ఆమె ఆపుకోలేని ప్రేమతో అతని ముఖంమీదకు వంగి పెదాలను ముద్దు పెట్టుకుంది.
"వద్దు!" అన్నాడు రాజారావు కళ్లువిప్పి బలహీనంగా.
ఆమె మళ్లీ ముద్దు పెట్టుకుంది.
"మంజూ! ప్లీజ్!"
ఆమె లజ్జితురాలై కొంచెం దూరంగా జరిగికూర్చుంది.
అతనామె కోమలహస్తాన్ని వణుకుతున్న తన వ్రేళ్లతో పట్టుకుని "మనం ఈ బంధాలనుండి విముక్తులం అయిపోవాలి మంజూ! తప్పదు. ఈ నా అనారోగ్యం తాత్కాలికంగా నా ప్రయాణాన్ని వారించిందంతే. మనం ఇలా పసిపిల్లల్లా ప్రవర్తించకూడదు."
ఆమె అతని హృదయంపై తల వుంచి కన్నీరు విడవసాగింది.
* * *
తెల్లవారుఝామున ఐదయింది. వాన పూర్తిగా వెలిసిపోయింది. దూరంగా అక్కడక్కడా సందడికూడా ఆరంభమయింది.
"సెలవు" అన్నాడు రాజారావు నిలబడి.
"పునర్దర్శనం?" అన్నది మంజువాణి చేతులు జోడించి.
"చెప్పలేను.... ఈ ఊరు విడిచి వెళ్ళేలోగా ఓసారి తప్పక కనిపిస్తాను."
"నామీద ప్రమాణం చెయ్యండి... చదువు పాడుచేసుకుని మట్టుకు పోనని" అన్నది మంజువాణి జాలిగా.
"అలాగే! నా మాటల్ని విశ్వసించవచ్చు."
"మీ యోగక్షేమాలు నాకు ఎలా తెలుస్తుంటాయి?"
"ఎక్కడో అక్కడ క్షేమంగానే ఉంటాను. నాగురించి మనుషుల్ని పంపక. నీకు పుణ్యముంటుంది."
ఆమె ఉదాసీనంగా నవ్వి "పంపనులెండి!" అన్నది.
ఇద్దరూ గది వెలుపలికి వచ్చి గేటుదాకా నడిచారు. "నా మనసు మీయందే!" అన్నది గద్గదస్వరంతో ఆమె లోపల నిలబడి.
"వారిని కలుసుకోవడం ఇష్టంలేకే ముందుగా వెళ్లిపోతున్నాను... వీలుంటే చెప్పు.. నమస్కారం!"
"అదేమిటి? మీరు నాకు....?"
రాజారావు కొంచెం దూరంగా పోయి, చిన్నగా నవ్వుతూ "వయసులో కొంచెం పెద్దదానివి... అందుచేత."
"మీ ఆరోగ్యం..!"
"బెంగలేదు" ఈ మాటలు మరీ దూరంగా వినిపించాయి. ఇద్దరు భార్యాభర్తలు విడిపోతున్నట్లుగా అనుభూతి. రాజారావు ఆకృతి పూర్తిగా చీకట్లో కలిసిపోయింది.
16
"నా చెయ్యిచూసి భవిష్యత్ చెప్పు? భయపడకు... గోరింటాకు పెట్టుకోలేదులే!"
"ఉహుఁ నీ చెయ్యి చూడను" అన్నాడు చక్రపాణి.
"ఎందుచేత?" అనడిగింది ప్రభావతి కనులెగురవేసి.
"నువ్వు ఒట్టి అల్లరిపిల్లవి!"
"నీకు అల్లరిపిల్లల్ని చూస్తే మహాభయం ఉన్నట్లు?"
"నువ్వు నిజాలు నమ్మవు... అబద్ధాలు నమ్ముతావు ఖర్మ."
"మధూ!"
"నా పేరు మధు కాదు..."
"మరి ఏమిటి?"
"చక్రపాణి!"
ప్రభావతి గడ్డిలో పడుకున్నదల్లా కిలకిలమని నవ్వింది. పమిటచెంగును వేలుకు చుట్టుకుంటూ "నువ్వు దొంగవి" అన్నది.
"ఒట్టి దొంగను కాదు, ఘరానా దొంగను."
"మరి నేనెవర్నో తెలుసా?"
"బంగారు పాపవి."
"ఉహుఁ"
"అప్పుడప్పుడూ గుబులు పుట్టే పెంకిఘటానివి!"
"కాదు" అని ప్రభావతి తల అడ్డంగా త్రిప్పింది.
"మరి ఇంకెవరివి? మహారాణివా?"
"కాదు... దొంగలరాణిని" అంటూ ఆమె మనోహరంగా నవ్వింది.
"మరి చెయ్యి చూడవేం?" అంది మళ్లీ.
"నేను చెప్పేవన్నీ జరుగవు... అబద్ధాలు."
"అవే భలే సరదాగా వుంటాయి" అంటూ ఆమె లేచి కుదురుగా కూర్చుని తన మృదుహస్తాన్ని అతని ముందుకు చాచి "చెప్పు?" అంది.
చక్రపాణి ఇహ విధిలేక ఆమె చేతిని తీసుకుని పరిశీలించసాగాడు.
కొన్ని క్షణాలు పోయాక "నువ్వు త్వరలో పెద్ద ఇల్లు కడతావు" అన్నాడు.
"అబ్బా! నా పెనిమిటి కట్టడన్నమాట అయితే?"
"నువ్వు 75పాళ్లు ఊహల్లో జీవిస్తావు."
"నువ్వు దగ్గరలేనప్పుడు ఊహాలోకమే శరణ్యం."
"నీలో నిరంతరం సంఘర్షణ చెలరేగుతూ వుంటుంది. అది నీ ఉజ్వల భవిష్యత్ కు పునాది."
"నీ గురించే నా సంఘర్షణ. నిన్ను పొందటమే ఉజ్వల భవిష్యత్!"
చక్రపాణి కోపంగా ఆమె చేతిని అవతలికి నెట్టి "నన్ను పొందటం అంత సులభమనుకున్నావా?" అన్నాడు.
"ఏం? నువ్వేమైనా దిగివచ్చావా పైనుండి?"
చక్రపాణి మాట్లాడలేదు.
"గర్వం నీకు - నేనే కదా అందంగా వుంటానని."
"నీతో మాట్లాడను."
"నువ్వు మాట్లాడకపోతే అన్నం, నీళ్లు మానేసి ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావా?"
"దెబ్బలాడుకుందామా మనం?"