నీ అనుభవాలనూ, నువ్వు చెప్పిన పనులనూ రాశావు. చివరికి నీ అల్టిమేటం ఏమిటంటే చెడిపోవడం చేతకాలేదని. చెడిపోవడంలో భ్రమేకానీ ఏ ఆనందాన్నీ నువ్వు బాపుకోలేదని. అందుకని మానసికంగా నువ్వు పవిత్రుడవేననీ, అవన్నీ కలలోని ఘటనలాంటివనీ... నీ మనసుని వక్రమైన అనుభవాలద్వారా కలుషితం చేసుకోలేదనీ ఓ నమ్మకం నీకు. ఆ నమ్మకంవల్లే నీకు జీవితం ఎప్పటికప్పుడు కొత్తగా, ఏమీ తెలియనట్లుగా కనబడుతోంది. నువ్వింకా పసి పిల్లాడివేనన్న భావన నన్ను విడిచిపోవటంలేదు.
నీ అనుభూతుల్నిగురించి నాకు తోచింది నేను చెబుతాను.
నువ్వు కావాలని ఓ పనిచెయ్యవు. అసలు నువ్వు మనస్ఫూర్తిగా ఏ పని చెయ్యవు. అనుభవాన్ని తెలుసుకుందామని చేసినట్లుగా, ఇతరులకోసం అన్నట్లుగా, మొక్కు తీర్చుకున్నట్లుగా, ఎక్స్ పరిమెంట్ గా చేస్తావు. ఒకటి చేస్తుంటే నీ మనసు మరోదానియందు లగ్నమైవుంటుంది. నీ మనసు ఎప్పుడూ వేసిలేటింగ్ గా వుంటుందని చెప్పానుకదా! ఆ బ్రహ్మానందం ఎవరో, అతను నిన్ను కలుసుకోకపోయుంటే నీ జీవితం మరో మార్గంలో నడిచివుండేది. నిన్ను ఎవరైనా కీ యిచ్చి వదిలితే, ఇహ నీకు తెలియకుండానే ఆడుతూ వుంటావు. నువ్వు ఒక బొమ్మలాంటివాడవు. అందుకే నీకేదీ అలవాటు కాదు.
నువ్వు త్రాగావనుకో... అదంటే నీ అంతరంగంలో ఇష్టంలేదు, ఓ స్త్రీతో సంచరించినప్పుడైనా అంతే. అందుకే అవి ఏవీ నీ హృదయాన్ని స్పర్శించలేకపోయాయి. నువ్వు చాలా సెన్సిటివ్ గా వుండటమే, అనుక్షణం "నేను" అనే ఊహ నిన్ను గల్లంతు చేస్తుండటమే దీనికి కారణం. నిన్ను నువ్వు మరచి ఇతర విషయాలగురించి ఆలోచించి, అందులో లీనమయ్యే సమర్ధత నీకు లేదు. అందుకనే ఏ విషయంలోనూ సంపూర్ణ పరిజ్ఞానం నీకు అలవడదు. నీకు డెప్త్ తక్కువ.... తాగి ఎప్పుడూ తూలలేదని రాశావు. ఆ పని అంటే నీకు అయిష్టమేకాకుండా భయం, అసహ్యం కూడా వున్నాయి. అందుకని బహుశా పూర్తిగా ఎప్పుడూ తప్పతాగి వుండవు. ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ, తడబడుతూ అనుభవించడానికి ప్రయత్నించడమే నీ గుణం! నీకు అసలు తృష్ణ లేదు. తృష్ణ లేనిదే తృప్తి ఎక్కడినుండి వస్తుంది? అందుకే నీకు అనుభూతి లేదు."
కానీ నువ్వు మనఃపూర్వకంగా పాల్గొన్న సన్నివేశాలు రెండు వున్నాయి. ఒకటి మాలతి అధ్యాయం, మరొకటి ప్రభావతి ప్రకరణం. ఈ రెండింటి మధ్య దూరమే నీ అస్పష్ట, అస్వస్థ జీవితం.
మాలతితో నువ్వు జీవితాన్ని ప్రేమతో ప్రభావితం చేసుకున్నావు. ప్రభావతితో ఆత్మవిమర్శలో పడ్డావు. మాలతి నీకు గగనకుసుమం అయినది. ప్రభావతి నీ హృదయకుసుమం అయినది. బహుశా మాలతిలోని అంశాలు గానీ, గుణాలుకానీ కొన్ని ప్రభావతిలో నీకు కనిపించివుంటాయి. అందుకే ఆమెను చూస్తే నీకు ఉలికిపాటు, గగుర్పాటు.
యవ్వనంలో మనుషులు ఒక ప్రత్యేకజీవులు. మనిషిమీద యవ్వనప్రభావం చాలావుంటుంది. ఏదో నూతనత్వంకోసం మనసు తహతహలాడుతుంటుంది. ఈ ఫేజులో జీవితంలోని ముఖ్యమైన సమస్యల్ని నిర్లక్ష్యం చేసి, ఊహించుకున్న విలువలకు ప్రాధాన్యత యిచ్చి ఆ ఊహ ప్రకారం జరగకపోతే అసంతృప్తి, వెలితి ఫీలవడం పరిపాటి. ఇలాంటప్పుడు తమ జీవనవిధానంపట్ల సిన్సియర్ గా వున్నవాడిని చూస్తే ఎగతాళిగా వుండి, వాడికంటే తాము గొప్పవాళ్లమనే భ్రాంతి కూడా కలుగుతుంటుంది. దీనినే ఆర్టిస్టిక్ గా వుండటమనీ, సౌందర్యోపాసన అనీ పేర్లుపెట్టి తమ ఆధిక్యతను నిరూపించుకునేందుకు యత్నం చేస్తుంటారు.
కొన్నాళ్లు గడిచి ముందుకు పోతేగానీ జీవితంయొక్క నిజమైన విలువ, సాధన బోధపడదు. అప్పుడిహ వెనక్కు తిరిగి చూసుకునేసరికి పశ్చాత్తాపం, సమయం మించిపోవడం ఇలాంటివి. ఈ సంఘర్షణలోనే రెండువిధాలా ఉన్నతికి చేరుకునే చతురులు కొందరుంటారనుకో!
చివరకు నీకు నా హృదయపూర్వకంగా ఇచ్చే సలహా ఏమిటంటే - నువ్వు ప్రభావతిని పెళ్లిచేసుకుతీరాలనే నీ భయానికి అర్థంలేదు. ఆమెను చేపట్టకపోతే నీకు నిర్దుష్టత రాదు. ఈ మీమాంస నిన్ను వదలదు. ఇది చేయకపోతే ఆ తరువాత నీ పశ్చాత్తాపం ఎన్ని విపరీత పరిణామాలకు దారితీస్తుందో ఊహించలేం. నీ ప్రాణస్నేహితునిగా, శ్రేయోభిలాషిగా, నీమీద కొంత అధికారం సంపాదించిన వ్యక్తిగా నీకిచ్చే అమూల్యమైన సలహా యిది. పాటించకపోతే నువ్వు ఎంతో నష్టానికి గురవుతావు. నీ తీర్పులో నాకు పూర్తి నమ్మకం వుంది.
నేను నాగురించి ఏమీ రాయదలుచుకోలేదు. కొంత రాశాను ఉత్తరం మొదట్లో... అది చాలు!
తరచు కలుసుకోకపోయినా, ఎక్కడవున్నా నీ ప్రాణమిత్రుడు
- రాజా."
ఉత్తరం ముగించి చక్రపాణి కళ్లు తుడుచుకున్నాడు.
19
నాలుగేళ్ల తరువాత...
చక్రపాణి ఓసారి వాళ్ల అక్కగారి ఊరికి వెళ్లాడు. జయలక్ష్మి ఆ కబురూ, ఈ కబురూ చెప్పి "ఆయనకు బొత్తిగా తీరిక ఉండదురా తమ్ముడూ! పైగా నిర్లక్ష్యం. ఇంట్లో ఈ బుచ్చిగాడి అల్లరి చెప్పశక్యం కాదు. మామూలు బళ్ళలో వీడిని చేరిపిస్తే మరింత ఆకతాయి అయిపోతాడు. మాంటిసోరీనో, ఏదో వుందే అందులో పడేస్తే అక్కడ పిల్లలను లాలిస్తూ బాగా చెబుతారట! తీసుకుపోయి చేర్పించు బాబూ నీకు పుణ్యముంటుంది!" అంది.
సరేనని చక్రపాణి 'రారా బుచ్చిగా!' అంటూ మేనల్లుడిని తీసుకుని స్కూల్ కి బయలుదేరాడు.
అందమైన ఆ యువకుణ్ణి, అతని చిటికెన వ్రేలు పట్టుకుని ముద్దుగా నడుస్తున్న ఆ చిన్నారివాణ్ణీ రోడ్డుమీద జనం ముచ్చటగా తిలకించసాగారు.
ఓ వృద్ధురాలు ప్రేమ మితిమీరగా బుగ్గలమీద వేళ్లు విరిచి ఆశీర్వదిస్తూ దూరంగా వెళ్లిపోయింది.
స్కూల్ కి చేరుకున్నాక హెడ్ మిస్ట్రెస్ గారి గదికి వెళదామని పోతూ లోపలి నుండి వస్తున్న ఓ మూర్తిని చూసి చక్రపాణి నిర్ఘాంతపోయి నిల్చుండిపోయాడు.
ఆమె కూడా తన పెద్ద పెద్ద కళ్ళను అప్పగించి చూస్తూ చివరకు తేరుకుని చిరునవ్వు నవ్వింది.