీసుకొని అతణ్ణి హీరోని చేస్తూ ప్రజలారాధించేలా రాయాలి.
వీరప్పన్
హర్షద్ మెహతా
దావూద్ ఖాన్.
పూనమ్ దేవి
వీళ్ళందర్నీ హీరోలుగా, ఆత్యద్భుత వ్యక్తుల్లా చిత్రించాలి.
ఇలా హితబోధ చేసి స్క్రిప్ట్ తిరిగిచ్చేశాడు.
నిరాశ పడలేదు. మరో పత్రిక, మరో పబ్లిషర్.
అందరూ ఇదే జవాబు.
ప్రతిచోటా మదన్ మోహన్ ఎగతాళిగా నవ్వుతూన్నట్లు కనిపించేవాడు.
"ఛాలెంజ్ ఛాలెంజ్. ఛాలెంజ్" అతని మాటలు సవాలు చేస్తున్నట్లు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
ఎక్కడికెళ్ళినా.... ఎవర్నడిగినా అదే సమాధానం.
దగ్గరున్న డబ్బులయిపోతున్నాయి. మళ్ళీ పేదరికం. ఒక్కోసారి ఏ పూట దినుసులు, ఆ పూట ఒండుకు తినాల్సి వస్తోంది.
ఇంట్లో తినటానికేమీ లేకపోయినా బయటికెళ్ళినప్పుడు నీట్ గా, ఉన్న చీరెల్లోనే మంచిది కట్టుకుని కళకళలాడుతూ ఉండటం మొదట్నుంచీ నా అలవాటు.
ఆర్థికం ఫేస్ పెట్టుకుని దిగాలుపడి, దీనంగా కనిపించటం చేతయేది కాదు. అసలలా ఉండటం నా కసహ్యం.
తిరిగి 'మహా పతివ్రతల' ఘోష మొదలయింది.
'ఉద్యోగం లేదు. మొగుడు లేడు. ఇంత ట్రిమ్ గా, సంతోషంగా ఉండటానికి డబ్బు లెక్కణ్ణుంచి వస్తున్నాయి."
"మొగుడు లేడు కాబట్టే.... హ హ హ హ హ ...."
"ఎవడు డబ్బెట్టి కొనుక్కొంటే వాడే మొగుడు."