3. అవతలి వారిని మెప్పించే గుణం:
ఈ విభాగంలో చాలా విషయాలు చోటు చేసుకుంటాయి. భర్త ఎక్కువ 'సెన్సాఫ్ హ్యూమర్' ఉన్నవాడై వుండవచ్చు. భార్య కొంత రిజర్వ్ డ్ టైపు అయివుండవచ్చు. అలాగే భర్త ప్రతీ చిన్న విషయానికి విపరీతంగా ఆలోచించే వాడై వుండవచ్చు. భార్య దానికి వ్యతిరేకం అయి వుండవచ్చు.
అవతలి వారిని మెప్పించాలి అంటే చాలా కమ్యూనికేషన్ అవసరం. మన మనసులో భావాల్ని, మన అభిప్రాయాల్ని అవతలివారికి చెప్పేకొద్దీ, వారు మనల్ని మరింత అర్దం చేసుకుంటారు. అలా చెబుతున్నందుకు వారు మనల్ని ప్రేమిస్తారు. కొంతమంది వ్యక్తులు తమచుట్టూ కోట కట్టుకొని వుంటారు. వీళ్లని మెప్పించాలన్నా, వీరి చేత మెప్పించబడాలన్నా చాలా కష్టం. ఇటువంటి వ్యక్తులున్న ఇంట్లో నిశ్శబ్దం సదా తాండవిస్తూ వుంటుంది. చిన్న చిన్న పొగడ్తలు, అభినందలు, బహుమతులు, కూడా అవతలి వారిని సంతృప్తి పెడతాయి. భార్యా భర్తల్లో ఈ గుణాలు ఏయే లెవల్లో వున్నాయనేది కూడా గ్రాఫాలజిస్ట్ లు చేతి వ్రాతద్వారా తెలుసుకుంటారు.
4. బాధ్యత:
తమ జీవిత భాగస్వామి తమకుటుంబంపట్ల ఎక్కువ భాద్యతగా వుండాలని భార్యా భర్తలిద్దరూ కోరుకుంటారు. ప్రేమికులు కూడా ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటారు. జీవితాన్ని తీసుకోవటం, సమస్యల్ని దాటవేయటం, అవతలి వ్యక్తిపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించటం ఎవరూ ఇష్టపడరు. బాధ్యతాయుతమైన ప్రవర్తనగురించి గ్రాఫాలజీ ఏ విధంగా తెలుపుతుందో ఇంతకు ముందు చాప్టర్లలో చర్చించటం జరిగింది.
5. ఇతర గుణగణాలు:

వీటిలో చాలా వరకు వివిధరకాలైన మనస్తత్వాల గురించి గ్రాఫాలజిస్టులు పరిశీలిస్తారు. ఏయే పరిస్థితుల్లో మనిషి నిజం చెబుతాడు. ఎక్కువగా అబద్దాలు చెబుతాడా - అతడిలో లౌక్యం పాలు ఎంత వరకు వుంది - డబ్బుపట్ల అతని యొక్క థృక్పధం ఏమిటి - ఇలాంటివన్నీ ఈ విభాగం కిందికి వస్తాయి.
పైన ఎనిమిది రకాల చేతివ్రాతలు ఇవ్వబడ్డాయి. మీ చేతివ్రాతపై ఎనిమిది రకాల్లోనూ ఏదో ఒక దానిలో సరిగ్గా ఇమడకపోవచ్చు. మీరుగమనించవలసింది లక్షణాలని మాత్రమే. ఉదాహరణకి పైన చెప్పిన ఉదాహరణలో మీ చేతివ్రాత గొలుసు వ్రాత (7) మరియు ఎడమవైపు వంగిన అక్షరాలు (4) అయివుండవచ్చు. అటువంటప్పుడు మీరు 7,4 కేటగిరీకి చెందినవారై వుంటారు. అలాగే మీ అక్షరాలు గుండ్రంగా (2) పొడవాటి దీర్గాలతో (1) వుండి వుండవచ్చు. అప్పుడు మీరు 2, 1 లక్షణాలు కలిగి వుంటారు.
ఈ విధంగా మీ చేతివ్రాతని పరిశీలించి, మీరు ఏయే కేటగిరీలకు చెందుతారో కనుక్కోవాలి. దాన్ని బట్టి మీకు ఏ కేటగిరీ చేతివ్రాతలున్న వ్యక్తులు స్నేహితులుగా (లేదా జీవిత భాగస్వాములుగా) సరిపోతారో తెలుసుకోవచ్చు.
ఇప్పుడిక పై వ్రాతల్ని పరిశీలిద్దాం - దీర్ఘాలు, వత్తులుగానీ దీర్ఘంగా పొడవుగా (పై ఉదాహరణలో 1 మరియు 3 ఇచ్చేవ్యక్తులు సెక్స్ పట్ల ఎక్కువ ఉత్సాహం వున్నవారై వుంటారు. వీరిలో రెండు రకాలు పొడవాటి వత్తుల్నీ, దీర్ఘాల్నీ చి .. వ... రి.... వరకూ 'బలంగా' ఇచ్చేవారు (1) దీర్గాల్ని పొడవుగా ఇచ్చినా, చివర్లో తేలిగ్గా తేల్చేసేవారు. (3)
ఇద్దరికీ సెక్స్ కోరికలు, జీవితం మీద ఆశ ఎక్కువగా వున్నా, మొదటిరకం (1) వారు శారీరకంగా, మానసికంగా కూడా అంత బలమైన వారే అయి, తమ భాగస్వామి నుంచి అటువంటి 'బలమైన' ప్రవర్తనే ఆశిస్తారు. పొడవుగా తేలిగ్గా (3) వ్రాసేవారు కోర్కెలున్నా, శారీరక బలహీనతవల్లనైతేనేమి, మానసిక లక్షణాలవల్లనైతే నేమి - తమ కోర్కెల్నిభాగస్వామి వద్ద తీర్చుకోలేని అశక్తులై వుంటారు.
ఇటువంటి వారు (1మరియు 3) వత్తుల్నీ దీర్గాల్నీ పొట్టిగా ఇచ్చే (2) వ్యక్తుల్లో సంసారం సరిగ్గా చేయలేరు. ఈ రకం (2) వ్యక్తులు, జీవితమంటే కేవలం భౌతికమైన ఆనందాలేకాదనీ, సాదించవలసింది ఇంకా చాలా వుందని నమ్మేవారు అయివుంటారు. విచ్చలవిడితనాన్ని ఎక్కువ ఇష్టపడరు. సెక్స్ కన్నా 'రొమాన్స్' ని ఎక్కువ ఇష్టపడతారు.


