Previous Page Next Page 
గోరింటాకు పేజి 58


    ప్రభావతి ప్రాధేయపడుతున్న కంఠంతో "అబ్బ! నీకు పుణ్యముంటుంది.. లోపలకు రానియ్యి మధూ!చాలా ఆపదలో ఉన్నాను" అన్నది.

 

    అదృష్టవశాత్తూ బ్రహ్మానందం గదిలో లేడు. అతను గుండె దిటవు చేసుకుని "సరే రా!" అన్నాడు.

 

    ఆమె మెల్లగా వచ్చి తెల్లగా వెన్నెల పరచినట్లుగా వున్న ప్రక్కమీద కూర్చుంది. కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ ఆమె ముఖంలోకి చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె ఇందాకటి ప్రభావతి కాదు.... రక్తం లేనట్లుగా పాలిపోయి కళావిహీనంగా వుంది ఆమె ముఖం. వెయ్యి కష్టాలు ఒక్కసారి విరుచుకుపడినా మనిషి అంతగా మారిపోదు.      

 

    "ఏమయింది నీకు?" అనడిగాడు పాణి భయసంకోచాలతో.

 

    "నాకేదో జరుగుతుంది మధూ! నన్నర్ధం చేసుకోవు నువ్వు. నీనుండి దూరమై పోతున్నాను కానీ.. అంతా నీ చేతుల్లోనే వుంది. నన్ను రక్షించు!"

 

    ఆమె నేత్రాలు అశ్రుప్లావితాలైనాయి.

 

    "నా చేతిలో ఏముంది ప్రభా?"

 

    "లేకపోతే ఇంకెవరి చేతుల్లో వుంది? నేను నీ దాన్ని! నన్ను నీలో ఐక్యం చేసుకో. నన్నెవరో ఎత్తుకుపోదామని చూస్తున్నారు. ఈ బాధ నేను భరించలేను. విధి తన వికృతహస్తాలు విప్పుతోంది. నన్ను పెళ్లిచేసుకో మధూ! నన్ను పెళ్లి చేసుకో!"  

 

    పాణి నిరుత్తరుడైనాడు. విద్యుద్ఘాతం తగిలినట్లుగా వణికాడు. ప్రభావతి అతని ముఖంలోకి భయంగా, ఆశగా, దీనంగా చూస్తుంది.

 

    అతను మెల్లగా లేచాడు. ఎత్తయిన అతని మూర్తి అనుమాన సంకోచాలతో దహించుకుపోతుంది. చివరకు ఆమె దగ్గరకు వెళ్లాడు. పొంగిపొర్లే ప్రేమతో ఆమె భుజంమీద చెయ్యి వేయబోయాడు.

 

    ప్రభావతి పెదవులు బిగబట్టి చూస్తోంది అతనివంక.

 

    అతని వెన్నుమీద ఎవరో అజ్ఞాతవ్యక్తి కొరడాతో ఛళ్ మని చరచినట్లయింది. అదే హెచ్చరిక!

 

    "నేను తగను" అంటూ గోడవైపు తిరిగాడు.  

 

                                               17

 

    రాజారావు రెండో ఏడు పరీక్షలు రాశాడు. అతనికి తృప్తిగానే వుంది. అతను ఇదివరకు ఏ ఇంట్లో అయితే వున్నాడో... అక్కడినుండి మారలేదు. ఈ వ్యవధిలో అతను మంజువాణిని ఎప్పుడూ కలుసుకోలేదు. ఆమె భర్తకూడా అతనికి వీధుల్లోగానీ, మరి ఎక్కడా తటస్థపడలేదు.  

 

    సౌదామిని పరీక్షలయినాక అత్తవారింటికి వెళ్లిపోయింది. అక్కడినుండి ఓ ఉత్తరం మాత్రం రాసింది. విశేషాలేమీ లేవు అందులో. సమస్యల్నిగురించి చర్చాలేదు. "బావున్నాను, అలవాటుపడుతూ" అని రాసింది.

 

    బహుశా కొన్నిరోజుల్లో చక్రపాణి ఈ ఊరు రావచ్చు. అతన్ని కలుసుకుని చాలారోజులయింది. చాలా కబుర్లు వుంటాయి తమ మధ్య. అతను వచ్చేవరకు ఈ ఊళ్ళో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటమేనా లేక ఓసారి తమ ఊరు పోయివస్తే బాగుంటుందా? ఇంక ఇక్కడి జీవితం ఇంచుమించు పూర్తి అయినట్టే. కొత్త అధ్యాయం వెతుక్కోవాలి. అది ఎలా వుంటుంది? తను ఏమవుతాడు? బహుశా పరీక్ష పాసుకావచ్చని అనుకుంటున్నా. తర్వాత?   

 

    ఓసారి పాణి వాళ్ళ ఇంటికి వెళ్లివచ్చాడు. పాణి తండ్రి చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. మాటల్లో తన కొడుకుపెళ్లి తొందరలో చేసివేద్దామని వుందన్న ఉద్దేశం వెలిబుచ్చాడు.

 

    ఓ రోజు రాజారావుకు హఠాత్తుగా మంజువాణిని కలుసుకోవాలన్న ఉద్దేశం కలిగింది. ఇక్కడినుండి వెళ్లిపోయేలోగా ఆమెను ఓసారి కలుసుకుంటానని మాటయిచ్చాడు. తను మళ్లీ మళ్లీ రావటం పడుతుందో పడదో. ఇన్నాళ్లనుంచీ ఆమె ఎప్పుడూ గుర్తుకువచ్చి కలవరపరుస్తూనే వుంది మంజువాణి. ఆ రాత్రి సంఘటనను తను జీవితాంతం మరువలేడు. ఆమె తన జీవితంలో ఓ పాత్ర అయింది. ఆమెను కలుసుకోకుండా ఇన్నాళ్లూ వున్నాడంటే, ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టి పోవడానికి సన్నద్ధుడయ్యాడంటే తను చాలా శక్తిమంతుడే అయివుండాలి. పోనీ కఠినుడు.

 

    రాత్రి ఎనిమిది గంటలవేళ రిక్షామీద బయల్దేరాడు. ఇరుగూపొరుగూ చూస్తారన్న సంకోచం వుంది. అయినా అదికూడా అతిక్రమించి ఓసారి అటూ ఇటూ చూసి లోపలకు ప్రవేశించాడు.

 

    "ఎవరు కావాలండీ?" అని లోపలినుండి ఓ మృదుమధురమైన కంఠం వినిపించింది. అతను ఉలిక్కిపడి, నిల్చుండిపోయాడు. ఈ కంఠం మంజువాణిది కాదు.

 

    తలెత్తి చూడలేక "మంజువాణీ?" అనబోతూ నాలిక కొరుక్కుని ఆఫీసరుగారి పేరు చెప్పాడు.

 

    "వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండీ. ఖాళీచేసి వెళ్లిపోయారు. నెలరోజులయింది మేము వచ్చి చేరి..."

 

    "ఎక్కడకు పోయారో తెలుసునాండీ?" అనడిగాడు ఈసారి తల ఎత్తి.

 

    ఆమె తెలియదని చెప్పింది. రాజారావు వెనక్కి తిరిగి వచ్చేశాడు.

 

    ఎలా ఇప్పుడు? మంజువాణిని కలుసుకోవడం సమస్య అయింది. ఆమెను చూడాలన్నకోరిక గట్టిగా కలిగాక క్షణక్షణం ఆమె తలపుకు వచ్చి బాధించసాగింది.

 

    మరో మూడునాలుగు రోజులు అస్థిమితంగా గడిచిపోయాయి. ఓ రోజున అదృష్టం పాంచాలిరూపంలో బజారులో ప్రత్యక్షమైంది. ఆమె అతన్ని చూడలేదు "పాంచాలీ!" అని పిలిచాడు రాజారావు వెనుకనుండి గబగబ నడిచివెళ్లి.  

 

    ఆమె తల త్రిప్పి చూసి ఆనందంగా "బాబుగారా?" అంది.

 

    "నీతో కొంచెం మాట్లాడాలి..... ఆ ప్రక్కకి పోదాం రా!" అని రాజారావు ఆమెను వెంటబెట్టుకుని ఓ చిన్న సందు మొదట్లోకి వచ్చాడు.

 

    "చెప్పండి?" అన్నట్లు పాంచాలి ప్రశ్నార్ధకంగా చూసింది.

 

    "అమ్మగారెక్కడ ఇప్పుడు ఉండటం?" అనడిగాడు రాజారావు.

 

    పాంచాలి ముసిముసిగా నవ్వి "రండి... నా వెంట తీసుకుపోతాను" అంది.

 

    "అక్కర్లేదు, గుర్తుచెప్పు. ఈ పట్నంలో ఇల్లు ఏ మూలున ఉన్నా కనుక్కోగలనులే" అన్నాడు రాజారావు.  

 

    సరేనని పాంచాలి ఇల్లు ఎక్కడవుందో ఆ గుర్తులన్నీ వివరించి "వెళతారా బాబుగారూ!" అంది.

 Previous Page Next Page