Read more!
 Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 4


    శిరీష తాగి వాగుతోందనుకోడానికి వీలులేదు. ఆమె మాట్లాడే ప్రతి మాటలోనూ అక్షరసత్యం గోచరిస్తోంది భారతికి.

     శిరీష బాటిల్లోంచి విస్కీని గ్లాసులోకి వంపి నీళ్ళు కలపకుండానే సిప్ చేసింది. గొంతు మండినట్టుంది. కళ్లు మూసుకుందో క్షణం.

     "నా సంగతి తర్వా. ముందు మననం ఆలోచించాల్సింది నీ గురించి ఎందుకో తెలుసా?

    నువ్వు తల్లి దండ్రులచాటు ఆడపిల్లవి. నరనరానా సెంటిమెంటు జీర్ణించు కొనిపోయిన దానివి.  నీలాంటి వాళ్లకి ప్రశాంత్ లాంటి వ్యక్తులతో పరిచయమే  పెద్ద తప్పు. అసలీ రొంపిలో దిగడమే నువ్వు చేసిన బ్లడీ బ్లండర్.

    మించిపోయింది లేదు బారతీ.

     మనసుని రాయిచేసుకుని నిజాన్ని గొంతుదాటి బయటికి చెప్పకుండా మింగేయి.

     గతం తాలూకు నీడని సైతం నీమీదపడకుండా జాగ్రత్త పడు"

    "ఎలా జాగ్రత్తపడేది!" నిర్వేదంగా అన్నది భారతి.

     శిరీష నవ్వింది. ఆ నవ్వులో బాధ తొంగిచూసింది. ఏదో విషాదం ... కనిపించీ కనిపించనట్టు.
     ఆమె చేతిని భారతి భుజంమీద వేసింది. "నీకంటూ ఓ అమ్మ, ఓ నాన్న, ఇంకా 'నీవాళ్లు' అని చెప్పుకోదగ్గవారున్నారు భారతీ!

    నాకెవ్వరూ లేరు.

     నా ఆనందంలో భాగం పంచుకోడానికీ లేరు. నా బాధనిచూసి ఓదార్చేవారు లేరు.

     నేనొక్కదాన్నే! ఒంటరిదాన్ని. తెగించిన దాన్ని.

     జీవితాన్ని ఓ చాలెంజ్ గా తీసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్న ఓ దురదృష్టవంతురాలిని.

     కష్టంవస్తే ఆదుకొనే వారు నాకు లేరు.

     కానీ...........

    నీకు నీవాళ్లంటూ వున్నారు. " శిరీష గొంతు కాస్త వణికింది.

     "శిరీషా!" ఉక్రోషంగా పిలిచింది భారతి . శిరీష కళ్లెత్తి ఆమెకేసి చూసింది.

    "నువ్వు నన్ను ఎందుకిలా డిస్ కరేజిచేసి చంపుతున్నావో అర్దం కావడం లేదు. తాగి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా దారిన నేను పోతాననుకోకు.

     నా ప్రశాంత్ మనసు బాగా నాకు తెలుసు.  అతన్ని నేను కలుసుకోడం కూడా నీకు ఇష్టం లేనట్టనిపిస్తోంది." అంది భారతి ఉక్రోషంగా దాంతో శిరీష పగలబడి నవ్వేసింది.

     "అలా అనుకొంటే నువ్వు బిగ్ పూల్ వని చెప్పక తప్పదు. ప్రశాంత్ నీలాంటి వాళ్లనీ,  నాలాంటి వాళ్లనీ పెళ్లి చేసుకోడు."

    "నీ దారిన నిన్ను పంపించేసి ప్రశాంత్ ని నా కొంగుకి కట్టుకోవాలని చూస్తున్నట్టుగా నువ్వనుకొంటున్నావు. యూ ఆర్ ఫూల్ భారతీ! నా లైఫ్ నీకు తెలీదు.

     నేను అనాధని.

     ఎవరో హాస్టల్లో చేరిపిస్తే అక్కడే పెరిగాను. చదువుకొన్నాను.

     ఇప్పుడు నేను జాన్సన్ అండ్ జాన్సన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ వైజాగ్ లో పని చేస్తున్నానని చెప్పాను.
     ముందు ఆ కంపెనీలో స్టెనోగా చేరాను. నేను బ్రతకడం కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎంతైనావుంది.ఎంత కష్టపడితేనో నాకా ఉద్యోగం దొరికింది.

     జీవితం సాఫీగా సాగిపోతుందనుకొన్న సమయంలో  మా కంపెనీ ఓ క్లిష్టపరిస్థితిలో ఇరుక్కుంది. కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది. గోడౌన్స్ అన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.

     కంపెనీ నిర్లక్ష్యంవల్లనే గోడౌన్స్ కాలిపోయాయని  ఇన్స్యూరెన్స్ వాళ్లు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. మా ఎం. డి. కోరిక పైన ఇన్సూరెన్స్ కంపెనీ ఎంక్వైరీ ఆఫీసర్ని ఎపాయింట్  చేసింది. ఆఫీసరు  మా కంపెనీకి వచ్చాడు.

     ఆ ఆఫీసరుగాడి  చూపు నామీద పడింది. అన్ని మర్యాదలతోపాటు నన్ను గదిలోకి పంపమన్నాడు.
 
     డైరెక్టర్  నన్ను పిలిచి విషయం చెప్పాడు. దిక్కుతోచని స్థితిలో నేను ఖిన్నురాలినైపోయాను. ఆ మాటలు విని ఏం చేయాలి?

    "చూడు శిరీషా! నువ్వు "ఉ" అంటే ఈ కంపెనీ తిరిగి కళ కళ లాడుతూ నడుస్తుంది. లేకపోతే కంపెనీ మూతపడిపోతోంది. నీ సమాధానం మీద  కంపెనీ భవిష్యత్తు మరెందరి బతుకులో ఆదారపడి వున్నాయి. నిన్ను అడగడం అధర్మమే.  కాదనను.  అందుకే అర్దిస్తున్నాను" అన్నాడు డైరెక్టరు.

     వెంటనే ఏం మాట్లాడ్డానికీ తోచలేదు. ఎంతటి విషమ పరిస్థితిలో నేనున్నదీ నాకు తెలుసు.

     ఈ ఉద్యోగం లేకపోతే నా పరిస్థితి ఏమిటి?

    దీనికోసమే ఎన్నో అవస్తలు పడాల్సి వచ్చింది. మళ్లీ రోడ్డెక్కితే నాకు తిరిగి బతుకు దొరుకుతుందా? మగాడు ఉద్యోగం కావాలంటే లంచం ఇచ్చుకోవాలి.  ఆడది ఉద్యోగం కోసం వెళితే మంచం ఎక్కమంటారు కొందరు.

    ఇంతకాలం పదిలంగా దాచుకొన్న నా శీలాన్ని ఇక్కడ కాకపోతే ఇంకెక్కడయినా ఎవరో ఒకరికి అర్పించక తప్పదు. ఒంటరి ఆడదాన్నాని తెలిసాక జాలిపడి  సాయంచేసే వాడెవడూ వుండడు ప్రతిఫలం  లేకుండా. అందుకే ఇంతకాలం పోషించిన కంపనీ కోసం,  తోటి ఉద్యోగుల బ్రతుకుతెరువుకోసం, డైరెక్టర్ కి నా అంగీకారాన్ని "ఉ" అనే ఒక్క అక్షరం ద్వారా తెలిపాను.

     అంతే!అంతే!

    అదే! జీవితంలో మొదటిసారిగా నా కన్యత్వాన్ని ఆ ఆఫీసరుగాడిదకి అర్పించిన రోజు. అందుకు నేను ఏనాడూ బాధపడలేదు.

 Previous Page Next Page