Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 6


    ప్రశాంత్ పగలబడి నవ్వేశాడు. ఆ నవ్వు మధ్యలోని కుత్రిమాన్ని చూసి శిరీషకి అసహ్యం కలిగింది. భారతిని చూస్తుంటే జాలి కలుగుతోంది.

     ప్రశాంత్ మరో సిగరెట్ వెలిగించాడు. పొగని గాలిలో విలాసంగా విడిచిపెట్టి స్టయిల్ గా నడుస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

    "భారతీ!" అతని గొంతులో హేళనని గమనించింది భారతి.

     "నీకు తెలిసిన మగాడిని నేను ఒక్కడినే కావచ్చు భారతీ! నీతో ఆడుకున్నట్టే, నేను ఎందరో అమ్మాయిలతో ఆడుకొన్నాను ఆడుకొంటున్నాను.

    జస్ట్ ఫర్ ఫాన్సీ!బట్ నాట్ ఫర్ లవ్ ఆర్ ఫర్ ఎనీ థింగ్ నీలా ప్రతి అమ్మాయి వచ్చి కన్నీరు పెట్టుకుంటే ఓదార్చడానికి నాకు టైం వుండద్దూ!

    అమ్మాయిల్ని నేను పడక గది వరకే గుర్తు పెట్టుకుంటాను.

     ఆ తర్వాత వాళ్లెవరో?

    నేనెవరో!

    గుట్టుగా పని జరగాలే తప్ప అల్లరి చేసుకుంటే ఎలా?"

    "చండాలుడా! నువ్వు నన్ను నమ్మించి నా గొంతు కోశావు."

    ప్రసాంత్ చిరునవ్వు నవ్వాడు.

     "తొందరపడి తిడుతున్నావే తప్ప నీకు తెలుసా ఓటు అడగడానికి వచ్చే నాయకులు ఓటర్లకి  ఎన్నో వాగ్దానాలు చేస్తారు. అవన్నీ ఓటర్లు నమ్ముతారు. ఓటు చేస్తారు. ఆ తర్వాత నాయకులు, ఓటర్లు కూడా ఆ వాగ్దానాలని అసలేమీ  జరగనట్టే  మరచిపోతారు. అలాగే మంచం మీద ఎక్కే ఆడదానికి ఆనందాన్ని కలిగించడానికి, సులువుగా లొంగదీసుకోడానికీ మగాడు ఎన్నో వరాలు ఇస్తాడు. కురూపిని రంభలా వున్నావని నమ్మించాలి. కేవలం పొందుకోసం ఎంత ఖరీదైన వాగ్దానాన్ని  అయినా మగాడు చేస్తాడు.

     అవన్నీ నిజమని నమ్మితే అది ఆడదాని బుద్దిలేని తనం అవుతుంది.

    దాన్నే మగాడు కాష్ చేస్తాడు.

    "అంటే?" ఉద్రేకంతో అడిగింది.

     "యూ ఆర్ ఎ బిగ్ పూల్"

    ఆమె కెక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. కొన్ని నిముషాలు ఏడ్చింది మొహాన్ని చేతుల్లో కప్పుకుని.

     "ఏయ్ ఏడవకు. ఏడుపంటే నాకు గొప్ప చిరాకు. నీ కొంపేదో మునిగిపోయినట్టు ఏడుస్తున్నావు?"

    "కొంప కాదురా! నన్నే నట్టేట్లో ముంచేశావు. కానీ నాలో పెరుగు తున్న నీ ప్రతిరూపాన్ని ఏం చేయను?"

    "ఓహ్! Iగొప్ప సెంటిమెంట్.

     కానీ నాకు అవేం లేవు.

     నీతోపాటే వాడిని కూడా నట్టేట్లో ముంచెయ్."

    ఆ మాటలకి చివాల్న తలెత్తి చూసింది భారతి.

     ఆమె కళ్లు అగ్నిగోళాల్లా మారిపోయినాయి. ఆమె శరీరం కంపించి పోసాగింది.

     ఆవేశంతో, ఉద్రేకంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడసాగాయి.

    ఆమె ఆకారాన్ని చూసి శిరీష భయపడింది.

     ప్రశాంత్ ఈసడింపుతో అన్నాడు.

     "ఏమిటే ఆ చూపు.  నువ్వలా చూస్తే నీ చూపు మహిమతో నేను బూడిదైపోతాననుకొంటున్నావా? పిచ్చిముండ! నీలాంటి వాళ్లు నా ఫింగర్ టెప్స్ మీద డాన్స్  చేస్తుంటారు!" అన్నాడతను.

     "ఒరేయ్ ప్రశాంత్! నీ పాపం పండిందిరా! నీ ప్రాణం తీస్తాను!" మెరుపులా అతని మీదకి దూకి రెండు చేతులతో అతని మెడని గట్టిగా     పట్టుకుంది. ఆమె శివ మెత్తినట్టు ఊగిపోతోంది. శిరీష చూస్తూ వూరుకుందే తప్ప కలిపించుకోలేదు.

     ఆరడుగుల మనిషి ప్రశాంత్. ధృఢమైన వాడు. పులి మీద లేడి పిల్ల తిరుగుబాటు చేస్తే ఫలితం?

    ప్రశాంత్ విసిరికొట్టాడు ఆమెని. ఆ విసురుకి భారతి దూరంగా వెళ్లి నేల పైన పడింది. నుదుటికి గుమ్మం తగిలి, చిట్లి నెత్తురు వస్తోంది.

     చేత్తో తుడుచుకొంది.

     జిడ్డుగా చేతికి తగిలిన ఎర్రని రక్తాన్ని చూసి పిచ్చిగా నవ్వింది భారతి. ఆమె గుండె లోతుల్లోంచి పొరలు పొరలుగా దుఃఖం పొర్లి పొర్లి వస్తోంది.

     "ఒరేయ్ ప్రశాంత్!

    మనిషిగా నిన్ను నేను నమ్మడం నా తప్పుకాదు.

     కానీ ఆ నమ్మకాన్ని వంచించిన నువ్వుమనిషివి కాదని రుజువు చేసుకున్నావు.

     ఆడదాని మనసు పువ్వులాంటిది. చాలా నాజూకుగా వుంటుంది. పువ్వుని నలిపితే నలిగిపోతుంది.
 ఆడదాని మనసుని  నలిపితే దాని గుండెల్లోంచి రగిలే అగ్ని జ్వాలల్లో నీలాంటి కామాంధులు కాలి మసై పోతారు.

     ఆడదాని కన్నీరు ఊరికేపోదురా! అది పెట్రోలై భగ్గుమని మండి నీప్రాణాల్సి తీస్తుంది.

     ఇదే నా శాపం. ఆడదాన్ని ఆటబొమ్మలా వాడుకొని నీ అవసరం తీరేక చులకనతో  విసిరికొడుతోన్న నువ్వు ఏదో ఒక రోజున ఆడదాని చేతిలోనే ఛస్తావు!"

    ప్రశాంత్ కళ్ళల్లో ఎర్రని జీరలు రూపుదిద్దుకున్నాయి.

     భారతి ముందుకి  గెంతి ఆమె జుత్తుని  చేత్తో పట్టుకున్నాడు.

 Previous Page Next Page