డాబా యింటి వెనక వేపు నడిచాడు. మురికికాల్వ దాటి... రాళ్ళ గుట్టలు దాటి, మెట్లెక్కి-
మునివేళ్ళతో తలుపు తట్టాడు.
ఆ మునివేళ్ళ సంజ్ఞను అర్ధం చేసుకున్న ఆ వ్యక్తి కిటికీని నెమ్మదిగా తెరచి చూసి, తలుపు తెరిచింది.
గబుక్కున లోనకెళ్ళి తలుపేశాడు డాక్టర్ బాలేశం.
'చూశావా నిన్ను రక్షించాను' అన్నట్టుగా చూశాడు డాక్టర్ బాలేశం నర్స్ శివరాణి వేపు.
"ఇన్స్ పెక్టర్ ఏమడిగాడు?" భయంగా అడిగింది శివరాణి.
"వాడికెందుకో నీ మీద అనుమానంగా వుంది. ఆదిత్య కేసు మీద కన్నా నీ మీదే ఆ ఇన్స్ పెక్టర్ గాడికి ఇంట్రెస్టులా వుంది" షర్టు విప్పి గోడకు పెడుతూ అన్నాడు డాక్టర్ బాలేశం.
"వాడికన్నా రెండాకులు ఎక్కువే చదివారు మీరు. భలే ఊహించారే ఆ ఇన్స్ పెక్టర్ మళ్ళీ వస్తాడని" అంటూ అతని వడిలో కూర్చుంది శివరాణి.
"హైద్రాబాద్ లో నా కోసం ఎంక్వయిరీ చేస్తే?" భయంగా అంది.
"అందుకే గదా రాంగ్ ఎడ్రస్ యిచ్చాను" ధీమాగా అన్నాడు డాక్టర్.
"మళ్ళీ ఆ ఇన్స్ పెక్టర్ వస్తాడని నాకెందుకో భయంగా వుంది" డాక్టర్ గుండెల మీద వాలిపోతూ అంది శివరాణి.
రెండునెలలు శెలవు ఐడియా చెప్పింది, ఇంటిముందు తాళం వేసి ఇంట్లోనే వుండమన్నదీ బాలేశమే. ఆదిత్య కేసు-ఇన్స్ పెక్టర్ నిఘా భయపెట్టి రెండు నెలలపాటు హాయిగా వాడుకొని, ఆమెని ఎక్కడికో ట్రాన్స్ ఫర్ చేయించేసి చేతులు దులుపుకోవాలని ప్లాన్ వేశాడు బాలేశం.
బాలేశం ఉద్దేశ్యాన్ని గ్రహించినా తప్పనిసరి పరిస్థితిల్లో అంగీకరించింది శివరాణి.
బాలేశం తనని ముట్టుకున్నప్పుడల్లా ఎందుకో ఆదిత్యే గుర్తుకొస్తున్నాడు శివరాణికి.
ఇంతకు పూర్వం రోజుకు ఒకటి రెండుసార్లు గుర్తుకొచ్చే ఆదిత్య ప్రస్తుతం ప్రతిక్షణం గుర్తుకొస్తున్నాడు.
ఆదిత్య మరి కనిపించడా? మరొక్కసారి ఆదిత్య కనిపిస్తే బాగుండు.
అందుకే ప్రతిరోజూ తప్పకుండా ఈనాడు పేపర్ ని చూసి ఎప్పటికప్పుడు ఆదిత్యకు సంబంధించిన న్యూస్ ఐటమ్స్ ని వదిలిపెట్టకుండా ఫాలో అవుతోంది శివరాణి.
"ఈసారి ఆ ఇన్స్ పెక్టర్ వస్తే మళ్ళీ బయటికెళ్ళడు. అప్పటితో నీకు విముక్తి" ఆమె భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు డాక్టర్ బాలేశం.
"అదెలా?"
"ఈసారి వాడ్ని రానీ... చెప్తాను" బెడ్ వెనక గోడకున్న స్విచ్ ను ఆఫ్ చేస్తూ అన్నాడు బాలేశం.
"మీది కూడా క్రిమినల్ బ్రెయినే" అంది శివరాణి నవ్వుతూ.
"స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ పక్కనే నా క్లినిక్ వుండేదిలే" ఆమెను ఆక్రమించుకుంటూ అన్నాడు డాక్టర్ బాలేశం.
* * * * *
పెద్ద చప్పుడుతో తలుపు తెరుచుకొని వచ్చింది రంగి.
ఆ చప్పుడికి మెలుకువొచ్చింది ఆదిత్యకు. ఒళ్ళంతా నొప్పులు. రాత్రి అలా మొండిగా పడుకుండిపోయాడు. భుజాన్ని కదపలేకపోతున్నాడు.
"ఆదిత్య బాబూ! ఆదిత్య బాబూ! రాత్రో విషయం జరిగింది తెల్సా? ఆ రౌడీ వెంకట్ గాడు రాత్రి వూళ్ళోకొచ్చాట్ట. తప్పతాగి సుమమ్మ యింటి మీద పడ్డాట్ట! ఆడెనక ఆడి రౌడీ గేంగు కూడా వుందట. అక్కడేవైందో తెలీదు. ఎవరో ఆడ్ని, ఆడి రౌడీ గేంగుని చితకతన్నార్ట! రాత్రికి రాత్రి ఆడు వెంకటాపురం పారిపోయాట్ట..." సంతోషంగా చెప్పుకుపోతోంది రంగి.
"ఈ విశేషాలన్నీ నీకెవరు చెప్పారు...?" నెమ్మదిగా అడిగాడు ఆదిత్య.
"ఊళ్ళో జనం..." అని చెప్పబోయి, భుజానికి కట్టిన కట్టుచూసి-
"ఏంటి గాయం? నిన్న లేనట్టుంది?" అంటూ దగ్గరగా వచ్చింది రంగి.
"నిన్నుంది! ఎందుకు లేదు? నిన్న కట్టు లేదు, గాయం వుంది... రాత్రి బాగా బాధపెడితే కట్టుకట్టానంతే!"
"టీ తెచ్చాను తాగు! సుమమ్మ ఇంటికెళ్ళి, అక్కడ పని చూసుకుని వస్తాను" అంటూ తన చేతిలోని టీ గ్లాసుని ఆదిత్య చేతికందించి-
"వెధవ్వూళ్ళో మందూ వుండదు, మాకూ వుండదు దేనికయినా వెంకటాపురమో, జోగిపేటో వెళ్ళాల్సిందే! మరి గాయాలకు మందు రాసుకోపోతే ఎలా?" అంది రంగి.
"కంగారు పడకు! పెద్ద గాయాలు కావులే! నువ్వెళ్ళు" టీ తాగుతూ అన్నాడు ఆదిత్య.
పరుగు పరుగున బయటకు వెళ్ళిపోయింది రంగి.
రెండు గంటలు గడిచాయి.
అంతే పరుగు పరుగున వచ్చింది రంగి.
"నాకు అసలు రహస్యం తెలిసిపోయిందిలే" పక్కనే కూర్చుంటూ అంది.
అయోమయంగా చూశాడు ఆదిత్య.
"ఏం జరిగింది రంగీ?"
"ఇవాళ సుమమ్మ నీ గురించి రెండు మూడుసార్లు అడిగింది."
షాక్ తిన్నాడు ఆదిత్య.
తన గురించి సుమబాల రంగిని అడిగిందా?
"ఏమడిగింది?"
"నువ్వెక్కడుంటున్నావని, భోజనం ఎక్కడ చేస్తున్నావని, నువ్వు ఒక్కడివే వచ్చావా? లేదా నీతో యింకెవరైనా వచ్చారా అని..."
"థాంక్యూ వెరీమచ్..." సుమబాల మాటలే మనసులో మెదులుతున్నాయి.
"ఆవిడలా నీ గురించి అడగటం, నీ భుజాలకి ఆ కట్టు, అదీ చూస్తూవుంటే, నిన్న రాత్రి ఆ వెంకట్ ముఠాని సుమమ్మ యింటి దగ్గర్నుంచి చితక్కొట్టి పంపించింది నువ్వేననిపిస్తోంది. అవునా?"
ఆదిత్య మౌనంగా వుండిపోయాడు.
"నాకేదైనా తిండి ఏర్పాట్లు చేస్తావా? ఇలా లొడ లొడమని వాగుతావా?" ముఖమ్మీద కోపాన్ని పులుముకున్నాడు ఆదిత్య.
వంట చేస్తూ మధ్యలో అడిగింది రంగి-
"ఆదిత్య బాబూ! సుమమ్మ నీ ఫ్రెండా?"
"కాదు..." టక్కున చెప్పాడు ఆదిత్య.
"మరి... ధరణిబాబు...."
సమాధానం చెప్పలేకపోయాడు ఆదిత్య.
"తనెప్పుడూ బిజినెస్సు గొడవల్లో వుంటానని చెప్పి, సుమమ్మకేవీ ప్రమాదం లేకుండా చూడమని ధరణిబాబు నిన్ను పంపించాడా?" అమాయకంగా అడిగింది రంగి.
"ఎవరన్నారీ మాట?" సీరియస్ గా అన్నాడు ఆదిత్య.
"అవునేమోనని ఆదయ్య తాత అంటుంటేనూ...."
మాట్లాడలేకపోయాడు ఆదిత్య.


