స్వాతంత్ర్యం ఒకరివ్వాలా?
నాకు స్వాతంత్ర్యం కావాలని అరుస్తే సరిపోతుందా
ఎవరి నడుగుతున్నావమ్మా?
ఎవరు ఇచ్చేవాళ్ళు?
నీ బతుకుకి నువ్వే నావికురాలివి
నీ విజ్ఞతతో నీ మేధతో నీకు నువ్వే
నీ జీవితాన్ని నడిపించుకోవాలి
నీ జీవిత భాగస్వామిని నీకు నువ్వే
ఎంచుకునే హక్కు నీకు లేదా?
నీ పెద్దలు తెచ్చిన వ్యక్తి
నీకు నచ్చకపోతే నీవు మొచ్చుకపోతే
ఆమాటే ఖచ్చితంగా చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు
సంతలో పశువులా అతడు ఎదురు డబ్బు పుచ్చుకుని
నీ ముక్కుకి పసుపుతాడేసి నిన్ను లాక్కుపోతుంటే
నీ హృదయ మధుకలశాన్ని ఆనందంగా అర్పించి
అతని అధికారాన్ని నీ మనస్సు మీదా శరీరంమీదా
వాడుకోమని ఎప్పుడంటే అప్పుడు
బ్లాంక్ చెక్ ఇచ్చేసి
ప్రబంధనాయికలతోపోలిస్తే కాబోసుననుకుంటూ మురిసిపోతూ
నీకు తగిన గౌరవం దొరకనప్పుడు మాత్రం కన్నీరు కారుస్తూ
ఎవరైనా చూస్తారేమో నవ్వుతారేమో అని
నిన్ను నువ్వే దాచుకుంటూ
కాటుక కళ్ల వెనుక కన్నీటిని కనబడకుండా వుంచి
అందరూ నిన్ను మెచ్చుకోవాలని బాధనంతా భరించి
త్యాగమనుకుంటూ పరువు ప్రతిష్టల బంధికానాలో
గొడ్డులా పడుండే నీకు
ఎవ్వరివ్వాలమ్మా స్వాతంత్ర్యం?
అది నీ జన్మ హక్కు!
నీ సమస్యల సుడిగుండం నుంచి బయట పడే మార్గం
నువ్వే ఎంచుకో
ఎదురీది ఒడ్డును చేరుకో
నీ శక్తిని తెలుసుకుని యుక్తిగా
నీ బాటను అడ్డుకుంటున్న ముళ్ళకంచెలను నరుక్కుంటూ
పూలబాట వేసుకో
జీవితం జీవించడానికేనని తెలుసుకో!
* * *
తిమింగలం
మట్టి ప్రమిదలో నూనెపోసి
చుట్టూ దీపాలు వెలిగించకపోయినా ఫరవాలేదు
విద్యుత్ దీపాలు తోరణాల్లా వెలిగించి
వినోదాలు చేసుకోకపోయినా నష్టం లేదు
మనసు నిండా మమతా దీపాలు వెలిగించుకుంటే చాలు
చీకటి ఊహలు చిద్రమైపోతాయి
సూర్యుడి బాణాలకి విచ్చుకున్న
పత్తికాయల్లా పగిలిపోతాయి
పాపిగా మారి దుర్మార్గాన్ని పెంచుకుంటే
అంతా పోగొట్టుకున్నట్టే
గుట్టలుగా పెరిగిన పాపాల తుట్టలు
నిన్నే కాటేస్తాయి!
పచ్చని పంట చేలలో మంటలు రేపి
మరుభూములుగా మార్చకు
బతుకులకు చితులు పేర్చి
ఏదో సాధించానని అనుకోకు!
చంపుతూ బతకాలన్న భ్రాంతిని తిమింగలమై చీలుస్తూ
నిన్నే మింగేస్తుందొక రోజు
దేముడివై నిలిచిపోవాలనే
పిచ్చి కోరిక మానుకో
మనిషితనాన్ని పెంచుతూ మనిషిలా బతకాలని కోరుకో!
తీపి చేదుల జీవితంలో -వట్టి తీపినే ఆరగించాలనుకోకు
చేదునే తీపిగా మార్చుకోవడం నేర్చుకో
* * *
నా కళ్ళు!
అన్నార్తుల ఆకలి మంటలు చూడలేక
ఆర్తితో అలమటిస్తున్నాయి నా కళ్ళు
అబలల మానభంగాలను చూసి భరించలేక బావురుమంటున్నాయి నా కళ్ళు
అంధుల చీకటి బతుకుల నాదుకోలేక
ఆలమటించిపోతున్నాయి నా కళ్ళు
దుర్మార్గుల దుదంతాలను చూసి
దుఃఖిస్తున్నాయి నా కళ్ళు
కట్నాల కోసం కట్టుకున్న ఇల్లాలిని
కాల్చి చంపే కిరాతకుల్ని చూసి
కన్నీరు కారుస్తున్నాయి నా కళ్లు
కడుపునిండా తిండి లేక కుప్పతొట్టెలోని
ఎంగిలాకు లేరుకుంటూ కడుపు నింపుకునే
కటిక దరిద్రులను చూసి
కుమిలిపోతున్నాయి నా కళ్ళు
స్వార్ధపరుల అమాయకులను చేసేదిగా
కాంచలేక కుంగిపోతున్నాయి నా కళ్ళు
ఈ సమయంలో నా కళ్ళు
వెలవెల పోతున్నాయి
వెర్రిగా చూస్తున్నాయి
గత వైభవాలను నెమరువేసుకుంటూ
తళతళ లాడలేకపోతున్నాయి
వూరి గుడిసెలముందు మురికి కాలువల మధ్య
చుక్కల్లా కొలువు తీర్చిన ఈగల గుంపుల పక్కనే
కూటికీ నీటికీ కుమ్ములాడుకునే జనాన్ని చూసి
జాలితో తడిసిపోతున్నాయి నా కళ్ళు
కలవారి మేడ మీద అందంగా అలంకరింపబడ్డ
పూల కుండీల్లోని అందాలను
వాకిట ముంగిట రంగురంగులతో తీర్చిదిద్దిన
రంగవల్లుల సొగసులను చూసి
ఆనందించలేకపోతున్నాయి నా కళ్ళు
ఐకమత్యం తరిగిపోయి అరాచకం పెరిగిపోయి
కులం పేర మతం పేర మానవత్వానికి మానవుడు
సమాధులు కడుతూ వుంటే
అభిమానం ఆదర్శం అన్నీ తుడిచిపెట్టి
అన్నదమ్ములు స్వార్ధంతో కుస్తీలు పడుతూవుంటే
చూడలేక ఆశ్చర్యంతో గుడ్లప్పగించాయి నా కళ్లు
కలత నిండిన నా కళ్లు
క్రాంతి కోసం కాంతికోసం శాంతికోసం
కలువ రేకుల్లా విచ్చుకుని
కాచుకుకూచున్నాయి
గత వైభవం తిరిగి పునఃప్రవేశం చేసి
రత్న గర్భ అయిన నా దేశాన్ని
పుణ్యభూమి అయిన నా పవిత్ర దేశాన్ని
పునీతం చేయాలని
కోట్ల ఆశలు నింపుకుని ఎదురుచూస్తున్నాయి
అంతవరకూ వేరేదీ చూడనని
అపర గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకుని
భీష్మించుకుకూర్చున్నాయి నా కళ్ళు!
* * *