Previous Page Next Page 
నేను పేజి 5


    ప్రపంచంలో ఆకలి బాధను మించింది ఇంకొకటి లేదని ఆ రోజుల్లోనే తెలిసొచ్చింది.


    "నాలుగు రోజుల్నుంచీ అన్నం లేక ఆకలితో చచ్చిపోతున్నానమ్మా. పట్టెడన్నంపెట్టు తల్లి" అని అడుక్కునే వాళ్ళ మాటల్లోని కడుపుమంట అంతవరకూ అర్థమయ్యేది కాదు. చాలా మామూలుగా అనిపించేది.     


    అమ్మా! నేనూ ఆకలిబాధకు తట్టుకోలేకపోతున్నాను.


    శరీరానికి సరైనవేళలో ఆహారం ఇవ్వలేకపోతే..... హైవోగ్లైస్ మియా.... ఆ పేరు తర్వాతెప్పుడో తెలుసుకున్నాను.... తల్లోని నరాలన్నీ చచ్చుబడిపోయినట్లు, వెచ్చటి ఆవిరి వంట్లోని అన్ని భాగాల్లోకి వ్యాపిస్తూ ఆ అవయవాలన్నీ నీరసంతో గిలగిలమంటూ, ప్రాణం అంతరించిపోతున్నట్లు....   

 

    ఒక్కోసారి తట్టుకోలేక ఏడ్చేసేదాన్ని.


    అమ్మ ఎక్కడైనా ఉద్యోగం చేద్దామనుకునేది. ఎలా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? చేత కావటం లేదు.


    ఆ పరిస్థితుల్లో నవనీతరావు.... దయారసం మా మీద ప్రసరించసాగింది. తరుచు మా ఇంటికి రావడం మొదలు పెట్టాడు. "అయ్యో! ఇన్ని కష్టాల్లో ఉన్నారా. మాకు తెలీదే" అంటూ నిజంగానే బాధపడ్డాడు.   


    మాకు కొంచెం కొంచెంగా అతణ్నుంచి సాయం లభించసాగింది.


    ఆకలి బాధ తీరుతోంది. నా చదువు కొనసాగుతోంది. అమ్మకి ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతున్నాయి.   


                                      *    *    *


    ఓ మధ్యాహ్నం స్కూల్ నుంచి తొందరగా ఇంటికొచ్చేశాను.


    తలుపులు వేసున్నాయి. తట్టబోతూ ఏదో అనుమానమొచ్చి ఆగాను.     


    వాతావరణం కొంచెం అసహజంగా కనిపించింది.


    బయట అరుగుమీద ఆలోచిస్తూ కూర్చుండిపోయాను.


    ఓ అరగంట గడిచింది. ఎదురింటివాళ్ళూ, ప్రక్క ఇళ్ళలో ఉన్న వాళ్ళూ కిటికీల్లోంచి నా వంక వ్యంగ్యంగా చూడటం తెలుస్తోంది. పడమటి వైపు జారుతోన్న సూర్యుడి తాపంవల్ల నా ముభావ స్వేద బిందువులు అలుముకుంటున్నాయి. అన్నింటిని భరిస్తూన్నట్లు అలాగే కూచున్నాను.   


    తలుపులు తెరుచుకున్నాయి.


    నవనీతరావు బయటికొచ్చాడు. నన్ను చూసి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ "అరె! ఇక్కడే ఉండిపోయావా? పిలవకపోయావా" అన్నారు.


    నేనేం జవాబు చెప్పలేదు.


    "అమ్మతో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాను భవిష్యత్ ప్రణాళిక గురించి. ఎందుకంటే..... ఏదో దారి ఆలోచించాలి కదా".


    "అవసరం కదండి" అన్నాను.


    "అవునవును. అవసరం. ఈ అవసరమనే దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లోపలికెళ్ళమ్మా" అంటూ వెళ్ళిపోయారు. ఇంట్లోకి అడుగు పెట్టాను.  


    అమ్మ గదిలో పడుకుని ఉంది. గోడవైపు తిరిగి ఉంది.


    అలికిడి విని తలత్రిప్పి చూసి, నేను కనిపించగానే ఉలిక్కిపడింది. ఆ సమయంలో నేను వస్తానని ఊహించి ఉండదు.   


    "ఎంత సేపయింది వచ్చి?" గొంతులో తొట్రుపాటు. లేచి కూచోబోతూ చీర కుచ్చెళ్లు, కొంతవరకూ జాకెట్ గుండీలు సరిగ్గా లేనందువల్ల కుదరక అలా వుండిపోయింది.    


    నిజం చెబుతున్నాను. నాకెందుకో కోపం రాలేదు. అసహ్యం వెయ్యలేదు.


    పధ్నాలుగు పదిహేనేళ్ళ వయసులో తోటి స్త్రీని అర్థం చేసుకునే స్థితికి నేను ఎదిగానా? అంతటి సహనం నాలో ఉందా? తెలీదు.   


    ఓ అరగంట తర్వాత అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది త్రాగాను. సాయంత్రం భోజనాల వేళ నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. అమ్మ తప్పించుకుని తప్పించుకుని తిరుగుతోంది.  


    రాత్రి పన్నెండు గంటలప్పుడు నా గదిలో వంటరిగా పడుకుని నిద్రపట్టక అటూ ఇటూ కదుల్తున్నాను. బెడ్ లైట్ నీలంగా వెలుగుతోంది.


    గుమ్మం దగ్గర మనిషి నీడ పడినట్లయింది.


    "ఏమిటమ్మా" అన్నాను.


    "బేబీ! నిద్రపోలేదా?" అంటూ దగ్గర కొచ్చింది.


    "లేదమ్మా" అన్నాను.


    మంచం మీద కూచుని చేతిని తన చేతిలోకి తీసుకుంది.


    "నిద్రపట్టడం లేదు కదూ"


    "అదేం లేదమ్మా ఇప్పటి దాకా చదువుకుని...."


    కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి.


    "బేబీ!"


    "ఏమిటమ్మా?"


    "నేనంటే నీకు.... అసహ్యంగా, కోపంగా ఉంది కదూ"


    "ఎందుకమ్మా"


    "జరిగింది నువ్వు అర్థం చేసుకుని ఉంటావు."


    "అంత కాని పని ఏం జరిగిందమ్మా?"


    "నేను చేసింది తప్పు కదా?"


    "తప్పు! ప్రపంచంలో ఈ పదానికిచ్చిన నిర్వచనాలన్నీ ఇంతవరకూ తప్పులేనమ్మా."


    ఆమె చేతి స్పర్శలోని ఆశ్చర్యంతో కూడిన వణుకు స్పష్టంగా తెలుస్తోంది. నీలిరంగు బెడ్ లైట్ కాంతిలో ఆమె కళ్ళలోని తడి కన్పిస్తోంది.   


    "అమ్మా!" అన్నాను మళ్ళీ.


    "నాది చాలా చిన్న వయసు. నాన్నగారు పోయేటంత వరకూ అసలీ లోకం గురించి ఏమీ తెలీదు. కుటుంబానికి ఓ దారి చూపించే లోపలే, యజమాని చనిపోవటం సంభవిస్తే.... ఎక్కడో ఆస్తి పాస్తులున్నా వారు తప్ప ఆ కుటుంబాలు వీధిన పడక తప్పదు. ఎంత చిత్రం! భర్త పోగానే అంతవరకూ ఎంతో ఉన్నత స్థానంలో ఉండి, గౌరవంగా చూడబడిన స్త్రీ ఉన్నట్లుంది అధోగతికి వెళ్ళిపోతుంది. అంతవరకూ తక్కువ స్థితిలో ఉన్నవారి దగ్గరకే సహాయం కోసం, ఆశ్రయం కోసం అర్థిస్తూ వెళ్ళాల్సి వస్తుంది."

 Previous Page Next Page