కానీ, ఇది కొంతలో కొంత నయం! మెట్లమీదే పడి దొర్లుతూ ఉంటే తల బండలకు తగిలి బద్దలయి ఉండేది. ఈ పాటికే మరణించి ఉండేవాడు తను. ఇలా దీనిమీదకి ఒరగడంవల్ల తక్షణ ప్రమాదం తప్పింది. కొంచెం ఆలోచించుకునే వ్యవధి దొరికింది. ఇప్పుడు ఈ విపరీతమైన వేగాన్ని తగిలించుకోవాలి. ఎలా? ఎలా?
ఆలోచన ఒక రూపు దిద్దుకునే ముందే భూమిని సమీపించేశాడు సందీప్.
అక్కడ అర్థ చంద్రాకారంగా కొంచెం పైవైపుకి ఒంపుతిరిగింది జారుడుబండ. అందువల్ల భూమిని తాకకుండా, రాకెట్ లా గాలిలోకి దూసుకుపోయాడు సందీప్.
ఆ తర్వాత పెద్ద శబ్దం! ఊపిరాడకుండా తన చుట్టూతా నీరు! ఆకాశంలోకి ఎగిరిన నీటి తుంపరలు మళ్ళీ కిందకి దిగుతున్న సవ్వడి!
నీళ్ళలో పడ్డాడు తను! నీళ్ళలోనుంచీ పైకి తేలి, తల విదిలించి, చుట్టూ చూశాడు సందీప్. ఆ మెట్లకి ఎదురుగానే చిన్న కొలను ఉంది. సరాసరి అందులో పడ్డాడు తను, ఘోరమైన ప్రమాదం తప్పింది!
కానీ అతని సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. నీళ్ళలో నుంచీ బయటకు వచ్చి చూస్తే స్వప్న, భూతాలరాజూ కనబడలేదు!
ఏమైనారు వీళ్ళు ?
ఆదుర్దాగా చుట్టూ చూశాడు సందీప్. నేలమీద, మెత్తటి దుమ్ముపొరలో స్పష్టంగా కనబడుతున్న అయిదారు జతల బూట్ల గుర్తులు. అతని దృష్టిని ఆకర్షించాయి. బూట్ల అడుగు భాగంలో డిజైను క్లియర్ గా కనబడుతోంది.
వాటిని గుర్తుపట్టాడు సందీప్. తమకంటే ముందే వెళుతూ, బ్రిడ్జిని పేల్చేసి తమని అటకాయించాలని చూసిన రెండో బృందం వాళ్ళని ఆ అడుగుజాడలు!
వాళ్ళు ఇక్కడికికూడా వచ్చారన్న మాట ! స్వప్ననీ, భూతాల రాజునీ వాళ్ళు పొంచిపొంచి సమీపించారని అడుగుజాడల ద్వారా తెలుస్తోంది.
ఒకచోట గజిబిజిగా అలుక్కుపోయి ఉన్నాయి కాలి గుర్తులు. అక్కడ పెనుగులాట జరిగి ఉండాలి.
కానీ విచిత్రం ఏమిటంటే, అక్కడ నుంచీ అందరి అడుగుజాడలూ మంత్రించినట్లు మాయమైపోయాయి!
సందీప్ నీ, భూతాలరాజునీ పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎటువెళ్ళి ఉంటారో ఊహకు అందడం లేదు!
చాలాసేపు తీవ్రంగా వెదికాడు సందీప్. అసలు ఇది ఎలా సంభవం? మనుషులు ఉన్నట్లుండి గాలిలో కలిసిపోరు గదా? ఇక్కడే ఎక్కడో వుండి తీరాలి వాళ్ళు.
ఏదో స్ఫురించినట్లు చెట్లమీదకి చూశాడు సందీప్. అక్కడకూడా ఎవరూ లేరు.
నొసలు ముడివేసి ఆలోచిస్తూ, ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా వెదికాడు సందీప్. లాభం లేకపోయింది.
సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఆలోచనతో, ఎండ వేడిమితో, మెదడు మసిలి పోతున్నట్లు అనిపించింది. వళ్ళంతా చిరాగ్గా ఉంది. స్నానం చేస్తేగానీ ప్రాణం తేరుకోదేమో అనిపించింది.
కొలను ఒడ్డును నిలబడి, డైవ్ చేసి నీళ్ళలోకి దూకాడు. దూకుతుండగానే అతనికి మిస్టరీ విడిపోయినట్లు అనిపించింది. జరిగినదేమిటో అర్థం అయింది.
విగ్రహం కోసం తమకంటే ముందే వచ్చిన ఆ రెండో గ్యాంగు సైలెంటుగా స్వప్ననీ, భూతాలరాజునీ బంధించి, వాళ్ళని ఈ నీళ్ళలోకి విసిరేసి ఉంటారు. ఆ వెనకనే తాము కూడా దూకి ఉంటారు. అందుకనే అడుగుజాడలు అదృశ్యమై పోయాయి.
ఈ నీళ్ళ అడుగున స్థావరం ఏదన్నా ఉందా ?
నీళ్ళలోకి దూకగానే ఏదో అదృశ్య శక్తి అతన్ని తనవైపు లాగేసుకుంటున్నట్లు ఫీలయ్యాడు. మొదటిసారి అతను నీళ్ళలో పడ్డప్పుడు కూడా అలా లాగివేయ బడుతున్నట్లు అనిపించింది గానీ అతను అంతగా పట్టించుకోలేదు.
అతికష్టం మీద కంట్రోలు చేసుకుని, అదేమిటో చూశాడు. చాలా పెద్దమొసలి. తల మాత్రమే కనబడుతోంది. నోరు తెరచి బద్ధకంగా చూస్తోంది. రంపంలా కనబడుతున్నాయి దాని పళ్ళు.
ఉన్నట్లుండి వశంతప్పి దాని నోట్లోకి వెళ్ళిపోయాడు సందీప్. దాని కోర ఒకటి అతని భుజాన్ని చీల్చింది. గాయం నుంచీ ప్రవహిస్తున్న రక్తంతో నీళ్ళు ఎర్రబడ్డాయి.
'అయిపోయింది !' అనుకున్నాడు సందీప్. పెద్ద భోషాణం పెట్టి మూతమూసినట్లు ఈ మొసలి నోరు మూసేసుకుంటుంది. ఎముకలు పటపటలాడిపోతూ ఉండగా దాని కోరల మధ్య నలిగి, దాని కడుపులోకి జారిపోతాడు తను.