"హంబక్ కాదు సందీప్! మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ శరీరంలో నుంచీ వెలువడుతోంది. అత్యంత వేగంతో ఇలాంటి గుహలాంటి దానిలో నుంచీ పయనించి, తర్వాత అదిగో అక్కడ కనబడుతుందే వెలుగు.
అలాంటి వెలుగును చేరుకుంటుంది.
అపనమ్మకంగా నవ్వాడు సందీప్.
అతను ఇలాంటివి సీరియస్ గా తీసుకోడు!
"ఐసీ! నువ్వే స్వయంగా వెళ్ళి చూసి వచ్చినంత ఇదిగా చెబుతున్నావే?"
సీరియస్ గా చూసింది స్వప్న.
"నేను చూడలేదు! కానీ చదివాను!"
"దెయ్యాలు కూడా పుస్తకాలు రాస్తున్నాయని ఇంతవరకూ తెలియదు నాకు!"
అసహనంగా అంది స్వప్న. "అలా వితండంగా మాట్లాడకు! డాక్టర్ రేమాండ్ మూడీ రాసిన 'లైఫ్ ఆఫ్టర్ లైఫ్' చదివావా?"
"అంతకంటే మంచిపనులు చాలా ఉన్నాయ్ చెయ్యడానికి."
"చనిపోయి కొన్ని పరిస్థితులలో తిరిగి బ్రతికిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఒక పుస్తకం రాశాడు డాక్టర్ రేమాండ్ మూడీ!"
"బుల్ షిట్! చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతకడమా ?"
"భూతాలరాజు నామీద అఘాయిత్యం చెయ్యబోయినప్పుడు నాకు షాక్ తో ఊపిరి ఆగిపోతే, నువ్వు ఆర్టిఫీషియల్ రిసస్టికేషన్ చేసి శ్వాస ఆడేటట్లు చేశావా లేదా? అలాగే కొన్ని కేసుల్లో "క్లినికల్ డెత్" సంభవించిన తర్వాత కొద్ది నిముషాలకో, గంటలకో ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చిగానీ, గుండెకి చేత్తో మసాజ్ చేసిగానీ, ఆర్టిఫీషియల్ హార్టు లంగ్సూ కనెక్టు చెయ్యడం ద్వారా గానీ శ్వాస క్రియా, హృదయస్పందనా కలగజేసి బతికించడం అసంభవం కాదు. అలా చాలా కేసుల్లో జరిగింది కూడా.
గంటో రెండు గంటలో "చనిపోయి" మళ్ళీ "బ్రతికిన" మనుషులమీద పరిశోధనలు చేశాడు ఆ డాక్టర్. వాళ్ళు చనిపోయినప్పుడు ఏఏ మార్పులు సంభవించాయి? ఆ సమయంలో వాళ్ళు ఏమేమి అనుభూతులకు గురి అయ్యారు? అనే ప్రశ్నలకు జవాబు రాబట్టాడు."
పెద్దగా ఆవలించాడు సందీప్. 'ఊ సంభాషణ ఇంక చాలు' అని సూచిస్తున్నట్లు.
అతన్ని ఎగాదిగా చూసి, మౌనంగా ఉండిపోయింది స్వప్న.
ఇంకొంచెం ముందుకు పోయాక, సందీప్ కాలికి ఏదో తగిలింది.
లైటర్ వెలిగించి చూశాడు.
ఎముకలు! ఎముకలు! గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి అవి.
ఒక్క జంతువు అస్థిపంజరం చెక్కు చెదరకుండా నిలబడివుంది.
దిగ్భ్రమ పొంది చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు సందీప్. "టైరన్నో సారస్!" అన్నాడు పెదిమలు తడిచేసుకుంటూ, ఉద్వేగంగా స్వప్నవైపు తిరిగి, "డినోజారస్ అనే పేరు విన్నావా స్వప్నా? రాక్షసి బల్లులు! కోట్ల సంవత్సరాల క్రితం భూమిని డామినేట్ చేసి, దాదాపు ఆరుకోట్ల సంవత్సరాల క్రితం భూతలం మీదనుంచీ అదృశ్యమైపోయాయి. వాటిలో ఇదొక జాతి! టైరన్నోసారస్! అప్పట్లో ఈ గుహ వాటి స్థావరమై ఉండేదేమో!" అన్నాడు.
"నాకు తెలుసు సందీప్! రెండు వేల సంవత్సరాల క్రితం కూడా కొన్ని రాక్షసి బల్లులు జీవించి ఉండేవి." అంది స్వప్న.
"మేబీ! ఇప్పటికీ స్కాంట్లండ్ లోని ఒక చెరువులో "లోచ్ నేస మాన్ స్టర్" - లేక "నెస్పీ" అనే ముద్దు పేరుతో పిలవబడే రాక్షస జంతువు ఏదో ఉందనడానికి ఆధారాలు కనబడుతున్నాయి. మనిషి కంటపడకుండా ఇంకా అక్కడక్కడ ఇలాంటి జంతువులు ఒకటీ అరా మిగిలి ఉండవచ్చునేమో!" అని ఆగి అనుమానంగా స్వప్నవైపు చూశాడు సందీప్. "అయినా అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావ్ స్వప్నా? అసలు నీకు ఈ సబ్జెక్టులో ఇంటరెస్ట్ ఉంటుందనుకోలేదు నేను" అన్నాడు.