"మీరలా అంటే... ఎలాగండి... ఒక్క నెలరోజులు... టైమివ్వండి... ఆ లాంఛనాలన్నీ ఇస్తాను... యాభైవేలు కాదు... లక్షరూపాయలిస్తాను..."
"యాభైవేలకు దిక్కులేదుగానీ... లక్షరూపాయలు ఎలా తెస్తారండి... ఆ తర్వాత మీరూ, మేమూ దెబ్బలాడుకోవడం, మీ అమ్మాయి మీ ఇంటికి రావడం.... పెద్దమనుషులు మా ఇంటికి రావడం... ఎందుకండీ ఆ గొడవలన్నీ... రేపుదయం వరకూ గడువు... లేకపోతే... రేపుదయం పెళ్ళికొడుకుని చెయ్యడమూ లేదు... రేపురాత్రి పెళ్ళీలేదు..." ముందు కడుగేసాడు వియ్యంకుడు.
కళ్యాణి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఆ ప్రక్కన నిల్చున్న రఘురామశెట్టి భార్య కృంగిపోయింది. రఘురామశెట్టి ముఖం పాలిపోయింది.
"అయ్యా! సీతారామ్ గారూ... ఒక్కసారి... ఒక్కసారి నా కళ్ళలోకి చూడండి" అని ప్రాధేయపడుతున్న శెట్టి మాటల్ని విన్పించుకోకుండా, ముందు కడుగేసిన వియ్యంకుడు, ఎదురుగా మహతిని చూసి, "ఒక్క నిమిషం ఆగండి" అన్న ఆమె మాటను విని ఆగిపోయాడు.
మహతి గబగబా నడుచుకుంటూ రఘురామశెట్టి దగ్గరకెళ్ళి-
"మీరేం బాధపడకండి, డబ్బు నేను తెచ్చాను" అంటూ హేండ్ బాగ్ లోంచి అయిదు కట్టల్ని తీసి ఆయనకు అందించింది.
మహతివైపు, ఆమె ఇచ్చిన నోట్లకట్టలవైపు విస్మయంగా, ఆశ్చర్యంగా చూసాడు రఘురామశెట్టి.
ఆపైన నీళ్ళు నిండిన కళ్ళతో మహతివైపు చూసాడాయన.
వెనుకడుగేసిన వియ్యంకుడు, మారిన ముఖంతో చూస్తూ నిలబడ్డాడు.
మరో మాట మాట్లాడకుండా రఘురామశెట్టి ఆ డబ్బుని వియ్యంకుని చేతిలో పెట్టాడు.
"చెప్పేరు కారేం... ఏర్పాటు చేసానని... ఒక గంటలోనో , ఘడియలోనో డబ్బు చేతి కందుతుందని చెప్తే... మీ ముల్లేం పోతుంది బావగారూ..." ముఖమ్మీద నవ్వుని పులుముకుంటూ అన్నాడు వియ్యంకుడు.
రఘురామశెట్టి ఆనందోద్వేగం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకే ఆయన మాట్లాడలేదు.
"ఓ.కె. బావగారూ... అనుకున్నవన్నీ అనుకున్నట్లు అన్నీ జరిగిపోతాయి... రేపుదయం..."
ఏదో చెప్పబోతున్న వియ్యంకుడు, తనవేపే వస్తున్న కాబోయే కోడలు కళ్యాణిని చూస్తూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు.
గదిలోంచి విసురుగా వచ్చిన కళ్యాణి, కాబోయే మామగారి చేతుల్లోంచి ఆ డబ్బుని తీసుకుని తండ్రి చేతిలో పెట్టి-
"నాకు మీ అబ్బాయంటే ఇష్టంలేదు- రేపు ఆ పెళ్ళి జరగదు. వెళ్ళండి... ఇంకో విషయం... రేపు ఆరుగంటల లోపల మీరు తీసుకున్న కట్నం మొత్తం తిరిగిచ్చెయ్యండి... లేకపోతే పోలీస్ కంప్లయింట్ ఇవ్వాల్సి వస్తుంది... గుర్తుంచుకోండి."
అమాయకంగా కనబడే కళ్యాణి నోటివెంట, అలాంటి మాట వస్తుందని అక్కడెవరూ వూహించలేదు.
"అమ్మా... కళ్యాణి..." ఏదో అనబోయాడు తండ్రి.
"నన్ను క్షమించండి నాన్నా... ఈ సమయంలో నేనింతకంటే ఎక్కువ చెప్పలేను... ఇవాళ మీ పరువు వాళ్ళకు ముఖ్యం కానప్పుడు, రేపు నా ప్రాణం కూడా వాళ్ళకు ముఖ్యం కాదు... రేపు నేను శవంగా మారకుండా వుండాలంటే, ఇవాళ నేను చెప్పినట్టుగా చెయ్యండి.... అంతే -" అని-
పెళ్ళికొడుకు తండ్రివేపు తిరిగి-
"చూడండి... పెళ్ళికొడుకు తండ్రిగారూ... కట్నం సొమ్ము తిరిగివ్వడానికి రేపుదయం ఆరుగంటల వరకూ టైమిస్తున్నాను... గుర్తుంచుకోండి... ఇక మీరు వెళ్ళొచ్చు" ఆ మాట అనేసి గబగబా లోనికెళ్ళిపోయింది కళ్యాణి.
"అంతేనా... బావగారూ..." వియ్యంకుడి మాటకు ఏమీ జవాబివ్వలేదు రఘురామశెట్టి - వియ్యంకుడు తలదించుకుని బయటికెళ్ళిపోయాడు.
తన కూతురు అలాంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకొనగలిగే స్థాయికి ఎదిగినందుకు ఎంతో ఆనందంగా వుంది ఆయనకు.
అయిదు నిమిషాలసేపు మనిషి కాలేకపోయాడు రఘురామశెట్టి.
తర్వాత-
"కూర్చోమ్మా!" అని మాత్రం అనగలిగాడు.
ఒక వర్షం వెలిసిపోయినట్టుగా వుంది మహతికి. ఆ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆమెక్కూడా నచ్చింది.
"బేబీ... తీసుకున్న నిర్ణయం మంచి దేనంటావా అమ్మా..." నెమ్మదిగా అడిగాడు సంశయంగా.
"ఇటీజ్ ఏ గుడ్ డెసిషన్ సర్."
"ఎక్కడ తెచ్చావో, ఎలా తెచ్చావో సమయానికి నువ్వు దేవతలా వచ్చావ్... నువ్వు డబ్బు ఇచ్చినందుకైనా పెళ్ళి జరిగిపోతే..."
"పెళ్ళి గురించి వదిలెయ్యండి బాబాయ్ గారూ... ఈ సంబంధం తప్పిపోవడం మన మంచి కేనేమో..."
"ఆ డబ్బెక్కడిదమ్మా..."
"మీదే... సర్..."
ఆ మాటకు అప్రతిభుడయ్యాడు రఘురామశెట్టి.
"మీ డబ్బే సర్... మీ దగ్గర్నించి పట్టుకెళ్ళిన మీ జన్నీ క్లాత్ ద్వారా వచ్చిందే సర్-"
"జన్నీ క్లాత్ ని కొన్నారా..." ఆయన కళ్ళల్లో మరింత ఆశ్చర్యం తొంగి చూసింది. దాంతోపాటు ఆనందంతో కళ్ళు మెరిసాయి.
"అవున్సార్-"
"ఎలా సేల్ చేసావ్...!" ఆత్రంగా అడిగాడాయన.
"అదే బిజినెస్ రహస్యం. మీ దగ్గర స్టోర్ రూమ్ లో పడున్న ఆరుకోట్ల రూపాయల క్లాత్ ని అమ్మేక, ఆ విషయం చెప్తాను సర్ ... అంతవరకూ నన్నేం అడక్కండి..."
"ఆరుకోట్ల రూపాయల సరుకునీ అమ్మేస్తావా?!"
"ఎస్... సర్... ఈ క్లాత్ సేల్సే కాదు... మళ్ళీ మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు... ఈ ప్రొడక్టుని ప్రొడ్యూస్ చేస్తారు... ఈ ముక్కి పోయిన ఆరుకోట్ల రూపాయల క్లాత్ మనకు కోట్ల రూపాయల ప్రాఫిట్ కు ఆధారమౌతుంది. ఒక ఆరునెలల టైమ్ లో జన్నీ క్లాత్ నేమ్ ఇండియాలో మారుమోగిపోతుంది. మనం ఈ క్లాత్ ని ఎక్స్ పోర్ట్ చేస్తాం సర్. మూతబడ్డ జన్నీ ఫ్రాబిక్స్ ఫాక్టరీ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తుంది" ఆవేశంగా చెప్పింది మహతి.
"ఇంత కాన్ఫిడెన్స్ నీకెలా వచ్చిందమ్మా..." ఎక్సైట్ మెంట్ కి గురవుతూ అడిగాడాయన.
ఒక్క నిమిషం తటపటాయించి లేచి, ఆయన కాళ్ళను కళ్ళ కద్దుకుని-
"మీరిచ్చిందే సర్..."
చితికిపోయి, ఓడిపోయి ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొంటున్న తను, తన కుటుంబం రోడ్డున పడకుండా కాపాడమని ప్రతిరోజూ ఎన్నెన్నో దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడాయన.
ఇన్నాళ్ళకు మహతి రూపంలో తనకు అదృష్టం వరిస్తోందా?
తన కుటుంబం రోడ్డున పడదు... మళ్ళీ తన పూర్వ వైభవం తనకు వచ్చేస్తోంది.