తన కష్టానికి ప్రతిఫలం, తన ఆలోచనలకు ప్రతిఫలం... ఇన్నాళ్ళకు... ఇన్నేళ్ళకు...
ఆనందంతో ఆయన తడిసి ముద్దయిపోయాడు. గబుక్కున లేచి మహతిని అక్కున చేర్చుకున్నాడు.
"లక్ష్మీ..." ఆ పిలుపుకు, మళ్ళీ ఏం జరిగిందోనని పరుగు- పరుగున వంటగదిలోంచి బయటకొచ్చింది రఘురామశెట్టి భార్య.
"లక్ష్మీ... పూజగదిలోనున్న పట్టుచీరను తీసుకొస్తావా..." ఆవిడ గబుక్కున పూజగదిలోకెళ్లి, ఆ పట్టుచీరను పట్టుకొచ్చింది.
"ఇది... నేను స్వయంగా నేసిన పట్టుచీరమ్మా... నా కుటుంబం రోడ్డుపాలు కాకుండా చెయ్యమని ప్రార్థిస్తూ, ఆ దేవదేవికి పెట్టుకున్న చీర... ఇంత మంచి వార్తను చెప్పిన నీకు... ఈ సమయంలో నేనివ్వగలిగే ఏకైక కానుక ఇదేనమ్మా... ఇదే... నువ్వు ఆ దేవదేవీవేనమ్మా" తడిదేరిన కళ్ళతో.
ఆ చీరను మహతి చేతిలో పెడుతూ అన్నాడు రఘురామశెట్టి.
కళ్యాణి వచ్చి నుదుట బొట్టు పెట్టింది.
ఆ తర్వాత భోజనాలయ్యాక-
తన పథకాన్ని చెప్పింది మహతి.
"ప్రస్తుతానికి మనకో యాభై స్టిచ్చింగ్ మిషన్ లు కావాలి... చెప్పింది చెప్పినట్టుగా కుట్టగలిగే దర్జీలు కావాలి.... జన్నీ ఫాబ్రిక్ షోరూంని నేను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాను. ఇక్కడ ఆజమాయిషీ అంతా కళ్యాణికి అప్పగించింది... మీరూ, నాతోపాటు హైదరాబాద్ రండి" చెప్పింది మహతి.
"ఒకేసారి యాభై స్టిచ్చింగ్ మిషన్లంటే..." ఆలోచనలో పడ్డాడు రఘురామశెట్టి.
"మనం కట్నం కోసం ఇచ్చిన డబ్బు వాడు రేపుదయం తెచ్చిస్తాడు కదా" ప్రక్కనే వున్న కళ్యాణి అంది.
"ఈ గొప్ప సంఘటన జరగటం కోసమా... పెళ్ళి తప్పిపోయింది" తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు రఘురామశెట్టి.
మర్నాడుదయం-
జన్నీ ఫాబ్రిక్ మిల్స్ లో మనుషులు తిరగడం ప్రారంభమైంది.
గోడౌన్ లోంచి క్లాతంతా బయటకొచ్చింది.
స్వయంగా రఘురామశెట్టి, ఆయన భార్య లక్ష్మి, కళ్యాణి, మహతి ఆ కల్,క్లాత్ ని శుభ్రం చెయ్యడం ప్రారంభించారు.
కొంతమంది మనుషుల్ని కూడా ఏర్పాటు చేసాడు రఘురామశెట్టి.
ఆ రోజు సాయంత్రం-
వియ్యంకుడు ముఖం మాడ్చుకుని కట్నంగా తీసుకున్న లక్షరూపాయల్ని తెచ్చిచ్చేసాడు.
అక్కడ పనుల్ని కళ్యాణికి అప్పగించి-
రఘురామశెట్టి, మహతి హైదరాబాద్ బయలుదేరారు.
* * * * *
యధాప్రకారం చిక్కడపల్లి హోటల్లో దిగాడు రఘురామశెట్టి. తన రూమ్ నుంచి ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చేసింది మహతి.
"నన్నేం చెయ్యమంటావ్..." అడిగాడు రఘురామశెట్టి.
"ఒక డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దెకు సంపాదించింది... నేను సాయంత్రం మళ్ళీ అయిదుగంటలకొస్తాను."
"నేను ఇక్కడుండడానికి ఫ్లాట్ అక్కర్లేదేమోనమ్మా..." అనుమానంగా అన్నాడాయన.
"ఫ్లాట్ మీక్కాదు సర్... ముందు వెతకండి... తర్వాత ఎందుకో చెప్తాను."
వచ్చేసింది మహతి.
* * * * *
స్టిచ్ వెల్ లోకి అడుగుపెట్టిన మహతిని చూడగానే "నువ్వేదో సెన్సేషన్ క్రియేట్ చేస్తావని ఎప్పుడో ఊహించాను. కానీ... యింత త్వరలో క్రియేట్ చేస్తావని అనుకోలేదు. జన్నీ ఫ్యాబ్రిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసావట కదా... నిన్న ఈవెనింగ్ మీ యూనివర్సిటీ స్టూడెంట్సట... వరసగా వస్తూనే వున్నారు... స్టాఫందరూ వెళ్ళిపోయారు... వాళ్ళకి నేనొక్కదాన్నే దొరికిపోయాననుకో... అసలేమిటీ కథ..." అడిగింది వనజాక్షి.
చెప్పింది మహతి.
"నిజంగా ఫారిన్ క్లాతా అది! కాదుగదా... మరి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?"
"అది ఫారిన్ క్లాత్ కాదు... కానీ లేటెస్ట్ ఫారిన్ డిజైనింగ్ వుంది. క్రేజ్ కి కారణం అంటారా... ఇనీషియల్ గా టార్గెట్ గ్రూప్ కి వెళ్ళడానికి చిన్న మాజిల్ చేసా" నవ్వుతూ అంది మహతి.
ఆపైన మహతి తన సంభాషణని కొనసాగిస్తూ-
జన్నీ ఫాబ్రిక్ పునరుద్ధరణ, రఘురామశెట్టిని హైదరాబాద్ తీసుకురావడం, మిగతా ప్లాన్స్ క్లుప్తంగా చెప్పింది. ఆమె చెపుతున్నంత సేపూ కళ్ళార్పకుండా చూస్తూ వింది వనజాక్షి. అంతా విన్నాక ఆమె ఒకే ఒక మాట అంది.
"జన్నీ ఫాబ్రిక్ మిల్స్ ను ఓపెన్ చేయిస్తున్నావా... నిజం ...? ఇక్కడ షోరూంని ఏర్పాటు చేయిస్తున్నావా? అయితే ఇక్కడ మానేస్తున్నావన్న మాట..." ఆ చివరి మాటను ఆవిడ చాలా బాధగా అంది.
"యూ ఆర్ సో బ్రిలియంట్ మహతి... చాలామందికి... బ్రిలియన్స్ వుంటుంది. కానీ ధైర్య సాహసాలుండవు... కానీ... కొన్ని నెలల టైమ్ లో నువ్వు చేస్తున్న అద్భుతాలు..."
"అంతగా పొగడకండి మేడమ్... స్వతహాగా నేను చాలా బద్ధకస్తురాలిని... పెద్దలు సంపాదించినదానిని ఖర్చు చెయ్యడం తప్ప, సినిమాలకు, షోకులకు తగలెయ్యడం తప్ప, చాలాకాలం బాధ్యత తెలీనిదాన్ని... ఒక లక్ష్యం కోసం నేను మారాల్సి వచ్చింది... ఆ గమ్యాన్ని నేను చేరుకోవాలంటే కాలం, నేనూ ఒకటి కావాలి... అందుకే ఈ పరుగు...."
మహతి మాటలు అర్థం కాలేదు వనజాక్షికి.
"ఎనీహౌ... టైమీజ్ యువర్స్ నౌ... గో ఎ హెడ్..." ప్రశంసాపూర్వకంగా అందామె.
ఈ రోజు సాయంత్రం-
మహతి రాకకోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్నాడు రఘురామశెట్టి . దూరం నుంచి మహతి కన్పించగానే తనే ఎదురెళ్ళాడు.
"కాలేజీ లైన్ లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ దొరికిందమ్మా..." ఉత్సాహంగా చెప్పాడాయన. మొట్టమొదటిసారి చూసినప్పుడు రఘురామశెట్టికి, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం కన్పించింది.
ఆ వ్యత్యాసం చాలా ఆనందాన్ని కల్గించిందామెలో.
"పదండి... ఆ ఫ్లాట్ చూసొద్దాం..."
ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నాడాయన.
* * * * *
నగరం నడిబొడ్డున లకడికపూర్ ఏరియాలో-
మూన్ లైట్ ఎపార్ట్ మెంట్స్, థర్డ్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లాట్ ముందు అందమైన బ్రాస్ లెటర్స్-
ADDS INDIA ADD AGENCY
బోల్డ్ లెటర్స్ లో అందంగా మెరుస్తోంది.
విశాలమైన హాలు- అందమైన ఇంటీరియల్ డెకరేషన్- ఎడమవేపున ఛైర్మన్ ఛాంబర్- కుడివేపున మేనేజింగ్ డైరెక్టర్ రూమ్- దానికి ఆనుకుని స్టాఫ్ క్యూబిక్స్-