నా మూలంగా కొన్న జీవితాలు సుఖంగా గడిచిపోతున్నాయన్న ఆనందం, ఒక కంపెనీకి జీవం పోశానన్న ఆత్మ సంతృప్తి నా బాధని మురిపించాయి.
నన్ను స్టెనోస్థాయినించి డైరెక్టరు పర్సనల్ సెక్రటరీ లెవెల్స్ కి పెంచేశారు. వెయ్యి రూపాయల జీతంనించి మూడువేల జీతం ఒక్కసారిగా పెరిగిపోయింది. అది కాక స్పెషల్ అలవెన్స్ లు, ఇంటినించి కంపెనీకి, కంపెనీనించి ఇంటికి వెళ్లడానికి డైరెక్టరు కారు పంపిస్తున్నాడు. ఇంట్లో ఫోన్....
దిసీజ్ లైఫ్.
అప్పట్నుంచే నేను నిర్ణయించుకొన్నాను. బతకడం బ్రతకడం కోసమే అన్నది నా లక్ష్యం. నా జీవితానికి నేను సారధిని"చెప్పడం ఆపి భారతివంక చూసింది శిరీష.
ఆమెకి అంతా అయోమయంగా వుంది.
తన ఎదురుగా ఒక బరితెగించిన ఆడది వున్నదనే భావనే కానీ, ఆమె ఎందుకు ఇదంతా చెపుతోందన్న ఆలోచన కలగడం లేదు భారతికి.
ఆమె మొహంలోని భావాలని చదివినట్లుగా అంది శిరీష.
"మనుషుల స్వార్ద మనస్తత్వం గురించి ఎంత చెప్పినా నీకు నమ్మకం కలగడం లేదు కదూ!
అఫ్ కోర్స్ ఎవరి రీజనింగ్ వాళ్లకి వుంటుంది .ఆ రీజనింగ్ తో తన స్థితిని కరెక్టుగా అంచనా వేసుకోగలిగితే మంచిదే! కానీ......"
"నువ్వేం చెప్పకు. నా బుర్ర తినేస్తున్నావ్. నాకు ప్రశాంత్ ఎలాంటివాడో తెలుసు. నేను అతనితో మాట్లాడాలి! ప్రశాంత్ ఎలాంటి వాడో ఎక్కడున్నాడు తను?" ఆవేశంతో అరిచింది భారతి.
"ఇక్కడే వున్నాను."
అకస్మాత్తుగా వినిపించిన ఆ కంఠస్వరం విని వెనక్కి తిరిగి చూసింది భారతి.
ప్రశాంత్!
భారతికి ఎక్కడలేని ఆనందం కలిగింది.
ఆరడుగుల అజానుభాహుడు. ఉంగరాలజుత్తు. పెదిమలమధ్య త్రిబుల్ పైవ్ సిగరెట్ పొగను కక్కుతోంది.
ఒంటిమీద షర్టులేదు. ఫాంటు మాత్రం వుంది. మెళ్లో బంగారు గొలుసు వేలాడుతోంది. గుమ్మానికి మధ్యగా నిలబడి రెండు చేతులతో గుమ్మాన్ని పట్టుకుని పొగవదులుతున్నాడు.
భారతికి పరుగెత్తు కెళ్లి అతని గుండెలమీద వాలిపోవాలనిపించింది.
"ప్రశాంత్!" అంది ఉద్వేగంతో భారతి. ప్రశాంత్ పెదిమల మధ్య సిగరెట్ ని చేతిలోకి తీసుకుని కళ్లు చిట్లించి.
"ఎవరు నువ్వు?" అన్నాడు ప్రశాంత్.
అక్కడో బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడింది భారతి. ఆమె నిర్ఘాంతపోతూ అతనికేసి చూసింది. ఆమె కళ్లనించి కన్నీరు చెంపల మీదుగా జలజల రాలిపోతోంది.
భారతికి తేరుకోవడానికి కొన్ని నిముషాలు పట్టింది.
ప్రశాంత్ తనని ఆటలు పట్టించడానికి నటిస్తున్నాడా? లేక నిజం గానే అంటున్నాడో తెలీలేదామెకు.
అది "నటనే" అయినా కూడా ఆమె భరించలేదు.
ప్రశాంత్ ఎందుకిలా చేస్తున్నాడు!శిరీష మాటలు విని అతనలా నటిస్తున్నాడా?
రెండు అడుగులు తెలీకుండానే ముందుకు వేసింది భారతి.
"నేను... నేను.. .నీ భారతిని ప్రశాంత్" అంది.
అతను అందంగా నవ్వేడు.
"భా... ర... తి.... నాకు నిన్ను ఇదివరలో చూసిన జ్ఞాపకం లేదు.
ఎప్పుడైనా ఎవరితోనన్నా కలిసి ఇక్కడి వచ్చావా?"
అతని గొంతు లోని సీరియస్ నెస్ కి ఆశ్చర్యంతో చూసింది భారతి.
"ప్ర... శాం.... త్" ఆందోళన నిండుతోన్న గొంతుతో కీచుగా అరిచింది భారతి.
ప్రశాంత్ చిరాగ్గా చూశాడామెకేసి.
"ష్. నిన్ను నేను ఏదో మోసం చేసినట్టు ఎందుకలా అరుస్తావు? నాకు చిరాకుని కలిగించకు."
"నిజంగానే అంటున్నావా? నేను నిజంగా నీకు తెలీదా?"
ఆమెకి దుఃఖం ముంచుకొస్తోంది.
"ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. వెళ్తుంటారు. అందర్ని గుర్తు పెట్టుకోలేను. సారీ!"
అతని దగ్గరగా వెళ్లింది. ఆమె కళ్లనించి కన్నీరు చెంపల మీదుగా జారిపోతోంది.
శిరీష వాళ్లిద్దర్నీ జాగ్రత్తగా గమనిస్తోంది.
"ప్రశాంత్! నువ్వు పరిహాసాని కన్నా భరించలేని మాటల్ని అంటున్నావు. నా మొహంలోకి చూసి చెప్పు. నువ్వు సరదాకి నన్ను ఏడిపించాలని అంటున్నావు కదూ!" అతని భుజాల మీద చేతులు వేస్తూ అడిగింది.
ఆమె చేతులను విసురుగా తోసిపారేశాడతను.
"నీతో వాదించేంత టైమ్ నాకు లేదు. నువ్వు వెళ్లొచ్చు." కటువుగా ధ్వనించింది అతని గొంతు.
"నువ్వు నన్ను ప్రేమించానని చెప్పావు. నిజమనుకొన్నాను. ఎన్నో ఎన్నెన్నో బాసలు చేశావు.
మనసున్న మనిషి వనుకున్నాను. కానీ నువ్వింత వంచకుడివని తెలుసుకోలేకపోయాను చీట్" అంది.