ఈ మెట్లు ఎక్కి స్వర్గాన్ని చేరుకోవాలని ఆశపడ్డాడా? ఆ రాజెవరో? అది నిజమే అయివుంటుంది? కట్టు కథా ?
బైబిల్ లో చెప్పబడిన ఒక ఉదంతం గుర్తువచ్చింది సందీప్ కి. అందులోనూ అంతే! ఒక రాజు ఆకాశాన్ని అందుకోవాలనే ఆశతో బ్రహ్మాండమైన గోపురం నిర్మించాడు. "టవర్ ఆఫ్ బేబుల్!" అంటారు దాన్ని.
"పైనున్న ఆ చిన్న మందిరంలో ఉంటాయి రాకుమారి బంగారు విగ్ర్రహం. అందులో మమ్మీ!" అన్నాడు భూతాలరాజు. భయంతో అతని గొంతు పిడచగట్టుకుని పోతుంది.
వళ్ళు గగుర్పొడిచింది సందీప్ కి. గమ్యం చేరుకున్నాడా తను? రాకుమారి విగ్రహం, మమ్మీ అనేది నిజమో వదంతులో ఇంక కొద్దిసేపటిలో తెలిసిపోతుందా తనకు?
నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు అవి వదంతులే అయి ఉండవచ్చు!
మిగతా ఒక పాలు?
ఉద్వేగంతో అతని గుండె గబగబ కొట్టుకోవడం మొదలెట్టింది.
"రా రాజూ !" అన్నాడు.
ఒక్కసారిగా కంపించాడు రాజు. "నేను రాలేను! నువ్వే వెళ్ళు!"
"సరే మీరిద్దరూ ఇక్కడే ఉండండి!" అని హెచ్చరించి మెట్లక్కడం మొదలెట్టాడు సందీప్. దూరంనుంచీ చూస్తే చిన్న మెట్లలాగే ఉన్నాయి గానీ, దగ్గరగా వచ్చాక అవి ఒక్కొక్కటీ రెండు అడుగులు ఎత్తున బండలు అమర్చి నిర్మించినవని తెలిసింది. చాలా ప్రయాసగా ఉంది ఎక్కడం.
సగం ఎక్కితే, ఆయాసం తీర్చుకోవడానికి ఆగి, కిందకు చూశాడు. చీమల్లా కనబడుతున్నారు స్వప్నా, భూతాలరాజూ.
పైకి వెళ్ళినకొద్దీ మెట్లకు అమర్చిన రాళ్ళు లూజుగా కదులుతున్నాయి. ప్రతి అడుగూ చూసి చూసి వెయ్యవలసి వస్తోంది.
చివరిమెట్టు చేరుకునేసరికి అతని వళ్ళు స్నానం చేసినట్లు అయిపోయింది స్వేదంతో. షర్టు ముద్దగా తడిచిపోయింది. నుదిటి మీదినుంచీ కళ్ళలోకి ధారగా కారుతోంది చెమట.
వేళ్ళతో కళ్ళు నులుముకుని చూశాడు.
మందిరం మధ్య పెద్ద పాలరాతి అరుగు ఉంది, అంతే!
విగ్రహంగానీ, శవపేటికగానీ లేవు అక్కడ!
జాగ్రత్తగా పరికించి చూశాడు సందీప్. ఏదో పేటికను చిరకాలం క్రితమే ఎవరో పెకలించుకు పోయినట్లు ఆనవాలు తెలుస్తోంది అరుగుమీద.
నిరుత్సాహంగా మందిరం బయటకు వచ్చి కిందకి చూశాడు. స్వప్నా, భూతాలరాజు అసలు కనబడటమే లేదు. అంత ఎత్తులో ఉన్నాడు తను. ఇంకొక అడుగు ముందుకు వేసి, ఒంగి చూశాడు.
ఎక్కడో చిన్న గులకరాయి దొర్లిన శబ్దం. మెల్లిగా మరో పెద్దరాయి కదిలింది.
ఉన్నట్లుండి ముందుకు తూలాడు సందీప్. అతని కాలికింద ఉన్న మెట్టు కృంగిపోయింది. అతను కాలుజారి అమాంతము ముందుకు పడిపోయాడు.
మడుగులో మొసలి
పడీపడగానే అలర్టుగా ఉండే అతని మెదడు పక్కకి దొర్లమని హెచ్చరించింది.
శరీరాన్ని గాలిలోనే ఒడుపుగా తిప్పి, మెట్ల పక్కన ఉన్న జారుడు బండలాంటి దానిమీద పడ్డాడు సందీప్. శరవేగంతో కిందికి జారిపోవడం మొదలెట్టాడు క్షణక్షణానికీ వేగం పెరుగుతోంది.
ఈ గోపురం పేరు స్వర్గానికి నిచ్చెనట. ఇప్పుడు తను జారుతున్న దానిని నరకానికి జారుడుబండ అని అనవచ్చా? ఇలా వేగం పుంజుకుంటూపోతే, భూమిని తాకేసరికి తన వేగం ఎంత ఉంటుంది? ఎన్నివేల ముక్కలవుతుంది తన శరీరం?