ప్రభావతి నవ్వి "సరే మహానుభావా! నిన్ను పొందటం కష్టమనే అనుకుందాం. కష్టమైన పనులు చేయడం నాకు ఇష్టం" అన్నది.
"అది కాదులే! నీకర్థంకాదు."
"ఏమిటయ్యా బాబూ నీ వేదన? అసలు ఒకరికొకరు ఎప్పుడూ అర్థం కాకూడదులే!"
చక్రపాణి లేచి నిల్చుని "నీతో మాట్లాడటమంటే నాకు ఒళ్లు మంట! వెళతాను" అన్నాడు.
"చిత్తం! మళ్లీ నన్ను వెతుక్కుంటూ రావడం ఎప్పుడు?"
"ఇహ రాను."
"పోనీ.... నేనే వచ్చేదా?"
"ఎక్కడికి?"
"నీ గదికి"
"ఎందుకు?"
"ముద్దులు మూటగట్టే నీ ముఖం చూస్తూ కూర్చోవడానికి."
"మరి ఎప్పుడు వస్తావు?" అనడిగాడు చక్రపాణి కసిగా.
"రాత్రికి" ప్రభావతి కొంటెగా నవ్వుతుంది.
"ఛస్!" అని అతను అక్కడ్నుంచి గబగబా వెళ్లిపోయాడు. ప్రభావతి చెయ్యి ఊపుతూ "మధూ! మరచిపోబోకు."
"పో, పాడుపిల్లా!"
చక్రపాణి గదికి వచ్చాడు. బ్రహ్మానందం అతని ముఖంవంక చూస్తూ అలా నవ్వాడు.
"అలా నవ్వొద్దని చాలాసార్లు చెప్పాను" అన్నాడు పాణి కుర్చీలో కూర్చుంటూ.
"ఎవర్ని పాడుచేస్తున్నావు మళ్లీ?" అనడిగాడు బ్రహ్మానందం నవ్వు కట్టిపెట్టి.
"నీకు అర్థంకాదులే! నన్ను మరమ్మత్తు చేసుకుంటున్నాను - ఈ నిరంతర తపన భరించలేను."
"అందుకని ఇతరుల జీవితాలు నాశనం చేస్తావా? నీ ఆకర్షణని ఎరగా ఉపయోగించి...?"
"అదేంలేదు. నేను ఓడిపోతున్నాను.. కాదు, ఓ ఒడ్డుకు చేరుకుంటున్నాను."
"నిన్ను చూస్తే నీకు భయం వేయడంలేదా?" అనడిగాడు బ్రహ్మానందం.
"ఎందుకు? నేనేం అపరాధం చేశాను? ఈ సున్నితమైన మనసూ, ఈ వికసించని భావాలూ క్రూరంగా కనిపిస్తున్నాయా నీ కంటికి?" అడిగాడు చక్రపాణి తీక్షణంగా.
ఓ వికృత హాసం వెలువడింది బ్రహ్మానందం పెదవులనుండి - అదే జవాబు.
* * *
ఈ నవల మొదటి అధ్యాయంలో మనుషుల బుద్ధిమంతతనాన్ని గురించి ఒకరకంగా ప్రస్తావించడం జరిగింది. 'ఈ భూమ్మీద కొందరు బుద్ధిమంతులుగా వుండడానికికారణం వాళ్లకు చెడిపోవడం సాధ్యంకాకపోవటమే!' అని రాశాను. పాఠకమహాశయులు అపార్ధం చేసుకోకుండా ఉందురుగాక! కొందరు బుద్ధి మంతులంటే నా ఉద్దేశం బుద్ధిమంతుల్లో కొందరని మాత్రమే! ఏం? ముకుందాన్ని గురించి చెప్పి చాలా రోజులయింది. మరచిపోలేదు. సరైన అవకాశం లేక చెప్పలేదు.
ముకుందం..... ఆ ముగ్గురిలోకి కొంచెం పెద్దవాడయిన ముకుందం, తరచు గడ్డం పెంచడానికి అలవాటుపడ్డ ముకుందం - ఆ గది విడిచిపెట్టి ఎక్కడకూ పోలేదు. ఈ మధ్య దొరికిన ఉద్యోగం మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. గవర్నమెంట్ ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేసి పరాజయాలు పొందటమూ, ప్రైవేట్ కంపెనీల్లో నలభైకీ, యాభైకీ కుదిరి మానేస్తూ వుండటం హాబీగా చేసుకున్నాడు. చక్రపాణి ఊహించుకున్న చాలా నరకాల్లో ఎక్కడో దూరంగా ఓ పల్లెటూళ్ళో ఉన్న ముకుందం ఇల్లు ఒకటి. అతని పెళ్లానికి చాలా ఏళ్ళొచ్చాయి. తనను ఇంట్లో అందరూ కించపరుస్తున్నారనీ, తీసుకెళ్లమనీ రాసేది. అటువంటప్పుడు ముకుందం మంచి ఉద్యోగంకోసం గట్టిగా ప్రయత్నించేవాడు. చివరికి మంచి అనే మాటయొక్క తాత్పర్యం మరచిపోయిన వాళ్లలో అతను ఒకడు. చక్రపాణి, బ్రహ్మానందంల దగ్గర అడపాదడపా అయిదూ పదీ తీసుకుంటూ వుండేవాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకనాడు ముకుందం చక్రపాణి ఒడిలో బావురుమన్నాడు. పాణి అతని చేతిలోని ఉత్తరం తీసుకుని చదివాడు. అతని చెల్లెలికి పాండురోగమన్న మిషతో తానింక ఏలుకోనని మొగుడు పుట్టింటికి పంపించేశాడు. విడాకులు కూడా యిస్తానని సూచించాడు. పాణి ముకుందానికి ధైర్యంచెప్పి లాయరు దగ్గరకు పోయి సలహా అడిగొచ్చాడు. పాండురోగం భయంకరమైనదీ, అంటురోగం కాదు గాబట్టి విడాకులు యిచ్చేందుకు చట్టం ఒప్పుకోదని ఆయన ఖండితంగా చెప్పాడు. కానీ చట్టం కోర్టుల్లో వుంటుంది. ఇళ్లకు రాదుగా? అందునా ఎక్కడో పల్లెటూరిలో వున్న ముకుందం ఇంటికి. అతనుపోయి బావగార్ని బ్రతిమిలాడి, భంగపడి వచ్చాడు. పెళ్లాం మరో ఉత్తరం వ్రాసింది... ఆ ఉత్తరం చదువుకోవటం పూర్తికాకముందే తల్లికి సీరియస్ గా వుందని వైర్ వచ్చింది. అతను లబోదిబోమని మొత్తుకుని వెళ్లి, అంత్యక్రియలకోసం డబ్బు పంపమని కోరుతూ వీళ్లకు వైరిచ్చాడు. వారం రోజులయినాక చిక్కిపోవడానికి మరి చోటు లేనంతగా చిక్కివచ్చి చెల్లెలు బావిలో పడినందుకు ఊళ్లో వాళ్ళంతా అతనిమీద విరుచుకుపడి, మంచినీళ్లబావి శవం తేలటంచేత మైలపడి పోయిందని తిట్టిపోశారని చెప్పాడు.
అప్పుడిహ ముకుందం పరిస్థితి మరింత దిగజారింది. ముఖం ఎప్పుడూ కందగడ్డలా వుండేది. తనలో తను గొణుక్కుంటూ ఉండేవాడు. ఇంక అతనికి చెడిపోయే రోజులొచ్చాయని పాణి అనుకోసాగాడు.
ఓ రోజు పాణి అతనిముందు ఓ సీసా, గ్లాసూ పెట్టి "ఇది పుచ్చుకుని, మనశ్శాంతి వస్తుందేమో ప్రయత్నించు" అన్నాడు.
ముకుందం ఓ నిముషం వాటివంక సీరియస్ గా చూసి తరువాత గట్టిగా నవ్వి చేత్తో అవతలకు తోసేశాడు.
ఓ రాత్రి అతనిని కారులో ఎక్కించుకుని గానాబజానాకు తీసుకువెళ్లాడు.
అంతా చూసి "ఛీ!" అని చీదరించుకుంటూ ఇవతలకు వచ్చేశాడు.
తర్వాత ఓ రోజు అతను చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు.
ఓ రాత్రి ప్రభావతి పాణి గదికి వస్తానన్నది గుర్తుందా? పదకొండు గంటలకు తలుపు చప్పుడైతే పాణి తలుపు తీశాడు.
"మధూ!" అన్నది ప్రభావతి వణుకుతున్న గొంతుతో.
చక్రపాణి నివ్వెరపాటుతో ఓ అడుగు వెనక్కివేసి "నీకు అర్థంకాదేం? సిగ్గులేదూ ఇంత రాత్రివేళ....? నేను మధును కాదు, పాణిని" అన్నాడు.