Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 45


    ప్రైమరీ హెల్త్ సెంటర్ మెట్లెక్కాడు. అటూ ఇటూ చూస్తూ డాక్టర్ బాలేశం రూమ్ లోకి నడిచాడు డేవిడ్.

 

    "రండి... రండి... ఇన్స్ పెక్టర్. ఏమైనా తెల్సిందా?" చిరునవ్వుతో పలకరించాడు డాక్టర్ బాలేశం.

 

    "నేనడగాల్సిన ప్రశ్న మీరడుగుతున్నారు డాక్టర్..." సీట్లో కూర్చుంటూ చుట్టూ చూశాడు డేవిడ్.

 

    అతనికెక్కడా శివరాణి కన్పించలేదు. మనసు గిలగిలలాడిపోతోంది.

 

    "ఇవాళ పేపర్లో చూశాను. అతను లా స్టూడెంట్ అని ఒక పక్క రాస్తూనే... భయంకరమైన క్రిమినల్ అని మరో పక్క రాస్తున్నారు. స్టూడెంట్ లీడర్స్ మాత్రం అతనంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ లేడని, పేపర్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఏది నిజమో తెలీడం లేదు. అసలు బేక్ గ్రౌండ్ స్టోరీ ఏమిటి సార్?" ఆసక్తిగా అడిగాడు డాక్టర్ బాలేశం.

 

    "ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు గదా" నర్మగర్భంగా అన్నాడు డేవిడ్.

 

    "మీరేదో ఆదిత్య మా ఇంట్లో వున్నట్టు మాట్లాడుతున్నారు" డాక్టర్ గొంతులో చిరుకోపం ధ్వనించింది.

 

    "ఐ బిలీవ్ యూ డాక్టర్... బట్... ఐ డోంట్... బిలీవ్ యువర్ నర్స్... శివరాణి... ఆమె మీద నాకెందుకో అనుమానంగా ఉంది. ఆదిత్య ఆమెను కలిశాడు."

 

    "అందుకు సాక్ష్యాలున్నాయా?" సీరియస్ గా అడిగాడు డాక్టర్ బాలేశం.

 

    "డోంట్ ఇరిటేట్. పోలీస్ మెన్... సాక్ష్యాలు టార్చర్ రూమ్ లోంచి ఆటోమెటిగ్గా పుడతాయి" సీరియస్ గా అన్నాడు. డేవిడ్ చర్చను మరి పొడిగించదలచుకోలేదు.

 

    "మీ నర్స్ ఎక్కడా? ఐ వాంట్ టు ఇంటరాగేట్" నెమ్మదిగా అన్నాడు డేవిడ్.

 

    "శివరాణి లీవ్ పెట్టింది రెండు నెలలు."

 

    నమ్మలేనట్లుగా చూశాడు డాక్టర్ వేపు.

 

    "ఎప్పుడు పెట్టింది లీవ్?"

 

    "నాలుగు రోజులైంది. ఇల్లు కూడా ఖాళీ చేసేసింది. బహుశా ట్రాన్స్ ఫర్ కోసం ట్రై చేస్తోందేమోనని నా అనుమానం."

 

    "సడన్ గా ఎందుకు లీవ్ పెట్టింది?"

 

    "వారం రోజుల క్రితం ఎవరో వ్యక్తి అర్దరాత్రి ఆదిత్య ఇన్ఫర్మేషన్ కోసమని వచ్చి ఆమె మీద అఘాయిత్యం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సంఘటనలో ఆమె పూర్తిగా భయపడిపోయింది. ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానంది. నేనే.. రకరకాలుగా సర్ది చెప్పాను."

 

    "ఆమెమీద అఘాయిత్యం చెయ్యడానికి వచ్చిన వ్యక్తెవరో... చెప్పిందా" పొడి పొడిగా వచ్చాయా మాటలు డేవిడ్ నోట్లోంచి.

 

    "ఆమెకైనా తెలిస్తే గదా చెప్పడానికి" జవాబిచ్చాడు డాక్టర్.

 

    సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు డేవిడ్. డేవిడ్ తో మాట్లాడుతూనే డేవిడ్ ముఖంలోని ఫీలింగ్స్ ను గమనిస్తున్నాడు డాక్టర్ బాలేశం.

 

    "ఆమె ఎక్కణ్ణుంచొచ్చింది?" అడిగాడు డేవిడ్.

 

    చెప్పాడు డాక్టర్.

 

    "హైద్రాబాద్ లో ఆమె ఎడ్రస్ తెలుసా?"

 

    "తెలీదు..." టక్కున జవాబు చెప్పాడు డాక్టర్.

 

    "ఆమె అపాయింట్ మెంట్ ఆర్డర్ లో ఆమె ఎడ్రస్ వుంటుందనుకుంటాను" డాక్టర్ బాలేశం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు డేవిడ్.

 

    "ఉంది. కేరాఫ్ గాంధీ హాస్పటల్... హైద్రాబాద్... అంతే..."

 

    "అంటే... గాంధీ హాస్పిటల్లో కనుక్కుంటే...."

 

    "మీరు పోలీసులు... ఆకాశంలో వున్నా పట్టుకోగలరు. దానికింత ఎందుకు వర్రీ అయిపోతున్నారో నాకర్ధం కావడంలేదు" వర్రీ అన్నమాట మీద స్కైస్ ఇస్తూ అన్నాడు డాక్టర్.

 

    "కేసు... సీరియస్ నెస్... మీకర్ధం కాదులెండి" శివరాణి లీవ్ పెట్టి వెళ్లిపోయిందనగానే పాతాళంలోకి జారిపోయినట్టుగా అయిపోయింది డేవిడ్ మనసు.

 

    ఆదిత్య కేసును అడ్డుపెట్టుకొని ఎలాగోలా శివరాణిని లైన్లోకి తెచ్చుకుందామన్న కోరిక పురిట్లోనే సంధి కొట్టడంతో డేవిడ్ మనసు విలవిలలాడిపోయింది.

 

    "థాంక్యూ డాక్టర్" రూమ్ లోంచి బయటికొచ్చి-

 

    "సడన్ గా శివరాణి వచ్చిందనుకోండి" అని అన్నాడు డేవిడ్ తిరిగి.

 

    "మీకు వెంటనే ఇన్ ఫామ్ చెయ్యడం నా డ్యూటీ" అన్నాడు డాక్టర్ బాలేశం సిన్సియర్ గా.

 

    విసురుగా హెల్త్ సెంటర్ లోంచి బయటికొచ్చి గబగబా నడుస్తూ శివరాణి వున్న డాబా ఇంటివేపు చూశాడు. ఆ డాబా యింటికి తాళం వేసింది.

 

    'శివరాణీ! నువ్వెక్కడున్నా నా నుంచి తప్పించుకోలేవ్' కసిగా మనసులో అనుకుంటూ జీపెక్కాడు డేవిడ్.

 

    "ఏమైంది సార్" దార్లో అడిగాడు డ్రైవర్ రాములు.

 

    జరిగింది చెప్పాడు డేవిడ్.

 

    "ఆమెని ఆ డాక్టర్ సేవ్ చేస్తున్నాడేమో..." రాములు కాకతాళీయంగా అన్నాడు.

 

    ఆ మాటన్న రాములు వేపు సాలోచనగా చూశాడు డేవిడ్.

 

    "అంత ధైర్యవంతుడా ఆ డాక్టర్?"

 

    "చెప్పలేం సార్... ఏ పుట్టలో ఏ పాముందో..."

 

    "కొండచిలువల్తో ఆడుకుంటాడు ఈ డేవిడ్. ఎందుకయినా మంచిది- నువ్వొకసారి మఫ్టీలో రేపు ఎల్త్ సెంటర్ కెళ్ళు" చెప్పాడు డేవిడ్.

 

    "ఎటు సార్ ప్రయాణం?"

 

    "జోగిపేట వెళదాం పద."

 

    "జోగిపేట ఎందుకు సర్... వెంకటాపురం వెళ్దాం సర్! రోడ్డు పక్కనే బంగారంలాంటి పిట్టలు కువకువలాడుతుంటాయి సర్!"

 

    "బంగారంలాంటి పిట్ట... శివరాణి తప్పించుకుపోయిందిరా. ముందు దాని సంగతి తేలాలి!"

 

    "దాని సంగతి తేలాలంటే జోగిపేట ఎందుకు సర్... హైద్రాబాద్ వెళితే పోలే?"

 

    "మాట్లాడకుండా జోగిపేట పో! అక్కడ సబ్ ఇన్స్ పెక్టర్ మన ఫ్రెండు" చెప్పాడు డేవిడ్.

 

    "అలా చెప్పరేం" గేరు మార్చి స్పీడు పెంచాడు డ్రైవర్ రాములు.

 

    ఇసక రోడ్డుమీద జీపు సర్రుమని దూసుకుపోతోంది.


                                               *    *    *    *    *


    రాత్రి ఏడు గంటలైంది.

 

    ప్రైమరీ హెల్త్ సెంటర్ డోర్ కి తాళం వేసి బయటికొచ్చాడు డాక్టర్ బాలేశం.

 

    అటూఇటూ చూసి రోడ్డు మీద అపరిచిత వ్యక్తులెవరూ లేరని నిర్ధారించుకొని-

 

    హాస్పిటల్ వెనక వేపు నడిచాడు. డాబా యింటికి కొంచెం ముందు కెళ్ళి ఆగి, మళ్ళీ అటూ ఇటూ చూసి-

 Previous Page Next Page