Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 45


    గొంతు సవరించుకుని, సాధ్యమైనంత సరళమైన భాషలో చెప్పడం మొదలెట్టాడు సందీప్.
"ఈ జబ్బుకి ఇప్పుడు మందులు లేకపోవడం సమస్య కాదు. మందులు ఉన్నాయి. కానీ దీనిని మహమ్మారిగా భావించి, ఎవ్వరితోనూ చెప్పుకోవడానికి భయపడిపోయి, సరైన వైద్యం తీసుకోకుండా ముదరబెట్టుకునే రోగుల మనస్తత్వంలోనూ, ఈ రోగం సోకిన మనుషులను వెలేసినట్లు చూసే సమాజం మనస్తత్వంలోనూ మార్పు తేవడమే పెద్ద సమస్య!
"మీరు అధైర్యపడకండమ్మా! మేము తిరిగి వచ్చాక, మీరు సరైన వైద్యసదుపాయాలు ఏర్పాటు చేస్తాము" అన్నాడు.
"మనం తిరిగి వచ్చాకా ?" అంది స్వప్న, ఆశ్చర్యంగా సందీప్ వైపు చూస్తూ. "నీకు ఎంత ఆత్మవిశ్వాసం సందీప్! ఈ భయంకరమైన లోయలో నుంచీ తప్పించుకోవడం ఎవరికి సాధ్యం?"
నిర్లక్ష్యంగా నవ్వాడు సందీప్.
"అవును బాబూ! ఒకసారి ఈ లోయలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంక తప్పించుకు పోవడం అసంభవం! ఇంతవరకూ ఎప్పుడూ అలా జరగలేదు! ఇక ముందు జరగబోదు! ఇక్కడే కుళ్ళి, కృశించి చావవలసిందే!" అంది ఆ స్త్రీ.
"అసంభవం అన్న పదం నా నిఘంటువులో లేదు. అసంభవాలు అనుకున్న వాటిని సంభవాలుగా మార్చే మనిషి ఇంత అభివృద్ధిని సాధించాడు. రోదసీలో విహరిస్తున్నాడు. నేను నిరంతర ఆశాజీవిని. ఉండండి..." అంటూ స్వప్నని వదిలి, ఆ పరిసరాలన్నింటినీ అంగుళం అంగుళం శోధించడం మొదలెట్టాడు.
అతని వెనకే వస్తోంది స్వప్న. ఆ స్త్రీ మరికొంత వెనకగా వస్తోంది.
ఒక చోట ఆగిపోయాడు సందీప్. "ఇదేమిటి?" అన్నాడు ఒక గుహలాంటి దాన్ని చూపిస్తూ.
"మృత్యుగహ్వరం !" అంది ఆ స్త్రీ జీవం లేనట్లు.
"పొరబాటున కూడా అందులో అడుగు పెట్టకు ! తక్షణమే మరణం సంభవిస్తుంది."
ఆమె మాటలు పూర్తికాకముందే, ఒక చిన్నపిట్ట హుషారుగా పాటపాడుతున్నట్లు అరుస్తూ, రెక్కలు టపటపలాడిస్తూ, ఎగురుతూ వచ్చి, ఆ గుహలో ప్రవేశించింది. ఒక నిముషం అయినా గడవకముందే గింగిరాలు తిరుగుతూ వెనక్కి వచ్చి, చచ్చి పడిపోయింది.
"చూశావా ?" అంది ఆ స్త్రీ నిస్పృహగా.
సాలోచనగా ఆ పిట్టవైపు చూసి, తరువాత అర్థమైనట్లు తల పంకించాడు సందీప్. గుహవైపు అడుగులు వెయ్యడం మొదలుపెట్టాడు.
"సందీప్ ! ప్లీజ్ ! వద్దు" అంటూ అతన్ని చుట్టేసుకుంది స్వప్న.
ఆమె వెన్ను నిమిరి, విడిపించుకుని, గుహ దగ్గరకు వెళ్ళాడు సందీప్. జేబులోనుండి సిగరెట్ లైటర్ తీసి వెలిగించాడు. చెయ్యిచాచి, లైటర్ ని గుహ ముఖద్వారంలో ఉంచాడు.
వెంటనే లైటర్ లోని మంట ఆరిపోయింది.
"పాయిజన్ గాసెస్ ! గుహలో విషవాయువులు ఉన్నాయి. ఆక్సిజన్ లేదు. లోపలికి వెళ్ళి చూసి వస్తాను."
"సందీప్! ఆర్ యూ క్రేజీ? నీకు మతిపోయిందా?" అంది స్వప్న కోపంతో ఊగిపోతూ.
మృదువుగా నవ్వాడు సందీప్. నేను చిన్నప్పటినుండి క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తున్నాను స్వప్నా! శ్వాసను బంధించి, ఆక్సిజన్ లేకుండా సులభంగా అరగంటసేపు ఉండగలను. నాకేం ఫర్వాలేదు." అంటూ ఒక్కసారి గాఢంగా ఊపిరి తీసుకుని, శ్వాసను బంధించి, గుహలోకి దూసుకుపోయాడు.
చిమ్మచీకటిగా ఉంది లోపల. తడుముకుంటూ కొంతదూరం వెళ్ళి, లైటర్ అంటించాడు. తల్లి కడుపులో నుండి భూమిమీదకు వచ్చిన వెంటనే మరణించిన శిశువులా లైటర్ లోని మంట వచ్చీ రాకముందే ఆరిపోయింది.
అప్పటికి అతని కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటు పడుతున్నాయి. అస్పష్టంగా కనబడుతున్నాయి పరిసరాలు.
ఇంకొంచెం దూరం ముందుకు నడిచి, మళ్ళీ లైటర్ అంటించాడు.

 Previous Page Next Page