Previous Page Next Page 
గోరింటాకు పేజి 60


    "ఎంత బాధపడుతున్నారో వారు?" అన్నదామె రుద్ధకంఠంతో.

 

    రాజారావు బదులు చెప్పలేదు.

 

    ఆమె బల్లమీద మోచెయ్యి ఆన్చి, గడ్డంకింద అరచెయ్యి పెట్టుకుని యోచిస్తూ కూర్చుంది. అప్పుడప్పుడు వేదనగా తనలో తాను ఏదో గొణుక్కుంటున్నది.

 

    ఆమె మనసు మరల్చుదామని రాజారావు ఏవేవో కబుర్లు చెప్పసాగాడు. ఆమె వింటూ మధ్య మధ్య ప్రశ్నలువేస్తూ మళ్లీ మాధనపడుతూ కూర్చుంది.

 

    చివరకు అతనికి నిద్రరాసాగింది. కునికిపాట్లు పడసాగాడు.

 

    "నిద్రపోతున్నావా?" అనడిగిందామె.

 

    "లేదు" అన్నాడతను మగతగా.

 

    ఓ పావుగంట గడిచాక ఆమె మళ్లీ అదే ప్రశ్నవేసింది. కానీ రాజారావు జవాబు చెప్పే స్థితిలో లేడు. గాఢనిద్రలో వున్నాడు.

 

    ఏ మూడుగంటలకో అతనికి మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ ఆమె అక్కడ ఇంకా వున్నదేమోనని చూశాడు. అవును అలాగే గడ్డంక్రింద చెయ్యి ఆనించుకుని కళ్ళనీళ్ళు కారుస్తూ కూర్చుని వుంది.

 

    "ఏడుస్తున్నావా వదినా?" అన్నాడతను బాధగా.

 

    ఆమె పమిటచెంగుతో కళ్లు తుడుచుకుని "నేనింత కష్టంలో వున్నానుకదా? నీకింత బండనిద్ర ఎలాపట్టింది?" అని అడిగింది.

 

    రాజారావు వెంటనే కోపంగా "నువ్వడుగుతున్నావా నన్నీ ప్రశ్న?" అన్నాడు. 

    

    ఆమె దెబ్బతిని, అర్థంకాకుండా చూసింది "మరిచిపోయావా వదినా? ఒకానొక రోజున ఈ గదిలో నేను పుట్టెడు జ్వరంతో బాధపడుతుండగా ప్రక్కగదిలో నువ్వూ, మీ ఆయనా సరససల్లాపాలు -"   

 

    ఆమె రెండుచేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తూకూర్చుంది.

 

    రాజారావులో ఆమెను ఇంకా వేధిద్దామన్న స్వార్ధబుద్ధి పనిచేసింది. "నీ భర్తకు అస్వస్థతగా వున్నదని నేను నిద్రపోతేనే నీకింత ఉక్రోషం వచ్చిందే? ఊహించగలవా ఆనాటి నా స్థితిని?" అన్నాడు.

 

    "నన్ను చంపక బాబూ!" అన్నదామె చేతులు విడదీసుకుని అతనివంక దీనంగా చూస్తూ.

 

                                              18

 

    కొన్నిరోజులు పోయాక చక్రపాణి బెజవాడలో తమ ఇంట్లో కూర్చుని మిత్రుడు రాజారావు రాసిన ఉత్తరం చదువుకోసాగాడు.

 

    "ప్రియ పాణీ!

 

       నీ ఉత్తరం చేరింది. క్రితంసారి నువ్వు బెజవాడ వచ్చినప్పుడు చాలా కారణాలవల్ల నిన్ను కలుసుకోలేకపోయాను. నాకు అందని ఒక వస్తువును వెతుక్కుంటూ ఎన్నో ఊళ్ళు తిరిగాను. ఇంతలో రిజల్ట్సు తెలిశాయి. పాసయి కూర్చున్నాను. నువ్వు కూడా పాసయ్యావని రాశావు. కంగ్రాచ్చులేషన్స్!

 

    నేను సాగర్ వచ్చి ఎమ్.ఏ.ఎల్.ఎల్.బి.లో చేరాను. లాయరుగా జీవితం గడపాలని నా అభిమతం కాకపోవచ్చు. ముందు ముందు ఏం చేస్తానోకూడా తెలియదు. కానీ ఇంకా చదవాలనుకున్నాను.... చదువుతున్నాను. ఇప్పుడిప్పుడే నాకు ఆ ప్రాంతానికి రావాలని లేదు. ఆప్తులెవరైనా చచ్చిపోతే తప్ప, చదువు పూర్తయేదాకా రాను. ఓ కొత్త అధ్యాయంలోకి ప్రవెశించాననుకుంటాను.

 

    నీ దీర్ఘమైన ఉత్తరాన్ని ఎంతో శ్రద్ధగా పఠించాను. నువ్వు బి.ఏ.తో చదువుకు ఉద్వాసన చెప్పి మీ నాన్నగారిలాగే వ్యాపారంలో దిగటం నాకు సంతోషం కలిగించింది. నువ్వు ఇదివరకటికన్నా చాలా విషయాలు నేర్చుకున్నావుకాబట్టి వ్యాపారంలో తప్పక ప్రకాశించగలవు.

 

    సరే!ఇంక అసలు విషయానికి వద్దాం. నాదగ్గర ఇన్నాళ్లూ ఇన్ని సంగతులు ఎందుకు దాచావు? అసలు ఎలా భరించావు ఇన్ని ఆలోచనలు నాకు చెప్పకుండా - నీలో ఏదో మార్పు వచ్చిందని నేను అనుమానిస్తూ వచ్చానుగానీ ఇంత నిగూఢత అట్టిపెట్టుకున్నావని ఊహించలేకపోయాను. ఇప్పటికైనా పూసగుచ్చినట్లు రాశావు.. సంతోషం.

 

    అసలు మొదటినుండీ నీతో వచ్చిన చిక్కేమిటంటే - నువ్వు చాలా సెన్సిటివ్ పర్సన్ వి. ప్రతి చిన్న అంశానికీ మానసికంగా అగ్రస్థానమిచ్చి తర్జనభర్జనలు జరిపి నువ్వుమాత్రం దూరంగా - ప్రేక్షకుడిగా చోద్యం చూస్తుంటావు. అందుకు నీకు నిజమైన అనుభూతి లేదు. నీది కల్పితమైన అనుభూతి. నువ్వు స్థిరంగా ఒక విషయాన్నిగురించి ఆలోచించలేవు. నీ మనసు ప్రతిక్షణం అటూఇటూ ఊగుతూ వుంటుంది. నీకు జరిగే ప్రతి సంఘటనలోని లోతును అణువణువునా శోధించి తపన పడుతుంటావు. ఒక పుస్తకం చదువుతున్నా, ఒక ఆలోచన చేస్తున్నా, ఒక అనుభవం జరుగుతున్నా, అనుక్షణం - నేను అనే భావం నిన్ను విడిచిపెట్టిపోదు. ప్రతిదాంట్లోనూ నువ్వూ, నీ ఆరాటం నీ కళ్ళకు స్పష్టంగా కనిపిస్తూ వుంటాయి. నువ్వు 'అస్పష్టతయొక్క నీడని' అని రాశావు... కానీ నువ్వు స్పష్టంగా వున్న అంశం ఒకటుంది. నీ అస్పష్టతనుగురించి స్పష్టంగా తెలుసుకోవడం. నువ్వు డ్రీమర్ వి. నీకోసం నువ్వు జీవించినట్లుకాకుండా ఇతరులకోసం అన్నట్లు గడుపుతావు. నీ మాటకు విలువుంది కానీ నీకు వ్యక్తిత్వంలేదు. ఈ భూమ్మీద ఉన్న విచిత్రాలలో ఒకటేమిటంటే తెలివైనవాళ్లకూ, సునిశిత మేధస్సుగలవాళ్లకూ వ్యక్తిత్వం తక్కువ వుంటుంది. ఉన్నా, అది వ్యక్తిత్వ భ్రమ మాత్రమే!

 

    నీలో ఓ ప్రత్యేకత వుంది. అసలు చాలా లోపాలున్న మనుషుల్లో ప్రత్యేకత ఏదో తొంగిచూస్తుంటుంది. వాళ్లకు ప్రక్కన గైడ్ ఉన్నంతకాలం ఆ ప్రత్యేకత బయల్పడదు. జీవితం వాళ్లను తరుముకుంటూ వచ్చినప్పుడు దానియొక్క ప్రభావం బయటపడుతూ వుంటుంది. అది నీలో నేను పసికట్టాను. కాబట్టే నువ్వు హైద్రాబాద్ వెళ్లేముందు చెడిపోవడం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు "ఈ సత్యాన్ని నీ అంతట నువ్వే తెలుసుకుంటావ'ని చెప్పాను. నేను చెప్పిన మాటలు సాధారణంగా అబద్ధాలు కావురా పాణీ!

 Previous Page Next Page