Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 48

సమాధానం చెప్పకుండా అదోరకంగా నవ్వింది స్వప్న.
ఎక్కడినుంచో చల్లటిగాలి వీచినట్లయింది. వెన్నులో నుంచీ చలి పుట్టుకొచ్చినట్లయింది సందీప్ కి. ఒళ్ళు జలదరించింది.
గుహకి రెండోవైపున ఉన్న ద్వారంలోనుంచీ వస్తున్న వెలుగు వెండి కంచంలా కనబడుతోంది. దగ్గరకు వెళ్ళినకొద్దీ మరింత పెద్దదిగా, మల్లెపూల దండలా అయి, వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లు కనబడింది.
మరికొంచెం దగ్గరికి వెళ్ళాక అది చాలా పెద్దదిగా, వెండితెరలా కనబడడం మొదలెట్టింది.
ఆ తెరమీద కనబడుతున్నాడు భూతాలరాజు.

                                            స్వర్గానికి నిచ్చెన

"దేవాంతకుడివి నువ్వు!" అన్నాడు భూతాలరాజు, ప్రశంసాపూర్వకంగా సందీప్ ని చూస్తూ. అతని భుజాలమీద సందీప్ తాలూకు సామాగ్రి ఉన్న మూడు సంచులు ఉన్నాయి.
"ఇన్నాళ్ళు నువ్వు పిల్లకాకి వనుకున్నాను. కాదనీ, నువ్వు పులిబిడ్డవనీ ఇప్పుడు తెలిసింది. ఇంక ఇప్పుడు నీతోబాటు నరకానికి రమ్మన్నా నిస్సంకోచంగా వస్తాను. పద!"
"థాంక్స్! నువ్వూ స్వప్నా చెరోవైపూ పారిపోతారేమో అన్న ఆదుర్దా లేకపోతే మరింతగా మనసు కేంద్రీకరించి గమ్యం వైపు సాగిపోగలను" అన్నాడు సందీప్ రిలీఫ్ గా.
"కనబడని సిల్కు దారాలతో నన్ను బంధించేసి ఇంక పారిపొమ్మని వదిలేసినా ఎలా పారిపోగలను?" అంది స్వప్న వినీవినబడకుండా. ఆమె సందీప్ ని ఆనుకుని నడుస్తోంది.
అతను స్వప్నవైపు చూశాడు. ఇద్దరి చూపులూ కలిసి మౌనంగానే మాట్లాడుకోవడం మొదలెట్టారు.
చాలాదూరం నడిచిన తర్వాత ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగాడు సందీప్. "సారీ! సంచులు మూడు నీచేతే మోయిస్తున్నాను." అంటూ భూతాలరాజు దగ్గరనుంచీ ఒకటి తను తీసుకొన్నాడు. మరొకటి స్వప్న తీసుకుంది.
రొప్పుతున్నాడు రాజు. "మీరిద్దరూ ఇంత త్వరగా ఈ ప్రపంచంలోకి వస్తారనుకోలేదు" అన్నాడు రొప్పుతూ.
స్వప్న అందంగా సిగ్గుపడింది.
మళ్ళీ నడక మొదలెట్టాక "అసలు నువ్వెలా తప్పించుకున్నావ్ రాజూ?" అన్నాడు సందీప్.
ఈ భూతాలరాజుని అంత తక్కువగా అంచనా వెయ్యకు కుర్రాడా? మహా మహావాళ్ళనే చూశాను నేను! ఈ అడంగులోలెక్కా? నేను వాళ్ళ కళ్ళలో కారంకొట్టి కాళ్ళకు బుద్ధి చెప్పాను. నువ్వు ఆ బావిలో దిగుతూ ఉండడం కనబడింది. చాలాసేపు వెదికితే, ఈ రెండో మార్గం కనబడింది. నువ్వు కేటుగాడివి కాబట్టి ఎలాగోలా తప్పించుకుని ఇటే వస్తావనిపించింది. ఇక్కడే కాచుకుని నిలబడ్డాను" అని, చాలా నిజాయితీగా చెప్పాడు. "ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోగలిగాను నేను. అది గొప్ప కాదు! సందీప్! ప్రమాదాన్ని వెదుక్కుంటూ బావిలో దిగావు నువ్వు! అది మొగతనం! మొనగాడితనం!"
"ఇతను నావాడు!" అన్నట్లు సగర్వంగా సందీప్ వైపు చూసింది స్వప్న.

                            *    *    *    *

ఒక రోజంతా నడకసాగింది.
"అదిగో! ఆ కనబడుతున్నదే బొమికెల దిబ్బ!" అన్నాడు రాజు. అతని గొంతులో మళ్ళీ కొద్దిగా భయం చోటుచేసుకుంది.
చాలా దూరంలో ఒక బురుజులాంటి కట్టడం కనబడుతోంది. ఆకాశాన్ని అందుకుంటున్న టీవీ టవర్ లాగా ఉంది అది. దాన్ని సమీపిస్తున్నకొద్దీ దానికి ఉన్న అసంఖ్యాకమైన మెట్లు కనబడ్డాయి. ఆపైన చిన్న మందిరంలా ఉంది.
వింతగా ఉంది ఆ కట్టడం. దానిని ఎవరు ఎందుకు కట్టి ఉంటారో అర్థంకాలేదు సందీప్ కి.
"దాన్నే, స్వర్గానికి నిచ్చెన అంటారు." అన్నాడు రాజు. "ఇదివరకు ఈ ప్రాంతాన్ని పాలించిన తిక్కరాజు ఒకడు బొందితో స్వర్గానికి చేరుకోవాలని వెర్రి ఆలోచన వచ్చి ఇది కట్టించాడని చెబుతారు. ఆయన కూతురే మమ్మీగా మార్చబడిన రాకుమారి."
"ఫన్నీ!" అంటూ మెడ పైకెత్తి చూశాడు సందీప్. మేఘాలతో రహస్యాలు చెబుతున్నంత ఎత్తుగా ఉంది ఆ గోపురం. కొన్ని వేలమెట్లు ఉన్నాయి దానికి. మెట్లకు రెండువైపులా, గచ్చుతో నున్నగా జారుడుబండలా చేసి ఉంది.

 Previous Page Next Page