Previous Page Next Page 
నేను పేజి 7


    సతి శ్రీ!


    ఒకోసారి నా పేరు నాకే విచిత్రంగా ఉండి ఆనందం కలిగించేది.


    ఓసారి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనం కావాలని 'ఎరేంజ్' చేసుకున్నట్లుగా ఉంది.


    నాకే ఆశ్చర్యం కలిగించలేదు.


    రోజూ కన్నా ఫ్రీగా, చనువుగా ప్రవర్తిస్తున్నాడు. చిలిపిగా, కొంచెం శృతిమించే మాట్లాడుతూ మధ్య మధ్య నా శరీరాన్ని అక్కడక్కడ తాకుతున్నాడు.


    "నేనంటే నీ ఉద్దేశమేమిటి?" అన్నాడు.


    ఆలోచిస్తున్నాను.


    "చెప్పవేం?"


    "తెలీదు"


    "అంటే?"


    "బహుశా ఇంతవరకూ ఏ ఉద్దేశమూ లేదనుకుంటాను."


    "మరి ఎందుకు నన్ను కలుసుకుంటున్నావు?"


    "కావాలని ఇలా చెయ్యటం లేదు. నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోతున్నదనుకుంటున్నాను?"       


    "ఆ వయసులో ఆ మాటెలా మాట్లాడగలిగానో తెలీదు. జరుగుతున్న సంఘటనలన్నింటికి మనం పూర్తిగా బాధ్యులం కాదు. అమాయకత్వమా అంటే అంత అమాయకులెవరూ ఉండరు. మనకు ఇష్టా ఇష్టాలనతిక్రమించి  ఎందుకు వశం తప్పి ప్రవర్తిస్తుందో ఏ సైకాలజిస్టూ సరిగ్గా వివరించలేడు. అందుకే 'తప్పు'కు సరైన నిర్వచనం లేదని మొదట్లో చెప్పాను.


    "పోనీ ఆలోచించి చెప్పు."


    "ముఖేష్ పాటలంటే నాకిష్టం. మహా గాయకుడు కాకపోయినా, జిమిక్స్ చెయ్యలేకపోయినా, ఆ గొంతులో ఓ ప్రేమికుడు గుండెలోని విషాదం ధ్వనిస్తుంది. ఆ పేరు నీకుండబట్టేనేమో.... వినగానే మొదట చలించాను.


    అతని ముఖంలో ఆశాభంగం కలిగిన తీరు కనిపించింది.


    "నాకు పాడటం రాదు."


    "ఆ విషయం తెలుసు. రావాలని నేను కోరుకోలేదు కూడా. ప్రాథమికంగా మంచి భావన కలుగటానికి ఉపయోగపడ్డ చిన్న స్పందన అంతే."     


    "తర్వాత?"


    "పరిచయం కొంత ఆకర్షణను పెంచుతూ ఉంటుంది" అంటూ నవ్వేశాను.


    అతను నిలద్రొక్కుకుంటున్నట్టు కనిపించాడు. ఎవరి గురించి వాళ్ళకు గొప్ప అభిప్రాయాలుంటాయి. ఎదుటి వాళ్ళ నోటి నుంచి వెలువడ్డ నిజం ఆ అభిప్రాయాన్ని చిన్నాభిన్నం చేస్తోంటే భరించటం కష్టంగానే ఉంటుంది.


    "ముఖేష్ పాటలంటే నీకంత ఇష్టమా?"


    తలూపాను.


    "సైగల్ కన్నానా?"


    "సైగల్ నాకర్థం కాడు. ఏదో డిస్టెన్స్ ఫీలవుతాను. కొంచెం గందరగోళంలో పడి ఏదో అసౌకర్యానికి లోనవుతుంటాను."


    "నాకు సైగల్ పాటలంటే ఇష్టం" అన్నాడు గర్వంగా.


    "మంచిదే" అన్నాను నిర్లిప్తంగా.


    కొన్ని నిమిషాలు మౌనంగా, ఏం చెయ్యాలో తెలీనట్లు గడిచాయి. కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు.... ఈ పదాలు వాడాలంటే చిరాగ్గానే ఉంటుంది. విని విని విసుగెత్తిపోయుంటారు. కాని తప్పట్లేదు.      


    "అసలు నిన్నో ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను" అన్నాడు ఓ నిర్ణయాని కొచ్చేసినట్లు.


    "అడుగు"


    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని"


    నవ్వితే అతనికి కష్టం కలుగుతుందని తెలుసు. అయినా ఆపుకోలేక నవ్వేశాను.... కొంత మృదువుగానే.


    అతని అందమైన ముఖంలో కోపం తెలుస్తోంది.


    "ఏమిటి? ఎందుకు నవ్వుతున్నావు?"


    "ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే దాన్ని గురించి ఎంతోకొంత తెలియాలి. అసలు నాకు ప్రేమంటేనే ఏమిటో తెలీదు. జవాబేం చెప్పమంటావు?"


    "అస్సలు.... ఏమీ తెలీదా?"


    "తెలీదు"


    "పోనీ నన్ను చూస్తే నీకెలా ఉంటుంది?"


    "అంటే?"


    "నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి?"


    "బాగానే ఉంటాయి. నువ్వంటే ఇష్టమనే అనుకుంటున్నాను."


    అతని ముఖంలో రిలీఫ్ కనిపించింది. అంతవరకూ అనుభవిస్తూన్న టెన్షన్ కొంచెం కొంచెం తగ్గుతున్నట్లనిపించింది.


    దగ్గరకొచ్చి నా రెండు భుజాల మీదా చేతులేశాడు. "నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను."


    "ఎందుకని?"


    "ఎందుకనంటే.... ఎందుకనంటే...." కొంచెం తడుముకుంటున్నాడు.


    "నువ్వందంగా ఉంటావు. అందాన్ని చూసి ప్రేమించేది ప్రేమెలా అవుతుంది. కవ్వింపు ఉంది. నిషా ఉన్నది. ఎన్నో లక్షలమందిలో గాని నీలాంటి అమ్మాయి దొరకదు."


    అతనలా పోగుడుతూన్నందుకు ఆనందంగా ఉంది. శరీరం పులకిస్తోంది. బహుశా నా చెక్కిళ్ళు ఎర్రబారి ఉంటాయి.


    "ఇంకా చెప్పు" అన్నాను. ఏదో మగత ఆవహిస్తూన్నట్లు.

 Previous Page Next Page