Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 46

ఈసారి రెపరెపలాడి నిలదొక్కుకుంది మంట. అంటే అక్కడ ఆక్సిజన్ ఉన్నదన్నమాట! విషవాయువులు ఆ గుహ మొదట్లో మాత్రమే ఉన్నాయి. నిర్జనంగా ఉండే గుహలలో, పాడుబడ్డ బావులలో అలా పాయిజన్ గ్యాస్ తయారవడం జరుగుతూనే ఉంటుంది.
రిలీఫ్ గా ఫీలయ్యాడు సందీప్. గుండెలనిండా గాలి పీల్చుకుని, గుహమ్తా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. పది నిముషాల తరువాత దూరంగా చిన్న వజ్రంలా మెరుస్తూ కనబడింది ఏదో. దగ్గరకు వెడుతున్న కొద్దీ పెద్దదిగా కనిపిస్తోంది.
ఉవ్వెత్తున సంతోషం కలిగింది సందీప్ కి. ఆ కనబడుతోంది సూర్యరశ్మి!
అంటే, గువాకు అటువైపు మరో ద్వారం ఉందన్న మాట!
మళ్ళీ శ్వాస బిగించి, త్వరత్వరగా వెనక్కి వచ్చాడు.
చలనం లేకుండా బొమ్మలా నిలబడి వుంది స్వప్న. అతను తిరిగి రాగానే, పట్టశక్యం కాని ఆశ్చర్యంతో అతనివైపు చూసింది. మెల్లగా ఆమె ముఖంలో దిగులు తొలగిపోయి చిరునవ్వు చోటుచేసుకుంది.
"విషవాయువులు గుహ మొదట్లోనే వున్నాయి స్వప్నా! గుహ లోపల ఆక్సిజన్ పుష్కలంగానే వుంది. అంతేకాదు! అవతలవైపు నుంచీ వేరే దారి వుంది. మనం తప్పించుకుని పోవచ్చు."
 "నువ్వు అసాధ్యుడివి!" అంది స్వప్న ఆశ్చర్యంతో సంభ్రమంగా.
"ఒక్క ముప్ఫయ్ సెకండ్లపాటు ఊపిరి బిగబట్టగలవా స్వప్నా! నిన్ను ఎత్తుకుని వంద గజాలు పరుగెత్తుకు వెడతాను. ఆ తరువాత మనకు ఇంక ప్రమాదం ఉండదు."
"ముప్ఫయ్ సేకన్లేం ఖర్మ! నువ్వు గుహ లోపలకు వెళ్ళి బయటకు వచ్చేవరకు ఊపిరి తీసుకోవడమే మర్చిపోయాను సందీప్!"
అభిమానంగా ఆ అమ్మాయివైపు చూశాడు సందీప్.
అతను మృత్యు గహ్వరంలోకి వెళ్ళి, ప్రాణాలతో తిరిగిరావడమే కాక, తప్పించుకునే మార్గం కూడా కనిపెట్టినట్లు చాలామందికి తెలిసిపోయింది.
బొటనవేలు ఊడిపోయిన స్త్రీ ఏదో అద్భుతాన్ని చూస్తున్నదానిలా నిర్నిమేషంగా ఉండిపోయింది. తరువాత మాటలు కూడబలుక్కుంటూ జాలి గొంతుతో అంది.
"చూడు బాబూ! నిశ్చయంగా నువ్వెవరో దేవదూతవు అయి వుంటావు! అనుమానం లేదు! ఈసారి నువ్వు దేవుడిని కలిసినప్పుడు మామీద కోపాన్ని తగ్గించుకుని, శాపాన్ని ఉపసంహరించుకోమని చెప్పు! సరేనా?"
నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు సందీప్. "నేను దేవతను కాదమ్మా! గుండెబలం, కండబలం, బుద్ధిబలం వున్న మనిషిని. అంతే మళ్ళీ చెబుతున్నాను. ఈ రోగం దేముడి శాపమూ కాదు, మందులకు లొంగనిదీ కాదు. నేను కొద్ది రోజులలో తిరిగి వస్తాను. అప్పుడు మీకు అన్ని బాధలనుండి విముక్తి కలుగుతుంది సరేనా?"
ఈసారి ఆమె ముఖంలో పరిపూర్ణమైన విశ్వాసం గోచరించింది. చేతులెత్తి దణ్ణం పెట్టింది ఆవిడ. తక్కిన వాళ్ళందరూ కూడా దణ్ణాలమీద దణ్ణాలు పెట్టారు.
"ఊపిరి బిగపట్టు!" అన్నాడు సందీప్.
తనుకూడా శ్వాస బిగపట్టి స్వప్నని భుజంమీద వేసుకుని వేగంగా గుహలోకి వెళ్ళిపోయాడు. వంద గజాలు వెళ్ళాక స్వప్నని దింపి, 'ఇంక ఫర్వాలేదు! పరిగెత్తు!" అన్నాడు.
చీకటి గుహలో వడివడిగా పరిగెడుతున్నారు ఇద్దరూ. దూరంగా కనబడుతోంది రెండోవైపు ద్వారం. దానిలో నుంచి వెలుగు వస్తోంది.
మంత్రం వేసినట్లు ఆగిపోయింది స్వప్న, ఆమె కళ్ళు డ్రీమీగా అయ్యాయి.
ప్రశ్నార్థకంగా చూశాడు సందీప్. "ఏమిటి స్వప్నా ?"
"ఈ గుహనీ, ఆ వెలుగునీ చూస్తుంటే ఒకటి గుర్తురావడం లేదూ ?"
"ఏమిటి ?"
"లైఫ్ ఆఫ్టర్ లైఫ్ గురించి నీకు తెలుసా సందీప్ ?"
"జీవితం అంతమయి పోయిన తర్వాత జీవితమా ?" నేను వెదుకుతున్న మమ్మీ గురించి పుకారు లాంటిదా? దటీజ్ హంబక్!"

 Previous Page Next Page