Previous Page Next Page 
లక్ష్యం పేజి 65


    "ఈ ముప్ఫై రోజుల నిరీక్షణ ఫలించింది. ఫలితం... కొన్ని గంటల సమయంలో రెండు పనుల్ని సాధించగలను అని ... ఒక అపరిచిత వ్యక్తి ద్వారా ."

 

    గ్లాసులోని డ్రింక్ ని సిప్ చేసి, ఖాళీ గ్లాసుని టీపాయ్ మీద పెట్టి, మధుకర్ దగ్గరకొచ్చి, అతని భుజాలమీద చేతులువేసి, అతని కళ్ళల్లోకి చూస్తూ-

 

    "ఎట్ లాస్ట్ ఐ గాట్ మై వే... బికాజ్ ఆఫ్ యూ... ఆశ్చర్యపోతున్నావ్ కదూ... ఫార్ట్యూన్ అంటే ఇదే..."

 

    గబగబా టేబిల్ వేపెళ్లి, సూట్ కేస్ తెరిచి వంద రూపాయల కట్టని తీసి, మధుకర్ చేతిలో పెట్టి-

 

    "దిసీజ్ యువర్ రెమ్యునరేషన్ ఫర్ యువర్ కాప్షన్..." మధుకర్ కి అతని ప్రవర్తన చాలా వింతగా వుంది. ఆ ఇన్సిడెంట్ చాలా ఎగ్జయిటింగ్ గా వుంది.

 

    మధుకర్ చేతిలో వున్న నోట్ల విలువ -

 

    పదివేల రూపాయలు.

 

    "నిన్న నువ్వు నా టేబిల్ మీద చూసిన ఆ కాటన్ శారీస్ లే అవుట్ నెల రోజులనుంచి నా టేబిల్ మీద అలాగే వుంది . ఎంతోమంది బొంబాయి కాపీ రైటర్స్, హైదరాబాద్ కాపీరైటర్స్ ట్రై చేసారు... వాళ్ళెవరూ నన్ను శాటిస్ ఫై చెయ్యలేకపోయారు. ఆ యాడ్ తో నేను హైద్రాబాద్ కేంద్రంగా ఏజన్సీ స్టార్ట్ చేద్దామనుకున్నాను... అందుకే వెయిట్ చేసాను... ఎట్ లాస్ట్ ఐ గాటిట్... కేప్షనూ దొరికింది. ప్రాజెక్టూ ఓ.కె. అయింది... రిచ్ గా కనిపించటానికి, రిచ్ కానక్కర్లేదు.

 

    YOU NEED NOT BE RICH

 

    TO LOOK RICH.

 

    ఫెంటాస్టిక్...ఫెంటాబ్యులస్... ఇంక్రిడబుల్... స్టు పెండస్. నీ చతురతకి, స్ఫూర్తికి, తెలివితేటలకి నా జోహార్లు... నీకింతకు పూర్వం ఎక్స్ పీరియన్స్ వుందో, లేదో నా కవసరం లేదు- నీకు నామీద నమ్మకం వుంటే, నా యాడ్ ఏజన్సీకి నువ్వు మానేజింగ్ డైరెక్టర్ వి... ఫిఫ్టీ ఫిప్టీ షేర్- వాట్ డూ యూ సే..." సుమదేవ్ అంత ఫాస్ట్ గా వుంటాడని వూహించలేదు మధుకర్.

 

    తన జీవితంలో ఒక గొప్ప అద్భుతం ఇంత త్వరగా తారసపడుతుందనికోలేదు... అది కలో, నిజమో కూడా అర్థం కావటంలేదు... ఏదో యధాలాపంగా రాసిన కేప్షన్... గొప్ప మలుపుకి హేతువు కావటం...

 

    "ఎనీ డౌట్స్, ఆర్ అబ్జక్షన్స్...."

 

    ఆలోచించుకోడానికి టైమివ్వడం లేదు సుమదేవ్.

 

    "నాక్కొంచెం టైమ్ కావాలి సర్..." నెమ్మదిగా అన్నాడు మధుకర్.

 

    "బీ ఫాస్ట్ మైడియర్... కాలంతో పరిగెత్తగలిగేవాడే కమ్యూనికేషన్ మీడియాలో వుండాలి. ప్రతి సెకండ్ కీ ఇక్కడ విలువుంటుంది..." సుమదేవ్ నరాల్లో మత్తు పనిచేస్తోంది.

 

    "ఓ.కె. సర్... ఐ విల్ వర్క్ విత్ యు సర్!"

 

    "ఎస్. దట్ టైప్ ఆఫ్ స్పాంటెనియస్ డెసిషన్ ఐ వాంట్" హేపీగా నవ్వుతూ, మరో పెగ్గు గ్లాసులో పోసుకుంటూ-

 

    "సీ మిష్టర్ మధుకర్... ఈ క్షణం నుంచి " ADDS INDIA" ఏజన్సీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ వి. లెటజ్ సెలబ్రేట్ . కమాన్... ఉయ్ విల్ గో టు రెస్టారెంట్" ముందు కడుగేసి, ఫోన్ మోగటంతో ఆగిపోయి రిసీవర్ అందుకున్నాడు సుమదేవ్ .

 

    ఆ ఫోన్ అందుకోగానే చిరాకుపడ్డాడు సుమదేవ్.

 

    "లేడీకి లేచిందే పరుగన్నట్టుంది వ్యవహారం. ఈవెనింగ్ బోంబే వెళుతున్నావా? అయితే ఇప్పుడు కలుద్దాం అంటావ్. ఓ.కె. యాజ్ యూ లైక్. ఐ విల్ కమ్ ఎలాంగ్ విత్ మై న్యూలీ ఎపాయింటెడ్ మానేజింగ్ డైరెక్టర్. ఓ.కె." ఫోన్ పెట్టేసి-

 

    "సీ మిస్టర్ మధుకర్... మన ఫస్ట్ కస్టమర్ దగ్గరకి వెళుతున్నాం."

 

    "ఎవరు సార్ ఆ కస్టమర్?" ఎందుకో అడిగాడు మధుకర్.

 

    "రాఘవేంద్రనాయుడని... పెద్ద బిజినెస్ మాగ్నేట్ లే"

 

    సుమదేవ్ తో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థంకాలేదు మధుకర్ కి.

 

    ఆ పేరు వింటూనే ఉలిక్కిపడ్డాడు - ఒకింతసేపటికి తేరుకున్నాడు.

 

    "సర్! మొదట... నా పెట్రోల్ బంక్ జాబ్ కి రిజైన్ చెయ్యాలి. అప్పుడే యిందులో నేను జాయిన్ అయినట్టు లెక్క. లేకపోతే ఇటీజ్ ఇల్లీగల్."

 

    "యూ ఆర్ కరెక్టు. సెల్ఫ్ పాలసీలుండడం చాలా అవసరం. ఓ.కె. ఐ విల్ గో... నౌ- దారిలో నిన్ను డ్రాప్ చేసి వెళతా."

 

    ఏమనలేదు మధుకర్.

 

    తన తండ్రి రాఘవేంద్రనాయుడు గురించి ఆలోచిస్తున్నాడు.

 

    సుమదేవ్ తన తండ్రి ఫ్రెండా! అంటే ఇన్ డైరెక్టుగా తన తండ్రి గ్రూప్ లోనే పడ్డాడా తను?

 

    రాక రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలా! వద్దా ?

 

    తండ్రి ప్రమేయం లేకుండా తన ప్రతిభతో సంపాదించుకున్న ఉద్యోగం యిది!

 

    కారులో వెళుతున్న మధుకర్, అన్యమనస్కంగా వున్నాడు.

 

    సడన్ గా మధుకర్ అలా గ్లూమీగా అయిపోవడంతో, మధుకర్ మనస్తత్వాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నించసాగాడు సుమదేవ్.

 

                           *    *    *    *    *

 

    భువనగిరి బస్టాండ్ లో బస్సు దిగింది మహతి. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలయింది.

 

    అదే సమయంలో-

 

    రాఘురామ్ శెట్టి యింట్లో-

 

    "చూడండి శెట్టిగారూ! మీరు పెద్ద బిజినెస్ మేన్ అని తెలుసు. లక్షల్లక్షలు సంపాదించారనీ తెలుసు. కాలం కల్సి రాలేదనీ తెలుసు. అయినా ఈ సంబంధం ఎందుకు ఒప్పుకున్నాను? మీ మంచితనం వల్ల. ఎంత మంచితనమైనా, మనం ఆలోచించాల్సింది మన పిల్లలు గురించి. అవునంటారా, కాదంటారా...?

 

    అడిగినంత కట్నం యివ్వలేనన్నారు. సర్దుకుంటానన్నాను... మీమీద అభిమానంతో పెళ్ళి ఖర్చులూ పెట్టుకుంటామన్నాను... కానీ... లాంచనాల విషయంలో మాత్రం, మీరు మరో మాటంటే కుదరదండి...  

 

    మనం కట్నం ఎంత పుచ్చుకున్నాం, ఎంత ఇచ్చుకున్నామన్నది... ఇవాళ ఎవరికీ అక్కర్లేదు...మనం ఎంత చెప్తే అంత అనుకుంటారు. అవునా కాదా...?

 

    నలుగురూ వచ్చే పోయే ఇంట్లో, ఒక కలర్ టి.వి, వి.సి.పి, ఏదో డబుల్ బెడ్... ఏదో ఒక సోఫా... మిక్సరూ... కుర్రాడికి ఒక స్కూటరూ... ఇవి కూడా లేకపోతే ఎలాగండి... చెప్పండి... అల్లుడి ప్రెస్టేజంటే, మీ ప్రెస్టేజ్ కాదూ... మీ అమ్మాయికే కదా ఆ గౌరవం" ఆ మాటలంటున్న వియ్యంకుడి ముఖంవైపు ముభావంగా చూస్తున్నాడు రఘురామశెట్టి.

 

    నెమ్మదిగా ఆయన పెదవి విప్పాడు.

 

    "ఇన్నీ చెప్పాక... మీరు మళ్ళీ మొదటికే వస్తే ఎలా బావగారూ? మొదట్నుంచి నేను మీకు తెలుసు... ఆ కాలంలోనే... పెద్దమ్మాయి పెళ్ళిని అయిదు లక్షలతో జరిపించాను... రెండో అమ్మాయి పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు.

 

    ప్రస్తుతం ఈ ఇల్లు తాకట్టుపెట్టి, ఈ పెళ్ళి చేస్తున్న విషయం మీకు తెలుసు... అన్నీ తెల్సిన మీరే..." ఎంతోమందిచేత గౌరవింపబడే తన తండ్రి అలా ప్రాధేయపడడం మొట్టమొదటిసారి చూస్తోంది ఇరవై మూడేళ్ళ కళ్యాణి.

 

    "లాభం లేదండి శెట్టిగారూ... నేనొప్పుకున్నా, ఇంట్లో ఒప్పుకోవడం లేదు... రేపుదయం ఆరుగంటలకల్లా మీరే విషయం చెప్పండి" వియ్యంకుడు లేచి నిలబడ్డాడు. అదే సమయంలో ఆ ఇంటి ముందు రిక్షాలోంచి దిగింది మహతి. లోనికొస్తూ ఆ సంభాషణను వింది.  

 Previous Page Next Page