వెంటనే బెడ్ వైపు చూసి అవాక్కయిపోయిందామె.
ఆదిత్య!
ఆదిత్య ఆ సమయంలో అక్కడికెలా వచ్చాడు?
"వాళ్ళు ఊళ్లోకి ప్రవేశించగానే ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు... అందుకే... మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి, మీ బెడ్ రూమ్ లోకి ప్రవేశించాను... ప్రెటీకేం జరక్కుండా జాగ్రత్త తీసుకున్నాను"
సుమబాల కళ్ళు ఆత్రంగా ప్రెటీ కోసం వెతుకుతున్నాయి. బెడ్ ఖాళీగా వుంది.
"డోన్ట్ వర్రీ సుమబాలగారూ! నేను మీకు మిత్రుడ్ననే విషయం మరిచిపోకండి... ప్రెటీ స్టోర్ రూమ్ లో నిద్రపోతోంది... మీరు కూడా వెళ్ళి అక్కడ దాక్కోండి... మిగతా విషయం నేను చూసుకుంటాను... నో మోర్ డిస్కషన్స్... ప్లీజ్..."
అప్పటికే బెడ్ రూమ్ తలుపు దబదబమని బాదుతున్నారు. మరో క్షణం ఆ డోర్ విరిగిపోవడానికి సిద్ధంగా వుంది.
ఆదిత్యవేపు చూసి గబుక్కున స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయింది సుమబాల.
వెంటనే బెడ్ రూమ్ లో లైట్ ఆర్పేశాడు ఆదిత్య. డోర్ తెరిచి... డోర్ పక్కన దాగున్నాడు.
విసురుగా లోనికొచ్చిన రౌడీ వెంకట్...
"బెడ్ రూమ్ వరకొచ్చాక ఇక తప్పించుకుని ఎటూ పోలేవు... చూడు పిల్లా... ఎక్కడున్నా లొంగిపో" అంటూ బెడ్ రూమ్ తలుపులేసి లైట్ వేయడానికి స్విచ్ కోసం వెతుకుతున్నాడు వెంకట్.
వెంకట్ ని దగ్గరవరకూ రానిచ్చి ఒకే ఒక్కసారి చెయ్యి మూసి పెనువేగంతో ఒక్కటిచ్చాడు ఆదిత్య.
బరువుగా వున్న ఇనప గుండేదో ముఖాన్ని ఢీకొన్నట్లు వెర్రిగా అరుస్తూ వెనక్కిపడ్డాడు వాడు.
కిందపడ్డ వెంకట్ మీదకు దుమికి చితకబాదేశాడు.
అయిదే అయిదు నిమిషాలు... వెంకట్ కండరాలన్నీ నుజ్జు నుజ్జయి పోయాయి...
బయటనుంచి తలుపు తోస్తున్నా చప్పుడు...
రూమ్ లో లైటేసి కిందపడ్డ వెంకట్ వేపు చూశాడు ఆదిత్య.
ముఖమంతా ఎర్రగా అయిపోయింది. పై పెదవి... ముక్కు... ఏవి ఏ పార్టో తెలియడంలేదు. వాడప్పటికే స్పృహ తప్పిపోయాడు. తలుపు తెరిచి అతన్ని బయటకు తోసేసి వరండాలో లైటు వేశాడు.
అకస్మాత్తుగా అక్కడ కనిపించిన అపరిచిత వ్యక్తిని, ఒక పక్క నెత్తురు ముద్దలా పడున్న వెంకట్ ని చూడగానే పరిస్థితి అర్ధమయిపోయింది ఆ నలుగురుకీ.
"వీడ్ని తీసుకుని మర్యాదగా వెళ్ళిపోండి... లేకపోతే మీరూ కందగడ్డలా మారిపోతారు..."
నలుగురూ ఒకరివేపు ఒకరు చూసుకున్నారు. ఉగ్రంగా నిలబడిన ఆదిత్యవేపు చూశారు.
ఇద్దరు వెంకట్ ని పట్టుకుని ముందుకు నడిచారు... వెనక ఇద్దరు నడుస్తున్నారు.
ఆదిత్య పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.
అప్పటికే స్టోర్ రూంలోనుంచి బయటకొచ్చి ప్రమాదం తప్పినందుకు ప్రశంసగా చూస్తోంది సుమబాల.
ఆ చేతుల్లోని ప్రెటీకి అంతా అయోమయంగా వుంది.
మెట్లు దిగుతున్న వాళ్ళ వెనకే ముందుకొచ్చి మెట్ల పై భాగంలో నుంచున్న ఆదిత్య-
మెట్లమీద మెరుస్తున్న పిస్టల్ ని చూడలేదు. వెనక నడుస్తున్న ఇద్దరిలో ఒకడు ఆ పిస్టల్ని చూసి గబుక్కున తీసి రెప్పపాటులో ఆదిత్య వేపు గురి చూసి కాల్చి పైకి రాబోయాడు.
ఆదిత్య భుజానికి రాసుకొని వెళ్ళిపోయింది బుల్లెట్. ఆదిత్య గబుక్కున ఎగిరి ఆ పిస్టల్ ని పట్టుకున్న వాడి గుండెలమీద తన్ని, కిందపడిన పిస్టల్ ని అందుకొని వాళ్ళని వెంబడించాడు.
అప్పటికే వాళ్ళు వెంకట్ ని ఎత్తుకుని తోటలోంచి గేటు బయటికి వెళ్ళిపోయారు.
మెయిన్ గేటు వరకూ పరిగెత్తుకెళ్ళాడు ఆదిత్య. ఆ వెనక సుమబాల కూతురితో వెళ్ళింది.
వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న ఆదిత్య వెనక్కొచ్చాడు. దారిలో సింహాల్లాంటి రెండు కుక్కలూ మత్తుగా నిద్రపోతున్నాయి.
"వాళ్ళు వెళ్లిపోయారు. మీకేం భయం లేదు" వరండాలో శిల్పంలా నుంచున్న సుమబాలవైపు చూస్తూ అన్నాడు ఆదిత్య.
సుమబాల, ఆదిత్య భుజంవేపు చూస్తోంది. భుజానికి తగిలిన గాయంలోంచి రక్తం స్రవిస్తోంది.
"రక్తం..."
"పర్వాలేదు! చిన్న గాయమే..." జేబులోంచి కర్చీఫ్ తీసి కట్టుకుంటూ అన్నాడు ఆదిత్య. పిస్టల్ ని వరండామీద పెట్టి సుమబాలవేపు చూసి మెయిన్ గేట్ వేపు వెళ్ళిపోతున్నాడు.
"చూడండి" సుమబాల గొంతులోంచి వచ్చిందా మాట.
తలతిప్పి చూశాడు ఆదిత్య.
"థాంక్యూ... థాంక్యూ వెరీమచ్" అంది సుమబాల కృతజ్ఞతగా.
ఏం మాట్లాడలేదు ఆదిత్య. తలదించుకుని బయటికొచ్చేశాడు.
అతనికి వళ్ళంతా నొప్పులుగా వుంది... భుజమ్మీది గాయం సలుపుతూనే వుంది... గాయం తగ్గకుండానే పెదవుల మీద, భుజమ్మీద మళ్ళీ తగిలిన దెబ్బలకు చాలా బాధగా వుంది ఆదిత్యకు.
అయినా-
ఆ బాధనంతటినీ మరిపించే ఒకే ఒక్క మాట అతని మనసులో మెదులుతోంది.
"థాంక్యూ... థాంక్యూ వెరీమచ్."
మసక చీకట్లో వెన్నెల్లా వుందా మాట... పచ్చటి పైరు మధ్యలోంచి వచ్చే గాలిలా వుందా మాట...
తన రూమ్ కొచ్చి నిస్త్రాణగా పడిపోయాడు ఆదిత్య.
అప్పటికి తెల్లవారడానికి రెండు గంటలు మాత్రమే టైముంది.
* * * * *
రెడ్డిపాలెం బస్టాపు దగ్గర జీపు ఆగింది. మఫ్టీలో వున్న ఇన్స్ పెక్టర్ డేవిడ్ జీపులోంచి దిగాడు.
డ్రైవర్ రాములు వేపు చూశాడు.
"ఎవరైనా నన్ను పోల్చి ఏమైనా గొడవ చేస్తే విజిల్ వేస్తాను వచ్చెయ్..." సీటుమీదున్న సిగరెట్ ప్యాకెట్ అందుకుని ముందుకు నడిచాడు డేవిడ్.
"గురుడు విక్రమార్కుడి టైపు" తనలో తను గొణుక్కున్నాడు రాములు.
"ఇవాళ డాక్టర్ ద్వారా ఎలాగైనా శివరాణిని మేనేజ్ చెయ్యాలి" మనసులో నిర్ణయించుకొని... శివరాణి నైటీలోని రూపాన్ని ఊహించుకుని ఆత్రంగా అడుగులేస్తున్నాడు డేవిడ్.