"ఏదో చేస్తాలే" అని అతను అక్కడినుంచి తప్పించుకుని వచ్చేశాడు.
ఆ సాయంత్రం కనుచీకటి పడుతున్న సమయానికి రాజారావు గాంధీనగర్ వెళ్లి, కొంచెం తారట్లాడాక, చివరికి ఒక ఇంటిముందు తాత్సారం చేస్తూ నిల్చున్నాడు. ఇదే ఇల్లు! బోర్డు కూడా వుంది. అయితే కాపురం మేడమీదలా వుంది... కొంచెం తటపటాయించి మెట్లెక్కిపోయాడు.
హాల్లో ఆఫీసరుగారు ఈజీఛైర్ లో కూర్చుని ఏదో చదువుతున్నాడు. అలికిడి విని తలెత్తి చూసి "మీరా?" అన్నాడు.
మళ్లీ వెంటనే "ఏమిటి?" అన్నాడు.
రాజారావుకు అక్కడ నిల్చోబుద్ధిపుట్టక "మంజువాణికోసం!" అంటూ లోపలకు నడవబోయాడు.
"ఆగు" అన్నాడు ఆయన లేచి నిల్చుని.
"ఎందుకు?" అన్నాడు రాజారావు ఆగి.
"నా భార్యకోసం నా ఇంట్లో జొరబడే దమ్మెక్కడిది నీకు?"
రాజారావు సూటిగా ఆయన ముఖంకేసి చూస్తూ "నువ్వే యిచ్చావు" అన్నాడు.
"నేను యిచ్చానా? అవాచ్యాలు పలుకుతున్నావ్? ఈ పోకిరీవేషాలు నా ముందు పనికిరావు... నేను పరువూ, ప్రతిష్టా గలవాణ్ణి!" అంటూ ఆయన కళ్లెర్రజేశాడు.
గలాభా విని మంజువాణి గదినుండి బయటకు వచ్చి భయంతో వణికిపోయి నీరసంగా గోడకానుకుని నిలబడింది.
రాజారావుకు కోపంవచ్చింది. "రెండుమాటలు చెప్పి పోదామని వచ్చాను.. మరి మాట్లాడక తప్పదు" అన్నాడు.
"నా ఇంట్లో నామీదనే అధికారం చలాయిస్తావా? పీడ విరగడైపోయిందనుకున్నాను... మళ్లీ దాపరించావా?"
"నీ ఖర్మ, నా ఖర్మ. అనవసరంగా గలాటాచెయ్యకు. పరిస్థికి ఇంతవరకూ వచ్చినందుకు నాకూ అసహ్యంగానే వుంది. కొంచెం గంభీరంగా ఊరుకోరాదూ?"
ఆయన ముందుకు వస్తూ "ఊరుకోవడానికి గ్రుడ్డివాణ్ణా? నా పౌరుషం..."
రాజారావు మధ్యలోనే ఆగి "బాక్సింగుకైతే నేను రెడీ. నా జబ్బలోకూడా బలం తక్కువలేదు."
మంజువాణి వెనుకనుండి ఏడుపుగొంతుతో "మీ ఇద్దరి పాదాలమీద పడతాను. ఏమిటీ అప్రతిష్ట?"
ఆయన మండిపోతూ "నువ్వూరుకోవే దయ్యమా? నువ్వే నా బ్రతుకు నవ్వులపాలు చేశావు" అన్నాడు.
మంజువాణి రెండుచేతుల్లో ముఖం దాచుకుని లోపలకు పరిగెత్తింది.
రాజారావుకు పిచ్చెక్కినట్లయింది. తను ఏం చేస్తున్నాడోకూడా తెలియలేదు. "మంజూ!" అని పిలుస్తూ గుమ్మంవైపు ఓ అడుగువేశాడు.
ఆయన ద్వారంవైపు చూపిస్తూ "గెటవుట్" అన్నాడు.
రాజారావు ద్వేషం కురుస్తోన్న నేత్రాలతో ఆయనకేసి తిరిగి "ఆనాడు నేను గదిలో వున్నప్పుడు... నువ్వు గెటవుట్. ఏముఖం పెట్టుకుని నాముందు ప్రగల్భాలు పలుకుతున్నావు? విను.. ఈ బెదిరింపులకు జడిసే ఘటం కాదిది. ఈ అధికారం నాకు నువ్వే యిచ్చావు. నాకూ పిచ్చెక్కింది.. రా! ఇద్దరం వీధినబడి ఒకరి పరువు ఒకరు తీసుకుందాం. ఎక్కడో మారుమూల శాంతంగా జీవిస్తున్నవాడిని ఈ రొంపిలోకి నీ చేతుల్తో లాక్కువచ్చినప్పుడేమయింది నీ బుద్ధి? మనస్తత్వాలతో చెరలాటలాడుతున్నావా మూర్ఖుడా?" అన్నాడు.
ఆయన ముఖం ఉన్నట్లుండి పాలిపోయింది. దగ్గరకు వచ్చి రాజారావు చేతుల్ని పట్టుకుని "నన్ను క్షమించండి బాబూ! తప్పంతా నాదే. వెళ్లండి" అన్నాడు వణుకుతున్న గొంతుతో.
రాజారావు ఆ చేతుల్ని విడదీసుకుని "వెళ్లక? నేనిక్కడ అధికారప్రదర్శన ఏమీ చేయదల్చలేదు. చివరిసారిగా కనిపించి పోదామని వచ్చాను. ఇక్కడిలా రసాభాస అయింది. జీవితంలో మరెప్పుడూ కనిపించకుండా వుండటమే కోరుకుంటా!" అన్నాడు.
"భ్రష్టుణ్ణయిపోయాను. మీకూ వేసట కలిగించాను. మంచిది బాబూ!" అన్నాడాయన.
"గుడ్ బై!" అని రాజారావు మెట్లుదిగి బయటకు వచ్చేశాడు.
* * *
రెండురోజులు పోయాక ఓ రాత్రి పదిగంటల వేళ తన ఊళ్లో, స్వంత గదిలో - రాజారావు మంచంమీద పడుకుని కళ్లు తెరచి చూస్తున్నాడు. అతని తలదగ్గరగా ఓ కుర్చీలో పెద్దవదినగారు కూర్చుని అతనిముఖంకేసి అనుషంగికంగా చూస్తూ ఏదో యోచిస్తుంది. ఆమెకళ్ళు ఎర్రగా, మండుతున్నట్లుగా ఉన్నాయి. బల్లమీద చిన్నదీపం ఒకటి వెలుగుతుంది.
రాజారావు అనుకున్నాడు "నేను ఎంత సిగ్గుమాలిన పని చేశాను? ఎందుకు మొన్న అంత ఏహ్య వాతావరణంలో చరించాను? అంత మూర్ఖుణ్ణయిపోయానేమిటి? పాడుజీవితం తలచుకుంటుంటే ఒళ్ళు దహించుకుపోతుంది. నా చదువు, నా విజ్ఞానం ఏమయిపోయినాయి? ఛీ ఛీ! ఒట్టి ముదనష్టపు పని చేశాను... ఇంత అల్పుణ్ణా నేను....?"
"రాజా" అని పిలిచింది వదినగారు మృదువుగా.
"ఏమిటమ్మా?"
"నిద్రపోతున్నావా?"
"ఉహుఁ"
"ఇంకెప్పుడు తెల్లవారుతుంది? నాకు భయంగా వుంది."
రాజారావు ముఖం ఆమెవైపు త్రిప్పి "నువ్వు నిద్రపో వదినా! తెల్లవార్లూ జాగారం చేసిమట్టుకు ఏంలాభం? ప్రొద్దున్నే బండికట్టుకుని పోదాం!" అన్నాడు.
"నేను ఎంత మొత్తుకున్నా ఈ రాత్రికి ప్రయాణం పడనివ్వలేదుగదా నువ్వు?" అన్నదామె ఆందోళన, బాధ కూడిన కంఠంతో.
రాజారావు ఆశ్చర్యంగా "ఆరుమైళ్లు ఈ అడవి దారివెంట ఈ చీకట్లో నిన్ను తీసుకుని ఎలా పోయేడమ్మా? అయినా ఇదంతా నీ గాభరా... ప్రమాదమేం లేదు" అన్నాడు.
"నీకు తెలీదు మరిదీ!" అందామె గుడ్లనీరు కుక్కుకుంటూ.
జరిగిన విషయం యిది..... కొన్ని రోజులక్రితం పెద్ద అన్నగారు పొలం వెళ్లివస్తుంటే అరికాల్లో పెద్ద ముల్లొకటి దిగబడింది. సహజమైన నిర్లక్ష్యంతో ఆయన ఉపేక్షించాడు. చివరకది ఏకల్లా మేకై కూర్చుంది. మంచంమీదినుండి దిగలేని స్థితి వచ్చిపడింది. నిన్నప్రొద్దున బస్తీలో వున్న డాక్టరుదగ్గరకు పోయి చూపించుకుందామని బండిచేసుకుని వెళ్లారు. డాక్టరుగారు రెండుమూడు రోజులు అక్కడే ఉండాలన్నారు. భార్యకూడా వెంటనే పోదామనుకునేసరికి ఇబ్బంది వుండటంవల్ల వీలుపడలేదు. ఇవాళ రాత్రి ఎనిమిదిగంటల సమయానికి పనికుర్రాడు అక్కడినుండి అయ్యగారికి కాలికి ఆపరేషన్ చేశారనీ, తర్వాత బ్రహ్మప్రళయంగా జ్వరం వచ్చిందనీ చెప్పాడు. చిన్నన్నగారు ఆయన దగ్గరే వున్నారు. భార్యకు మనసు నిలువలేదు. వెంటనే బయలుదేరితీరాలని పట్టుబట్టి కూర్చుంది. రాజారావు ఆ రోజు ఉదయమే ఊరునుండి వచ్చాడు. శతవిధాలా నచ్చజెప్పి మరునాడు తెల్లవారుజామునే బయల్దేరడానికి ఆమెను ఒప్పించాడు.