Previous Page Next Page 
చెదిరిపోతున్న దృశ్యం పేజి 6

మహిళా! ఓ మహిళా!
    మహిళా! ఓ మహిళా!
    నువ్వు లేనిదే మహి ఎక్కడుంది?
    భూమిలేనిచోట ఆకాశం వుంటుందా?
    ఆకాశమే లేకపోతే చుక్కలు రెక్కలు విప్పుకుని మెలుస్తాయా?
    సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ
    విశ్వ వీణకు శృతి పెట్టి జీవనరాగం పాడే గాయని మహిళ
    ఓర్పుకి మారుపేరు
    నేర్పుకి మరోపేరు
    మనసుకి మమతల పందిళ్లు వేసి
    సమత చమురు పోసి ఆశాదీపాలు వెలిగించేది మహిళ
    తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా అందాల భరిణగా
    అపురూప లావణ్య సుందరాంగిగా
    మనసిచ్చిన మానినిగా
    మనువాడిన మనస్వినిగా
    బాధ్యతల నెరిగిన బందీగా
    బాధని గొంతు దాటనివ్వని గరళకంఠుడిగా ప్రతీకగా
    సహనానికి సవాలుగా నిలిచేది మహిళ
    పరిస్థితి పామై కాటేస్తే, ఓపికకు పాతరపడితే
    రుధిర జ్వాలల్ని రగిలిస్తుంది మహిళ
    రుద్రవీణ భద్రకాళిలా మ్రోగిస్తుంది.
    కదను తొక్కుతుంది కత్తి దూస్తుంది
    దీక్షాకంకణ కవచంతో లక్ష్యం సాధిస్తుంది
    ఉద్యోగాలు చేస్తుంది ఊళ్లేలుతుంది
    గట్టి చేతులతో చట్ట సభలతో పెద్ద పీట వేసుకుంటుంది
    అయినా ఓడిపోతోంది పురుషాహంకార సమాజంలో
    వరకట్న యాగంలో సమిధగా కాలిపోతోంది నా మహిళ
    చాతకాని తనము కాదు అది చచ్చు తనమూ కాదు
    అంతులేని ప్రేమామృత భాండం ఆమె హృదయం
    క్షమాగుణం త్యాగం సర్దుకుపోయే స్వభావం ఆమె నైజం
    వాటిని బద్దలు కొట్టడం ఇష్టంలేని నా మహిళ
    మౌనంగా మిగిలిపోతోంది
    బలిపశువుగా ప్రాణాలు కోల్పోతోంది
    ఆత్మహత్య త్యాగం కాదు
    హత్య గావింపబడడం పరిష్కారమూ కాదు
    మనస్సును చంపుకోకు నా మహిళ
    మాగిపోకు మాడిపోకు నుసిగా మారిపోకు
    కసిగా మిగలబోకు
    నీ పసిడి హృదయంలో విషాన్నీ విషాదాన్నీ నిండనీయకు
    నీ శక్తిని వినియోగించు మహిళ
    నువ్వూ ఈ విశాల ప్రపంచంలో ఒక మనిషివని
    నీకూ స్వేచ్చగా బ్రతికే హక్కుందని చాటుకో
    నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో!

                * * *
    కృష్ణా తరంగాలు...
    పంచె గూడకట్టు, పైన అంగీ,
    మెడపైన ఒకతుండు, ముచ్చటగనుండు
    వెండితీగల జుట్టు గాలి కెగురుచునుండు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి !
    పంచె ఖద్దరు అంచు ధగధగా మెరయ
    పైన తెల్ల లాల్చి నిగనిగలాడ
    మల్లెపువ్వుల్లాగా బోసినవ్వులు విరియు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి !
    వామహస్తమున చిన్న పుస్తకము
    దక్షిణమున నుండు నొక్క కలము
    గళము లేదుగనుక ఆయుదా లీ రెండు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి !
    గళమున్ననాడు గాన మాతని సొత్తు
    పలుకులకు పాటలకు అతడె మొనగాడు
    పాడు జబ్బువచ్చి గొంతు మూసిననేమి ?
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి
    పదములు చాలునని పట్టాభిరాముణ్ణి
    శివుని పాదాల చెంత శిరసు నుంచమని
    పరమేశు ప్రార్ధించిన పరమభక్తుడు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి !
    గీతాంజలి వ్రాశాడు-ప్రతి తెనుగు
    గుండెలో గూడు కట్టుకున్నాడు
    ఆంధ్ర టాగూ రన్న ఆశ్చర్యమే లేదు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి !
    మాట్లాడలేకున్నా, మనషులు కావాలి
    ముచ్చటగ అందరూ సభ తీర్చి ఉండాలి
    అంతకంటె విందు నతడు కోరడు ఎపుడు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి !

    భోగిగా పుట్టాడు - భోగిగా పెరిగాడు
    రాజలాంఛనాల రుచులు చూశాడు.
    అపర శ్రీనాథు డన్న అతిశయోక్తి కావు
    అతడె కృష్ణశాస్త్రి అమర కవి !
    ముఖస్తుతి చెయ్యడు మెప్పుకోసం
    ఎవ్వరినీ ప్రార్ధించడు ఏదో ఆశించి
    మనిషైతే గౌరవించి ఆదరించడమే తెలుసు
    అతడె కృష్ణశాస్త్రి అమరకవి
        (1968లో కృష్ణశాస్త్రి గారి యింటికి వెళ్ళినప్పుడు తనమీద కవిత్వం
                  చెప్పమంటే ఆయన సమక్షంలో రాసిచ్చిన కవిత)

                * * *

 Previous Page Next Page