కొలిమిలో కాలితేనే!
వెన్నెల జలతారులను ఒంటినిండా కప్పుకుని
వేంచేసిన ఆకాశరాజు
వెండి దారాల కంబళ్ళు అల్లి
గుండె గుండెలో చలువ పందిళ్ళు వేసి కవ్వించినా
తనకీ తెలుసు తన క్షీణ దశ మర్నాటి నుంచే ప్రారంభమని
అయినా వెన్నెల దీపాన్ని వెలిగించక మానడు నెలరేడు
ఎంత విశాల హృదయ మతనిది?
క్షీణించినా సరే పిదప
ముందుగా రాణించాలనే తపన అది
మానవ జీవితాలలో క్షణమైనా తానే వెలుగైవ్యాపించి
తీయని గుర్తుగా మిగిలిపోవాలనే ఆరాటం అతనిది!
నీలిగగనంలో తెప్పలా తేలిపోయే తెలిమబ్బులు
ఒక్కసారే నేలను స్పర్శించి
ఆమని అందాలను తిలకించి పులకించిపోవాలని
కాస్సేపయినా పుడమితల్లిని చల్లని తేమతో నింపెయ్యాలనే కోరిక
ధరణిని దర్శించగానే తన ఉనికే ఉండబోదన్న సత్యం
తెలిసినా సరే మబ్బులు కెందుకో అంత ఉబలాటం
భువికి జాలువారక మానవు
ఎంత ఉదార స్వభావం వాటికి?
క్షణికమైన పృథ్వితో తమ మైత్రిని నిలుపుకోవాలని ఆ పరుగుల పోరాటం!
మండు టెండలు మడ్చేస్తున్నా
గ్రీష్మ తాపం గొంతు తడినార్పేస్తున్నా
త్రాగడానికి గ్రుక్కెడు నీళ్లు లేక
గున్న మామిడి వాడి వడలిపోతున్నా
మేయడానికి మావిచివురులు పసరులేక ఎండిపోతున్నా
కోయిలమ్మ వగరాకు విందుకే మురిసిపోతూ
గళసీమ దాటి గంధర్వలోకాలు మేలుకునేలా
రాగాలు వినిపించక మానదు
దానికెంత గొప్ప బుద్ధి?
మానవాళిని మనసారా తృప్తి పరచాలని!
మనిషి మాత్రం క్షణం క్షణం మారుతాడు
మాట తప్పుతాడు మమత చంపుకుంటాడు
తన స్వార్ధంకోసం మారణహోమానికైనా సిద్దపడతాడు
వెన్నెలకీ వసంతానికీ,
మబ్బుకీ మనిషికీ ఎంత తేడా!
త్యాగం వాటి లక్షణం
స్వార్ధం మానవుడి విలక్షణం!
ఎన్ని వసంతాలు తొంగిచూసినా
ఎన్ని మబ్భులు వెండి బిళ్లల్లా భూమి పైకి దుమికినా
అన్ని రుచుల ఉగాది పచ్చడి
ఎంత వేదాంతాన్ని రంగరించి తినిపించినా
స్వార్ధాన్ని రుచి చూసి ధన పిపాసతో
దప్పిక తీర్చుకునే వ్యక్తికి
ఇవన్నీ శుష్కనినాదాలే!
మెట్ట వేదాంతాలే !!
ఎదురు దెబ్బలు తింటేనే ఎంత వారైనా మారేది
కొలిమిలో కాలితేనే ఇనుమైనా వంగేది
* * *
పండగ
ఉగాదైనా మరేదైనా
కొత్త అనేది రోజులో లేదు
సంవత్సరంలో లేదు -
సూర్యుడు కొత్త రంగు పులుముకొస్తాడా
గాలి కొత్త వాసనలు చిమ్ముకొస్తుందా
అవే పూలు అవే కాయలు
అవే రుచులు అదే గతులు
మనిషి కోరుకునే కొత్తదనానికి
ముద్దు పేరు - పండుగ!
రొటీన్ జీవితం బోరుకొట్టక
బయట పడే మార్గం - పండుగ!
తనను తానే నియమ నిబంధనల హార్మ్యాన్ని
నిర్మించుకోవడానికి దోహదం - పండగ
స్నేహ సంపదను పంచుకోవడానికి
'పొదుగు' -పండగ
నూతనత్వం గుండెనిండా
అడుగడుగునా నింపుకుంటూ
కష్టసుఖాలను సమంగా ఎంచుకుంటూ
సాగిపోయే బాటసారికి
ప్రతి నిత్యం పండగే -
మనిషిగా జీవించడమే
మనకు అసలైన పండగ
* * *
అమ్మ అంటే ఎవరు?
అమ్మ అంటే
నీకు జన్మ నిచ్చిన పునీత!
నవ మాసాలు మోసి
తన రక్తాన్ని నీకు పంచి
ప్రాణం పోసిన దేవత!
తన ఒడి నిన్ను భద్రంగా
దాచుకునే గుడి
నీకు మాట నేర్పేబడి
అది నీకు నడక నేర్పే మైదానం
నీకు నడత నేర్పే విద్యాలయం!
అమ్మ పెట్టే ముద్దు కొండంత హాయినిస్తుంది
అమ్మ కౌగిలింత నునువెచ్చగా చుట్టుకుంటుంది
అమ్మ తలపే ఒక ఊయల
బొమ్మగా చేసి నిన్ను ఊగిస్తుంది
అమ్మ పిలుపే ఒక పాట
పలికిస్తుంది వేనవేల రాగాలు నీనోట
ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా
అమ్మా అనే మాట
అలుపు తీరుస్తుంది
ఆనందాన్నిస్తుంది
మకరందంలోని తీయదనంలా మమతను పంచుతుంది
అమ్మ రూపం కనిపించే దైవం
అమ్మలో ఒక భాగం జీవమున్న మనం
అందుకే -
అమ్మని అవమానపరచకు
అవస్థ పెట్టకు
పాలు తాగిన రొమ్మునుంచి
రక్తాన్ని పీల్చకు
గుండె గాయపరచకు
ఆమెకు పెట్టే పట్టెడు మెతుకులకు
లెక్కలు కట్టకు!
* * *