Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 45


                      భార్య/భర్త - స్నేహితుడు/ స్నేహితురాలు:

    ఇద్దరు వ్యక్తులు స్నేహం చేయాలన్నా, లేక ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా వాళ్లిద్దరిలో ఒకరికినచ్చే గుణం మరొకరిలో వుండాలి. అంతేకాకుండా వాళ్లిద్దరూ  జీవితాంతం కలిసుండాలన్నా కూడా వాళ్లిద్దరిల కొన్నిలక్షణాలు  కామన్ గా వుండాలి. అలా అనిచెప్పి  అన్నీ ఒకరికి నచ్చేగుణాలు మరొకరిలో వుంటే ఆసంసారం కూడా  పేలవంగా వుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఘర్షణలు,  చిలిపితగాదాలు,  ఒకరితప్పుల్ని మరొకరు క్షమించేగుణం ఇవన్నీ కూడా సంసారాన్ని రంజింప చేస్తాయి.

     ఏ మనిషీ  పరిపూర్ణంగా మంచివాడూ కాదు. ఏ మనిషి కూడా పూర్తిగా చెడ్డవాడు కాదు. ప్రతి మనిషి లోనూ కొన్ని లక్షణాలుంటాయి. ఆలక్షణాలు అవతలి వాళ్లకి (లైఫ్ పార్టనర్ కి) నచ్చితే ఆ సంసారం  సుఖంగా సాగిపోతుంది. లేకపోతే లేదు అంతే. ఉదాహరణకి ఒక స్త్రీకి తన భర్త తనదగ్గిర చిన్నపిల్లాడిలా ప్రవర్తించాలని, ప్రతి చిన్నదానికి తన మీద ఆధారపడాలని వుంటుంది. అలాగే మరొక స్త్రీకి తన భర్త పరిపూర్ణమైన వ్యక్తిత్వంకల వ్యక్తిగా  , తన స్వంత నిర్ణయాలు తను తీసుకునే వ్యక్తిగా  వుండాలని వుంటుంది. కాబట్టి ఒక మగవాడు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తే మంచిదా? లేక పరిపూర్ణమైన వ్యక్తిత్వం కల వ్యక్తిగా ప్రవర్తిస్తే  మంచిదా?  అన్నది ఎవరూ నిర్ణయించలేరు. తన కెలాటి వ్యక్తి కావాలో ఆ వ్యక్తి దొరికితే ఆ సంసారం సుఖప్రదం. లేక పోతే  అది గతుకుల రోడ్డు మీద బండిలా నడుస్తుంది.

    చేతివ్రాత బట్టి ఏయేవ్యక్తికి ఎటువంటి పార్టనర్ దొరికితే బావుంటుందో కొంతవరకు విశ్లేషించగలిగారు. అలాగే బాయ్ ఫ్రండ్ /  గర్ల్ ఫ్రండ్ ఎలా వుంటే ఆ స్నేహం ప్రేమలోకిదిగి  తరువాత పెళ్లి వైపు దారి తీస్తుందో కూడా కొంతవరకు  వీరు విశ్లేషించగలిగారు. ఈ చాప్టర్ లో మనం ఆ విశ్లేషణని పరిశీలిద్దాం.

     ఒకజంట గ్రాఫాలజిస్ట్ ల దగ్గరికి వచ్చి తమ భావివైవాహిక జీవితం ఎలా వుంటుంది? అని అడిగితే ఆగ్రాఫాలజిస్ట్ ముఖ్యంగా నాలుగు విషయాలని  పరిగణలోకి తీసుకుంటాడు. 1. ఆ ఇద్దరి మానసికోద్వేగ స్థాయి, 2. సాంఘిక నియమాల పట్ల ఇద్దరి ఆసక్తి స్థాయి, 3. తెలివితేటల స్థాయి  , 4 సెక్స్ పట్ల ఆసక్తి.

     పై నాలుగూ చాలా ముఖ్యమైన విభాగాలు. అయితే ఇందులో వేరు వేరు శాతాల నిష్పత్తి పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి భార్య చాలాచిన్న స్థాయిలోనే మానసికంగా ఎక్కువ ఉద్వేగం చెందేదైతే, భర్త చాలా కంట్రోల్డ్ గా వుండే వాడై వుండాలి.  ప్రతీ చిన్న విషయానికీ భార్యా భర్తలిద్దరూ బ్రేక్ అయిపోతే ఆసంసారం  సుఖంగా సాగటం కష్టం.

     అలాగే భర్త బాగా తెలివి తేటలున్న వాడై, భార్య కాస్త తెలివి తేటలు తక్కువ ఉన్నదైతే ఆ సంసారం  ఒకరకంగా సాగిపోతుంది. కానీ ఇద్దరూ అతి తెలివి తేటలతోనో, ఇద్దరూ తెలివి తక్కువగానో ఉంటేకష్టం.

     పైన చెప్పినరెండు ఉదాహరణల్లో 'ఉద్వేగాల స్తాయి' - 'తెలివితేటలు స్థాయి' - వీటిలో తేడాలు ఉన్నాఫరవాలేదు అని చెప్పటం జరిగింది. కాని సెక్స్ పట్ల  ఆసక్తి ఇద్దరికీ ఒకేరకంగా (అది ఎక్కువగానీ , తక్కువగానీ) ఉండకపోతే చాలా సమస్యలు వచ్చిపడతాయి. అలాగే 
సాంఘికనియమాలపట్ల  కూడా ఇద్దరికీ సమానమైన ఆసక్తి లేకపోతే  ఇద్దరూ  ఒకరినొకరు డామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    కాబట్టి పై నాలుగు విభాగాల్లో ఏయే విభాగం ఇద్దరికీ ఎంత శాతం వుండాలనేది మనం గ్రాఫాలజిస్ట్ రిపోర్టు ప్రకారం తెలుసుకోవచ్చు.
     సాదారణంగా వైవిహిక జీవితంలో ఒక వ్యక్తి అవతలివ్యక్తి నుంచికోరుకునేవి ఈ క్రింది రకంగా వుంటాయి.

    1. ప్రేమించేగుణం  :

     ప్రతీవ్యక్తి తను ప్రేమించాలని, ఇతరులు చేత ప్రేమింప బడాలని కోరుకుంటాడు. దంపతుల్లో  ఆ ఆకాంక్ష చాలా బలీయంగా వుంటుంది. మనుషుల్లో ప్రేమించేగుణం ఎంతున్నా కూడా దాన్ని ప్రదర్శించేగుణం లేకపోతే చాలా కష్టం. మనిషి యొక్క మనస్తత్వం అతని ప్రవర్తన  వల్లే బయటపడుతుందంటారు చాలామంది. లోపల భావాలు  ఒకరకంగా వున్నా బయటికి మరోరకంగా ప్రవర్తించేవాళ్లు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది వుంటారు. చిక్కంతా ఇటువంటి వాళ్లతోనే వీళ్లతో  సంసారం చేయాలంటే వీళ్ల మనసులోతుల్లోకి వెళ్లి అసలు భావాన్ని  పట్టుకోవాలి. భాగస్వామికి అంత ఓపిక లేని పక్షంలో సంసారం నరకమవుతుంది. అందువల్లస గ్రాఫాలజిస్ట్ లు  వీరిద్దరి మనస్తత్వాన్ని పరిశీలించేటప్పుడు ఆ జంటల్లో  ఇటువంటి గుణం ఉందా లేదా అని  నిశ్చయించుకుంటాడు. ఉదాహరణకి ఒకవ్యక్తిపైకి చాలా కఠినాత్ముడి  గాను, తననిర్ణయాలు ఒకరి సలహా లేకుండా అమలు జరిపేవాడిగాను ఉండవచ్చు. కానీ మనసులో ఎంతో దయార్ద్ర గుణం, ప్రేమ వుండి వుండవచ్చు. అతడి భార్యకి  అతని మనసులోని భావం తెలుసుకోగలిగిన ఓర్పు, నేర్పు లేకపోయి వుండవచ్చు. వారిద్దరూ మంచి వారయినా సరే, ఆ సంసారం సుఖంగా  జరగదు. భార్యకి  భర్తని అర్దం  చేసుకునేగుణం ఉందా లేదా,  భర్తకి భార్యని  సుఖపెట్టే అవగాహన   వుందాలేదా అనేది కూడా  గ్రాఫాలజిస్ట్ లు ఈ విభాగం ద్వారానే తెలుసుకుంటారు.

    2. సిన్సియారిటీ:

    అవతలి వ్యక్తి ఎంతడబ్బులున్నవాడైనా, ఎంత అందగాడైనా, ఏ కళలో ప్రవేశమున్నా..... ఒక అమ్మాయి అతడు తనని సిన్సియర్ గా ప్రేమించాలని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమకి సిన్సియారిటీయే క్వాలిఫికేషన్. అలాగే మగవాడు కూడా స్త్రీ తనని సిన్సియర్ గా ప్రేమించకపోతే  విలవిలలాడిపోతాడు.  చాలా కేసుల్లో  మగవాడిలో ఏ  అర్హత లేకపోయినా స్త్రీ, అతనే అంటిపెట్టుకొని మనసా, వాచా, ప్రేమించటానికి కారణం - ఆ మగవాడు తనని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడన్న భావన మాత్రమే.  ఈ సిన్సియారిటీ అనేది చేతి వ్రాతలో ప్రస్పుటిస్తుంది అని భావిస్తారు గ్రాఫాలజిస్ట్ లు. భార్యాభర్తలో ఒక వ్యక్తి సిన్సియర్ గా వుండి, మరొక వ్యక్తి సిన్సియర్ గా లేకపోతే  ఆ సంసారం పేకమేడల్లా  కూలిపోతుంది. కాబట్టి చేతి వ్రాతనిబట్టి సిన్సియారిటీని కనుక్కొనే విధానం ద్వారా ఆ సంసారం ముందు ముందు ఎలా సాగుతుందనేది తెలుసుకోవచ్చు.

 Previous Page Next Page