"అమ్మ మళ్ళీ మౌనంగా ఉంది. ఆమె కళ్ళనుంచి నీటి బిందువులు జల జల ప్రవహిస్తున్నాయని నాకర్థమవుతోంది."
"ప్రవర్తన కన్నా పరిస్థితి వెయ్యి రెట్లు బలమైనదమ్మా. ఆపాటి అవగాహన నాకుంది."
"అట్లా అనడం, అనుకోవడం ఎస్కేసిజం చేస్తోన్న అవినీతి పనులకు చిత్రమైన రంగు పులుముకోవడం అవుతుందేమో?"
ఈ ప్రశ్న అమ్మ వెయ్యలేదు. నాకు నేను వేసుకున్నాను.
బిహేవియరిజమ్ అన్నది ఎన్నడూ పూర్తిగా వీడని చిక్కుముడే. పరిస్థితుల పేరుతో ఆత్మవంచన చేసుకునే వారుండరా? అసలు ప్రపంచంలో ఎక్కువ ఆత్మవంచనలే ఉంటాయేమో.
కాని.... విస్ఫోటనంలా తళుక్కుమనే నిజాలు కొన్ని ఉంటాయి. వాటిని నిజాయితీతో దర్శించటానికి చాలా శక్తి కావాలి.
ఈ మౌనం ఎన్నో జీవిత రహస్యాలు వెల్లడిస్తుంది.
"బేబీ!" అమ్మ గొంతులో ఆర్ద్రతతో కూడిన గాద్గదికత.
"ఏమిటమ్మా?"
"ఈవేళ ఇక్కడే నీ దగ్గరే పడుకుంటాను."
ప్రక్కకు జరిగాను అమ్మకి చోటిస్తూ. ఆమె మేను వాల్చాక, ఆమెకేసి తిరిగి ఆమె గుండెల చుట్టూ చెయ్యేసి పడుకున్నాను.
ఒక మగాడు దిక్కులేకుండా మిగిలిపోటానికి, ఆడది మిగిలిపోటానికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏమిటో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏ మానవతావాదుల ఊహలకూ అందదు.
వయసులో ఉన్నప్పుడు స్త్రీ వయసు మళ్ళాక పురుషుడు ఒంటరిగా మిగిలిపోకూడదు. వయసులో ఉన్న మగాడు ఒంటరితనాన్ని తట్టుకుంటాడు ఏవేవో వనరుల ద్వారా. వయసు మళ్ళిన స్త్రీ వంటరిగా నిలబడగలుగుతుంది ఆరోగ్యం సహకరిస్తే.
మెల్లగా నిద్ర ఆవహిస్తోంది.
ఇంకో చిత్రమైన ఆలోచన వచ్చింది.
ఈ సన్నివేశమో, సందర్భమో, కూతుర్ని కాబట్టి, తల్లి అంటే ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకుండా, చెదరకుండా ఉండగలిగాను. అదే కొడుకయితే...."
"బహుశా నాలాంటి కూతుళ్ళున్న కుటుంబాలెన్నో గుట్టుగా, గంభీరంగా సాగిపోతూ ఉండాలి."
తృప్తితో కూడిన అదృష్టమైన చిన్న నవ్వు.
నిద్ర పట్టేసింది.
4
ఎంతో సుదీర్ఘకాలం సాగిపోయే మనిషి జీవితయాత్రలో స్తబ్దుగా కొన్నాళ్ళు, యాంత్రికంగా కొన్నాళ్ళు, చైతన్యవంతంగా కొన్నాళ్ళు, నిస్తేజంగా కొన్నాళ్ళు, అయోమయంగా కొన్నాళ్ళు, సంఘర్షణలతో కొన్నాళ్ళు.... ఇలా కలగా పులగంగా గడిచిపోతుంటాయి. ఎవరి వ్యక్తిత్వాలను బట్టి మనస్తత్వాలను బట్టి.... అవి ముందుకు సాగిపోతుంటాయి.
ఆకలి బాధ తప్పిపోయింది. నవనీతరావు అందిస్తోన్న అండదండలతో చదువు ఒడుదుడుకులు లేకుండా కొనసాగుతోంది.
కాని క్రమంగా నా గురించి నేను ఆలోచించుకోవటం ఎక్కువయింది. మొదట్నుంచీ నాలో అన్వేషణ ఉంది. ప్రదేశాలను అన్వేషించటంలో నాకా శక్తి లేదు. మనుషుల్ని అన్వేషించటంలో నా మనసు నిమగ్నత ప్రదర్శించేది.
నేను చిత్రమైన మనస్తత్వం గల దాన్నా? తెలీదు. నాలో ఏవైనా పర్ వర్షన్సున్నాయా? తెలీదు. నేను సహజంగానే ఉంటున్నానని అనుకునే దాన్ని.... ఈ మనుషుల్నీ, నా స్నేహితుల్నీ, ప్రకృతినీ, ప్రపంచాన్నీ ప్రేమించటానికి ప్రయత్నించేదాన్ని. ప్రేమ అనే పదాన్ని చాలా గౌరవించేదాన్ని. నాకెన్నో ఇష్టాలున్నాయి. సంగీతమంటే పడి చచ్చిపోయేదాన్ని. నాకెంతో మంది అభిమాన గాయనీ గాయకులుండేవారు. సాహిత్యమన్నా.... అంటే కావ్యాలూ, ప్రబంధాలూ అని కాదు నా ఉద్దేశం. అవి చదివి అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. ఇప్పుడొస్తున్న కవిత్వం, నవలలూ, కథలూ విపరీతంగా చదివేదాన్ని. వాటి గురించి విపరీతంగా ఆలోచించేదాన్ని. స్నేహితుల గురించి చెప్పబోతూ ఎటో వచ్చేశాను. ఎందుకో వాళ్ళలో నాకు ఎక్కువగా నచ్చని గుణాలే కనిపించేవి. ఎవర్ని చూసిన నాకు ఆర్టిఫీషియల్ గా కనిపించేవారు. ఇక్కడ నేను ఆర్టిఫీషియల్ అనే ఇంగ్లీషు పదాన్నెందుకు వాడాను? కృత్రిమంగా అనొచ్చుగా. ఎందుకో ఈ రెంటి మధ్యా కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. అందుకే కాబోలు కొంతమంది రచయితలు కొన్ని కొన్ని సందర్భాలలో తెలుగు పదాలు తెలిసి కూడా ఇంగ్లీషు పదాలు వాడుతుంటారు. అట్లా అక్కడ వాడితేనే వాళ్ళ మనసుల్లో ఉన్న భావం పూర్తిగా వ్యక్తీకరిస్తున్నామన్న అభిప్రాయం వాళ్ళకుండవచ్చు.
స్నేహితులు ఎంత దగ్గరగా వద్దామన్నా రాలేకపోయేదాన్ని. నాది ఒంటరితనాన్ని కోరుకునే మనస్తత్వమా? ఎవరి గురించీ ఎవరికీ తెలీనట్లే నా గురించీ నాకు అవగాహన లేదు.
నా స్నేహితురాళ్ళలో ప్రియాంక ఒకసారి పుట్టిన రోజున పార్టీ ఇచ్చింది.
అప్పుడు పరిచయమయింది ముఖేష్ తో. అతను ప్రియాంకకు అన్నయ్య అవుతాడు. పద్దెనిమిదేళ్ళుంటాయి. నూనూగు మీసాలు, చక్కటి క్రాఫింగ్, అందంగానే ఉన్నాడు. మిగతా వాళ్ళని వదిలేసి నాకూడా కూడా తిరుగుతున్నాడు. అట్లా చెయ్యటం నాకు సంతోషాన్నే కలిగించింది.
ప్రియాంక కోసం వాళ్ళింటికి తరుచూ వెడుతూ ఉండేదాన్ని.
వెళ్ళినప్పుడల్లా ముఖేష్ కలుస్తూనే ఉండేవాడు.
అతడు నన్ను 'సతీ!' అని పిలిచేవాడు.
అన్నట్లు నా పేరు చెప్పలేదు కదూ. సతి శ్రీ ఈ పేరు మా అమ్మ వాళ్ళకు ఎందుకు పెట్టాలనిపించిందో తెలీదు.
నా పేరులోనే కొంత ఆకర్షణ ఉందనీ, ఆ పేరు వల్లే చాలా వరకూ నాకు పాప్యులారిటీ వచ్చిందని తెలుసు.